close

తాజా వార్తలు

Updated : 27/01/2021 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలి మీద కోపం.. సైకో అవతారం

18 మంది మహిళలను చంపిన ఉన్మాది
ఒంటరిగా కనిపిస్తే నమ్మించి తీసుకెళ్లి హత్య

ఈనాడు, హైదరాబాద్‌: పెళ్లయిన కొద్దిరోజులకే భార్య మరొకరితో వెళ్లిపోయింది.. అప్పటి నుంచి మహిళలపై పగ పెంచుకున్నాడు. కల్లు, మద్యం దుకాణాల దగ్గర ఒంటరిగా కనిపించే ఆడవాళ్ల వెంటపడతాడు. మాయమాటలు చెప్పి బాగా తాగించి, నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి కోరిక తీర్చుకొని, గుర్తుపట్టడానికి వీల్లేకుండా హత్య చేస్తాడు. ఓ కేసులో కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి.. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మళ్లీ చంపడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కూడా జైలుకెళ్లాడు. ఈసారి బెయిల్‌పై బయటికొచ్చి పాతబాటే పట్టాడు. ఇలా ఏకంగా 18 మంది మహిళలను దారుణంగా చంపిన సైకో మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం వెల్లడించారు.
మేడ్చల్‌ జిల్లా అంకుషాపూర్‌లో ఈ నెల 4న సగం కాలిన మృతదేహం కనిపించింది. ఆమె జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో నివాసముండే మహిళగా గుర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ హత్యకు పాల్పడింది సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన మైనా రాములు(45)గా తేల్చారు. గత నెల 10న కూడా బాలానగర్‌లోని ఓ కల్లు కాంపౌండ్‌ నుంచి మరో మహిళను తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా జాప్తా సింగాయపల్లిలో చంపేసినట్లు నిర్ధారించారు. 2003 నుంచి 2019 వరకు మెదక్‌, రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇలాగే 16 మంది మహిళలను చంపినట్లు తేలింది. ఇటీవలి రెండు హత్యలతో కలిపితే అతడి చేతిలో బలైన మహిళల సంఖ్య 18కి చేరింది.
ఆసుపత్రి నుంచి పరారు
నిందితుడు 2009లో నార్సింగిలో తొలిసారిగా పోలీసులకు చిక్కాడు. 2011లో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ ఏడాది డిసెంబరు 1న అనారోగ్యం కారణంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. అదేనెల 30న మరో అయిదుగురు ఖైదీలతో కలిసి పరారయ్యాడు. తర్వాత బోయిన్‌పల్లిలో 2, చందానగర్‌లో 2, దుండిగల్‌లో ఒకటి చొప్పున హత్యలు చేశాడు. 2013 మే 13న బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. హైకోర్టులో అప్పీలు చేసుకుని 2018 అక్టోబరు 3న బయటికొచ్చాడు. మళ్లీ మరో 2 హత్యలు చేశాడు. ఆ కేసుల్లో 2019లో జైలుకెళ్లాడు. గతేడాది జులై 31న బెయిల్‌పై బయటికొచ్చాడు. ఆపై మరో 2 హత్యలు చేసి తాజాగా పోలీసులకు చిక్కాడు.
మాట కలిపితే అంతే..
అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలను చంపేయాలనిపిస్తుందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇందుకోసం కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాల వద్ద తిరిగేవాడు. అక్కడికొచ్చే మహిళలతో మాట కలుపుతాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకొని చంపేసేవాడు.




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని