close

తాజా వార్తలు

Published : 15/07/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లాస్మా బాణం!

కరోనా చికిత్స- కొత్త ఆశ

జబ్బును జబ్బుతోనే తీయాలి! ప్రామాణిక చికిత్సలేవీ లేని కొత్త కరోనా జబ్బుకిప్పుడు ఇలాంటి ఉపాయమే దిక్కవుతోంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించే ‘కన్వల్సెంట్‌ ప్లాస్మా థెరపీ’ కొత్త మార్గాన్ని చూపెడుతోంది. భారత వైద్య పరిశోధన మండలి  దీనికి పచ్చ జెండా ఊపింది. దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఈ చికిత్స కారణంగా వేగంగా కోలుకోవడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దీంతో దిల్లీ ప్రభుత్వం ఏకంగా ప్లాస్మాబ్యాంక్‌నే ఏర్పాటు చేసింది. అదే బాటలో కేరళ కూడా పయనించింది. మహారాష్ట్రలో కూడా ప్లాస్మాదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇక మన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కూడా గత నెల ఐదుగురు పేషెంట్లకు ఈ చికిత్సను అందిస్తే వేగంగా కోలుకొన్నారు.  ఇంతకీ ఏంటీ చికిత్స? ఎలా చేస్తారు? ఎవరికి చేస్తారు?

జీవితం ఓ ప్రవాహం. దీనికి ఆధారం మన లోపలి ప్రవాహం! అవును.. అదే ప్లాస్మా ప్రవాహం. శరీరంలోని అన్ని కణాలకు, అన్ని అవయవాలకు అత్యవసరమైన రక్తాన్ని కదిలించే జీవద్రవ్యం. ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్ర రక్తకణాలు.. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు.. రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్లు.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, పోషకాలు.. ఒక్కటేమిటి? మన ప్రాణం నిలవటానికి అవసరమైన సమస్త సరంజామా అంతా ప్లాస్మాలో తేలియాడుతూనే అన్ని భాగాలకు చేరుకుంటాయి. అంటే ఇది కదిలితేనే మనం కదులుతామన్నమాట! మందూ మాకూ లేని కొవిడ్‌-19 చికిత్స విషయంలోనూ ఇది మనల్ని కదిలిస్తోంది. కొత్త కరోనా వైరస్‌ను మన శరీరం ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొలేదు. దాంతో ఎలా పోరాడాలో మన రోగనిరోధకశక్తికి తెలియనే తెలియదు. ప్రస్తుతానికి దీనికి టీకాలూ లేవు. మనల్నిప్పుడు విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది ఇదే. వైరస్‌, బ్యాక్టీరియా వంటి హానికారక సూక్ష్మక్రిముల ఉద్ధృతి, వాటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది మన రోగనిరోధకశక్తి సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటాయి. రోగనిరోధకశక్తి బలంగా ఉండి, వైరస్‌ అంత ఉద్ధృతంగా లేదనుకోండి. రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగా పుట్టుకొచ్చే యాంటీబాడీలు తేలికగా వైరస్‌ను నిర్మూలించేస్తాయి. అదే వైరస్‌ బలంగా ఉండి, రోగనిరోధకశక్తి అంత బలంగా లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ చాలా తీవ్రంగా దాడిచేస్తుంది. అవయవాలు దెబ్బతిని, ప్రాణాలకూ ముప్పు వాటిల్లొచ్ఛు ప్రస్తుతం కరోనా ఇన్‌ఫెక్షన్‌లో జరుగుతున్నదిదే. ఇది కొత్త వైరస్‌ కావటం, దీన్ని మన రోగనిరోధకశక్తి గతంలో ఎప్పుడూ ఎదుర్కొని ఉండకపోవటం వల్ల ఉద్ధృతంగా దాడిచేస్తోంది. మరణాలూ ఎక్కువగానే సంభవిస్తున్నాయి. మరోవైపు ప్రామాణిక చికిత్సలూ లేవు. దీంతో అందుబాటులో ఉన్న అన్ని చికిత్సలనూ, అన్ని మందులనూ ప్రయోగించక తప్పటం లేదు. ఈ క్రమంలోనే కన్వల్సెంట్‌ ప్లాస్మా చికిత్స ఆశా కిరణంలా కనిపిస్తోంది. నిజానికిది కొత్త చికిత్సేమీ కాదు. గతంలో కరోనా తరగతికే చెందిన వైరస్‌ల మూలంగా విజృంభించిన సార్స్‌, మెర్స్‌ లాంటి జబ్బుల్లోనూ దీన్ని ఉపయోగించారు. ఆ మధ్య ఎబోలా బారినపడ్డవారికీ దీన్ని ఇచ్చారు. కొత్త కరోనా జబ్బు బాధితుల్లోనూ ఇది మంచి ఫలితం చూపిస్తున్నట్టు, ఇన్‌ఫెక్షన్‌ ఉద్ధృతితో పాటు మరణాలూ తగ్గుతున్నట్టు ఇతర దేశాల అనుభవాలూ చెబుతున్నాయి. 

