
తాజా వార్తలు
విగ్రహాల ధ్వంసం.. అందరికీ నష్టమే
త్రిదండి చినజీయర్‌స్వామి
చినజీయర్ స్వామితో ఆశీస్సులు తీసుకుంటున్న జిల్లా అర్చకులు
కమలానగర్, న్యూస్‌టుడే: ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే.. అందరికీ నష్టమే అవుతుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. గుత్తిరోడ్డు నగర శివారులోని ఓ ఫంక్షన్ హాలులో స్వధర్మ మహాయజ్ఞం కార్యాక్రమంలో భాగంగా జిల్లాలోని ఆలయాల ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయాల చరిత్ర, ఘనతను ఈ మధ్యకాలంలో మర్చిపోతున్నారని దేవుని విశిష్టతను తెలుపడానికే పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఆలయాలపై కక్షలతోనా, ఈర్ష్యతోనా, కావాలనే దాడులు చేస్తున్నారా..? లేక ధనం కోసమా? అనే విషయాలను ప్రభుత్వమే తేల్చాలన్నారు. ఆలయాలను జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐక్యంగా ఆలయాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కులం, మతం, జాతి, పార్టీలతో సంబంధం లేకుండా ఉండాలని, వీటన్నింటికీ అతీతంగా మనం దేవుళ్లను రక్షించుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రతినిధులను, నిర్వాహకులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో అహోబిలం జీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.