close

తాజా వార్తలు

ఓటమికి భవిష్యత్‌ ఉంటుంది

స్టేజ్‌ నాటకాల స్థాయి నుంచే వచ్చాను
త్వరలో పవన్‌ కల్యాణ్‌తో చిత్రం 

విశాఖపట్నం: డైరెక్టర్‌ హరీశ్‌శంకర్‌ శుక్రవారం సీతమ్మధార ప్రాంతానికి విచ్చేశారు. అభిమానులు ఆయనతో స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో కాసేపు ముచ్చటించారు. సినిమా రంగంలోకి ప్రవేశం, ఎదురైన ఆటుపోట్లు, వాటిని ఎదుర్కొన్న అంశాలను వివరించారు. ఆయన మాటల్లోనే... 
* ‘విజయం సాధించనవాడికి చెప్పుకోవడానికంటూ గతం ఉంటుంది.. ఓటమి పాలైనవాడికి భవిష్యత్‌ ఉంటుంద’నే విషయం నాకు గబ్బర్‌సింగ్‌ చిత్రం విజయవంతం కావడంతో తెలిసింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రవిరాజా పినిశెట్టి దగ్గర పలు చిత్రాలకు పనిచేశాను. డైరెక్టర్‌గా రవితేజతో తీసిన షాక్‌ చిత్రం హిట్‌ కాకపోవడంతో నిరాశపడ్డాను. అప్పుడు నాకు పాటల రచయిత చంద్రబోస్‌ పై సందేశాన్ని పంపించారు. ఆ స్ఫూర్తితో నేను నా బాధను దిగమింగుకొని విజయం వైపు దూసుకెళ్లడం కోసం ప్రయత్నించాను. పవన్‌కల్యాణ్‌ చిత్ర విజయంతో నా కష్టాలు, బాధలు మర్చిపోయాను. జీవితంలో గెలుపోటములు సహజం. వాటిని ఎదురించి నిలబడితే సమాజంలో గుర్తింపు ఉంటుంది. 

* కళాశాల స్థాయి నుంచే నాటకాలంటే ఆసక్తి. స్టేజ్‌కి ఆకర్షితుడినై ఈ రంగంలోకి వచ్చాను. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి సొంతూరు. నాన్న తెలుగు ఉపాధ్యాయులు. దాంతో తెలుగుపై మక్కువ ఏర్పడింది. పుస్తకాలు బాగా చదివేవాడిని. నాటికలు, టీవీ, తద్వారా చిత్ర రంగంలోకి వచ్చాను. పీజీ చదువుకుంటూనే చిత్రాలపై దృష్టి సారించాను. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెబితే మనకెందుకు ఇలాంటివని దెబ్బలాడారు. హైదరాబాద్‌లో బీహెచ్‌ఎల్‌ డ్రామా నాటక కళాపరిషత్‌ వాళ్లంతా నన్ను ప్రోత్సహించేవారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసినప్పుడు డబ్బులు ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులుపడ్డాను. అయినా నా లక్ష్యాన్ని మాత్రం వదలలేదు. అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేను నిలదొక్కుకోవడానికి పదేళ్లు పట్టింది. 


* అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసినప్పుడు పలు చిత్రాల చిత్రీకరణ కోసం విశాఖ వచ్చేవాడిని. ఈ నగరమంటే అభిమానం. పర్యాటక పరంగా  ఎంతో అభివృద్ధి చెందింది. చిత్రీకరణకు ఎంతో అనువుగా ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపుతారు. 

హైదరాబాద్‌లో ఘరానా మొగుడు చిత్రానికి టిక్కెట్టు దొరక్క వర్షంలో ఇంటికి ఏడ్చుకొని వెళ్లాను. మెగాస్టార్‌ ఒక్కో చిత్రాన్నీ సుమారుగా పాతిక సార్లు చూసేవాడిని. చిరంజీవి సినిమా ఆడియో విడుదలకు పాస్‌లు దొరికితో చాలు అనుకునేవాడిని. అలాంటిది నా చిత్రానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం నా జీవితంలో ఎప్పటికీ మరువలేనిది. ఇప్పుడు ఆ విషయాన్ని చిరంజీవితో పంచుకున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది. 

పవన్‌ కల్యాణ్‌తో చిత్రం చేసేందుకు కథ తయారు చేశాను. ఆయన రెండు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అవికాగానే నా చిత్రం సిద్ధమవుతుంది. పవన్‌ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చిత్రం తీసేవిధంగా చూస్తున్నాం. ఆ తరువాత చిరంజీవితో చిత్రం తీస్తా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.