
తాజా వార్తలు
చికిత్స తీసుకుంటూనే.. జనంలోకి!
వైరస్ వ్యాప్తికి ఇదో కారణం
హైదరాబాద్: ఓ వ్యక్తికి(40) కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. తేలికపాటి జలుబు, దగ్గు తప్పా....ఇతర లక్షణాలు పెద్దగా లేవు. మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో హోం ఐసోలేషన్ ప్యాకేజీ తీసుకున్నాడు. వారు స్లాట్ ఇచ్చారు. ఆ సమయంలో వీడియో కాల్లో వైద్యుడు సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి పరిశీలించాలి. ఆ సమయానికి ఆసుపత్రి నుంచి కాల్ వెళ్లింది. అయితే సదరు వ్యక్తి ఆ సమయంలో బయట ఉన్నట్లు డాక్టర్ గుర్తించి అవాక్కయ్యారు. ఇంట్లో ఉండాలని కదా...అంటే అటువైపు నుంచి సమాధానం లేదు. ఒకరు కాదు...ఇద్దరు కాదు...ఇలా ఎంతోమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా సరే రోడ్లపై తిరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అవగాహన లేక కొందరు...ఏమవుతుందిలే...అన్న నిర్లక్ష్యంతో మరికొందరు ఇలా బయటకు వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోడ్లపైకి వస్తున్న వారికో కొందరు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. అడ్డు అదుపు లేకుండా వైరస్ విస్తరణకు ఇదో కారణమని పేర్కొంటున్నారు. దీనివల్ల ఆరోగ్యవంతులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.
గ్రేటర్లో నిత్యం వేయికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కువ శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. మరికొందరిలో తేలికపాటి జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉంటున్నాయి. అత్యవసర పనులు, కూరగాయలు లాంటివి కొనుక్కోవటానికి ఇలాంటి వారు బయటకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఎందుకిలా...
కేసులు తక్కువ సంఖ్యలో నమోదైన తొలినాళ్లలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు, జీహెచ్ఎంసీ పకడ్బందీగా చర్యలు తీసుకునేవారు. కేసులు నమోదైన ప్రాంతంలో అటు ఇటు రెండు కిలోమీటర్ల మేర కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసేవారు. లోపల జనం బయటకు రాకుండా...బయటవారు లోపలకు పోకుండా జాగ్రత్తలు వహించేవారు. తద్వారా ఆ ప్రాంతంలో కేసుల సంఖ్య తగ్గేది. క్రమేణా నగరమంతా కేసులు పెరగడంతోపాటు ఐసీఎంఆర్ కూడా నిబంధనలు సడలించడంతో కంటెయిన్మెంట్ జోన్ల విధానంలో మార్పులు చేశారు. కరోనా కేసులు నమోదైన ఆ ఇంటి చుట్టుపక్కల కంటెయిన్మెంట్ చేసేవారు. తర్వాత కాలంలో అవి కూడా ఎత్తివేసి కేవలం సదరు ఇంటిపైనే నిఘా పెట్టారు. ఇంటిపై క్వారంటైన్ ముద్ర వేసేవారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంటింటా సర్వేలు కన్పించడం లేదు. అసలు పాజిటివ్ వచ్చినా సరే...చాలామందికి ఆ సమాచారమే ఉండటం లేదు. దీంతో పలువురు శాంపిళ్లు ఇచ్చిన తర్వాత కూడా బయట తిరుగుతున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక కూడా ఒకవైపు చికిత్స తీసుకునే బయటకు వస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. ఫలితంగా వైరస్ మరింత వ్యాప్తి చెందే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంట్లో ఎక్కువమంది కుటుంబసభ్యులు ఉంటే...ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ఐసోలేషన్ ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందికి ఈ సమాచారం అందించాలి. వాళ్లు స్పందించకపోతే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.