ఏంటీ చికిత్స?

శత్రువును ఎదుర్కోవటానికి సొంత బలం సరిపోవటం లేదు. అప్పుడేం చేస్తాం? ఇతరుల సాయం కోరతాం. కన్వల్సెంట్‌ ప్లాస్మా చికిత్స సరిగ్గా ఇలాంటిదే. జబ్బు నుంచి కోలుకుంటున్న దశను ‘కన్వల్సెన్స్‌’ అంటారు. ఇలాంటి దశలో ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించటమే కన్వల్సెంట్‌ ప్లాస్మా థెరపీ. జబ్బు నుంచి కోలుకున్నవారి ప్లాస్మాలో వైరస్‌ను ఎదుర్కొవటానికి పుట్టుకొచ్చిన యాంటీబాడీలుంటాయి. అందువల్ల దీన్ని ఎక్కిస్తే జబ్బు నుంచి త్వరగా కోలుకోవటానికి వీలవుతుంది. ఎవరికైనా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతోందంటే వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటమో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటమో కారణం కావొచ్ఛు ఇలాంటివారికి ప్లాస్మా చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీబాడీలు వైరస్‌ల పని పట్టి, జబ్బు త్వరగా తగ్గేలా చేస్తాయి. ఒకరకంగా దీన్ని పరోక్ష టీకా చికిత్స అనీ అనుకోవచ్ఛు టీకా ఇచ్చినప్పుడు ఒంట్లోనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. ప్లాస్మా చికిత్సలో ఇతరుల్లో తయారైన యాంటీబాడీలు శరీరానికి అందుతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌ తగ్గటానికి తోడ్పడతాయి.

రెండు రకాలు

యాంటీబాడీలలో ప్రధానంగా ఐజీఎం, ఐజీజీ అని రెండు రకాలుంటాయి. ఐజీఎం యాంటీబాడీలు మన ఒంట్లో వారం రోజుల వరకు ఉంటాయి. ఐజీజీ యాంటీబాడీలు ఇన్‌ఫెక్షన్‌ మొదలైన రెండు వారాల తర్వాత పుట్టుకొస్తాయి. ఇవి ఐదారు నెలల పాటు అలాగే ఉంటాయి. కొందరిలో ఏడాది వరకూ ఉండొచ్ఛు కొన్ని రకాల వైరస్‌లతో పుట్టుకొచ్చే యాంటీబాడీలు 2-3 ఏళ్ల వరకూ ఉండొచ్ఛు కొన్నయితే జీవితాంతమూ ఉండొచ్చు.

ప్లాస్మా ఎవరి నుంచి?

ప్లాస్మాను అందరి నుంచి తీసుకోవటం కుదరదు. దీనికి పరిమితులున్నాయి. కరోనా జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నవారే ప్లాస్మాను ఇవ్వటానికి అర్హులు. కోలుకోవటానికి ముందు రెండు సార్లు వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యిండాలి. అలాగే 28 రోజుల తర్వాత కూడా జబ్బు లక్షణాలేవీ ఉండకూడదు. రక్తంలో హిమోగ్లొబిన్‌ 12.5% కన్నా ఎక్కువగా ఉండాలి. బరువు 55 కిలోల కన్నా ఎక్కువగా ఉండాలి. 18-50 ఏళ్ల మధ్యలో ఉన్నవారి నుంచే ప్లాస్మాను సేకరించాల్సి ఉంటుంది. వీరికి గుండె వేగం, రక్తపోటు వంటివన్నీ మామూలుగా ఉండాలి. రక్తం ద్వారా సంక్రమించే హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి జబ్బులేవీ ఉండకూడదు. రక్తం గ్రూపులూ ఒకటే అయ్యిండాలి. ఇవన్నీ సరిపోయిన వారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉండటమూ ముఖ్యమే. మహిళల విషయంలో- గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల లోపు అబార్షన్లు అయినవారు ప్లాస్మా ఇవ్వటానికి అర్హులు కారు.

చికిత్స ఎవరికి అవసరం?

జబ్బు ఒక మాదిరిగా ఉన్నవారిలో రోగనిరోధకశక్తి వైరస్‌ను బలంగా ఎదుర్కొంటూనే ఉంటుంది. వీరిలో క్రమంగా లక్షణాలూ తగ్గుముఖం పడుతుంటాయి. ఇలాంటివారికి ప్లాస్మా చికిత్స అవసరం లేదు. అలాగే జబ్బు మరీ తీవ్రమై, అవయవాలు దెబ్బతిన్నవారికీ దీంతో అంతగా ప్రయోజనముండదు. రోజురోజుకీ సమస్య తీవ్రమవుతూ వస్తున్నవారికి, వెంటిలేటర్‌ మీద పెట్టాల్సిన పరిస్థితి తలెత్తినవారికి ప్లాస్మా చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి అవసరమన్నది కొన్ని అంశాలను బట్టి నిర్ణయిస్తారు.

శ్వాస వదిలినప్పుడు వచ్చే గాలి పరిమాణం, రక్తంలో ఆక్సిజన్‌ కలిసే శాతాల నిష్పత్తి 300 కన్నా తక్కువకు పడిపోవటం

శ్వాస వేగం 25 దాటటం

గుండె వేగం 100 కన్నా మించిపోవటం

రక్తపోటు బాగా పడిపోవటం

ఊపిరితిత్తులు 50% కన్నా ఎక్కువగా దెబ్బతినటం

ఇవన్నీ సమస్య తీవ్రమైందనటానికి సూచనలే. దీన్ని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. ముందుగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేస్తారు. ఇది కరోనా జబ్బు నిర్ధారణకే కాదు, వైరస్‌ ఉద్ధృతిని తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది. దీంతో చికిత్స ఎలా పనిచేస్తోందో అనేదీ తెలుసుకోవచ్ఛు ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలోకి ఆక్సిజన్‌ ఎంత మోతాదులో కలుస్తోందో తెలుసుకోవటానికి ఆర్టీరియల్‌ బ్లడ్‌ గ్యాస్‌ (ఏబీజీ) పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తుల తీరుతెన్నులను తెలిపే సీటీ స్కాన్‌, గుండె పనితీరును చెప్పే 2డీ ఎకో, కడుపులో సమస్యలను తెలుసుకోవటానికి కడుపు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌.. అలాగే సీబీపీ, సీఆర్‌పీ, డీ డైమర్‌, న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ వంటి పరీక్షలతో పాటు కిడ్నీ, కాలేయ సామర్థ్య పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.

దుష్ప్రభావాలు పెద్దగా ఉండవు

ప్లాస్మా చికిత్స సమర్థంగా పనిచేస్తున్నట్టు, జబ్బు నుంచి త్వరగా కోలుకుంటున్నట్టు విదేశీ అనుభవాలు చెబుతున్నాయి. మరణాలు కూడా తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవనే చెప్పుకోవచ్ఛు రక్తం మార్పిడి మూలంగా కొందరిలో అరుదుగా తలెత్తే దుష్ప్రభావాలు తప్పించి ప్రత్యేకంగా ఇబ్బందులేవీ ఉండవు. నిజానికి ముందుగానే దాత, బాధితుల రక్తాన్ని కలిపి చూసి, ఏవైనా ప్రతికూల చర్యలు జరుగుతున్నాయా అనేవి పరిశీలించాకే మార్పిడి ప్రక్రియను ఆరంభిస్తారు. కాకపోతే చికిత్స చేసేటప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండటం తప్పనిసరి. హఠాత్తుగా రక్తపోటు పడిపోవటం వంటివి తలెత్తితే వెంటనే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్లాస్మా చికిత్స చేసేది జబ్బు తీవ్రతను తగ్గించటానికే. కొందరిలో ప్లాస్మాతో తీవ్రత తగ్గకపోవచ్ఛు ఇలాంటివారిలో జబ్బు మరీ తీవ్రమై కొందరు మరణిస్తుండొచ్ఛు దీనికి ప్లాస్మా ఎక్కించటమే కారణమని చెప్పలేం. జబ్బు తీవ్రమైతే ప్లాస్మా ఎక్కించినా, ఎక్కించకపోయినా మరణించే ప్రమాదముందని గుర్తుంచుకోవాలి.

ఎలా చేస్తారు?

మన రక్తంలో ప్లాస్మా ద్రవంతో పాటు ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్ల వంటివెన్నో ఉంటాయి. ప్లాస్మా చికిత్సకు ఇవేవీ అవసరం లేదు. అందువల్ల ప్రత్యేకమైన పరికరం ద్వారా రక్తాన్ని వడపోసి ప్లాస్మాను మాత్రమే సంగ్రహిస్తారు. ఆయా కణాలన్నీ తిరిగి దాత రక్తంలోకే వెళతాయి. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఒకో దాత నుంచి 400 ఎం.ఎల్‌. ప్లాస్మాను తీసుకుంటారు. ఒక దాత నుంచి తీసుకున్న ప్లాస్మా ఒకరికి ఎక్కించటానికి సరిపోతుంది. ముందుగా 200 ఎం.ఎల్‌. ప్లాస్మాను కరోనా బాధితులకు ఎక్కిస్తారు. అనంతరం 24 గంటలు లేదా 48 గంటల వ్యవధిలో మరో 200 ఎం.ఎల్‌. మోతాదు ఇస్తారు.

ప్లాస్మాను వేరుచేసే పరికరం

* చికిత్స ఆరంభించిన తొలిరోజున ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేసి వైరస్‌ ఉద్ధృతిని గమనిస్తారు. ఈ పరీక్షను 3, 5, 7 రోజుల్లోనూ చేస్తూ.. చికిత్స ఎలా పనిచేస్తోందో గమనిస్తుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.