‘మోసపోయాను.. అమ్మనాన్న క్షమించండి’
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మోసపోయాను.. అమ్మనాన్న క్షమించండి’


సునీత మృతదేహం

బయ్యారం(వరంగల్‌), న్యూస్‌టుడే: ప్రేమ వ్యవహారంలో ఎదురైన వేధింపులు, ఇరు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బయ్యారం మండలం మిర్యాలపెంట పంచాయతీ పత్యాతండాలో ఆదివారం చోటుచేసుకుంది. సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న అంశాలు, యువతి కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరంసోత్‌ సునీత(21) వరంగల్‌లో బీఈడీ చదువుతున్న రోజుల్లో ఇదే తండాకు చెందిన మాలోతు శివ మాయమాటలతో ప్రేమలోకి దించాడు. చదువు పూర్తయ్యాక కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. సునీత ఏప్రిల్‌ 4న కళాశాల నుంచి ఇంటికి రాగా శివలో వచ్చిన మార్పును గమనించి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై అత్యాచారయత్నంతో పాటు కిడ్నాప్‌నకు యత్నించాడు. ఇది ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసింది. అనంతరం జరిగిన ఘర్షణలో శివతోపాటు సునీత తండ్రి బిచ్చ గాయపడ్డారు. ఇరు కుటుంబాలు ఏప్రిల్‌ 24న బయ్యారం పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టిన పోలీసులు సునీత తండ్రి బిచ్చపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అండగా ఉండే తండ్రి జైలుకు వెళ్లడంతో పాటు తండాలోని కొందరు కుటుంబాన్ని దూషించడాన్ని తట్టుకోలేక సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది. లేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని.. రక్షణ కనిపించడం లేదని, ప్రేమ విషయంలో మోసపోయానని.. అమ్మానాన్న క్షమించాలని, మీరు ధైర్యంగా ఉండాలని లేఖలో రాసింది. ఇదిలా ఉండగా సునీతను వేధిస్తున్న శివపై చర్య తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ధర్నాకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై జగదీష్‌ను వివరణ కోరగా.. సునీత తండ్రిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రేమ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సునీత ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతికి కారణమైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని