
తాజా వార్తలు
పెట్రోల్ బంకులో అగ్నికీలలు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సగానికి పైగా దగ్ధమైన బుల్లెట్ వాహనం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది, యువకులు
పట్టాభిపురం, న్యూస్‌టుడే: గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. అందరూ అప్రమత్తమై మంటలు పెట్రోల్ పంపునకు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకోవడం నగర ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అగ్నిమాపక సిబ్బంది, యువకులు తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుల్లెట్ వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి రూ.1000 పెట్రోల్ కొట్టాలని లాడ్జి సెంటర్ పెట్రోల్ బంకులో సిబ్బందికి చెప్పాడు. రూ.950 పెట్రోలు కొట్టేసరికే ట్యాంకు నిండింది. మిగతా పెట్రోల్ ఇంజిన్‌పై పడి మంటలు వచ్చాయి. ఇది గమనించిన వాహనదారుడు వాహనాన్ని పక్కన పడేశాడు. ఊహించని ఈ ఘటనతో వాహనచోదకులు, పాదచారులు పరుగులు తీశారు. బంకు సిబ్బంది వెంటనే తేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యువకులు, బంకు సిబ్బంది కొంతమేర ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బుల్లెట్ వాహనం సగానికి పైగా కాలిపోయింది.ఆంజనేయపేటకు చెందిన వాహనదారుడు వెంకటశివప్రతాప్ ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.