Covid: కొవిడ్‌ కట్టడికి లాన్సెట్‌ 8 సూచనలు

తాజా వార్తలు

Updated : 27/05/2021 08:29 IST

Covid: కొవిడ్‌ కట్టడికి లాన్సెట్‌ 8 సూచనలు

దిల్లీ: భారత్‌లో ఉచితంగా కరోనా టీకాలు పంపిణీ చేయాలంటే ‘కేంద్రీకృత సేకరణ, పంపిణీ వ్యవస్థ’ ఉండాలని ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ‘లాన్సెట్‌’ సూచించింది. దేశంలో కరోనా బాధలు అరికట్టడానికి ఎనిమిది సిఫార్సులు చేసింది. 21 మంది ప్రముఖులతో ఏర్పాటయిన ‘భారత ఆరోగ్య వ్యవస్థ పునఃరూపకల్పనకు లాన్సెట్‌ పౌరుల కమిషన్‌’ ఈ సలహాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ 21 మంది కలిసి లాన్సెట్‌ పత్రికలో వ్యాసం రాశారు.
1. టీకాల సేకరణ: ప్రస్తుతం టీకాల సేకరణలో వికేంద్రీకరణ విధానం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తున్నాయి. టీకాలు ఉచితంగా అందించడానికి సేకరణ, పంపిణీలో కేంద్రీకృత విధానమే అమలు చేయాలి. దీనివల్ల సరసమైన ధరలకే టీకాలు లభిస్తాయి. రాష్ట్రాల మధ్య అంతరాయాలు తగ్గుతాయి.
2. జిల్లా స్థాయి కమిటీలు: వేగంగా మారుతున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి జిల్లా స్థాయి వర్కింగ్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలి. వాటికి స్వయంప్రతిపత్తి ఉండాలి. నిధులు, ఇతర సామగ్రి స్వీకరించడానికి అధికారం ఉండాలి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల నుంచి నిపుణుల నుంచి అందర్నీ సమన్వయ పరిచేందుకు అవకాశం ఇవ్వాలి.
3. ధరల విధానం: అత్యవసర వైద్య సేవల ధరలు నియంత్రణలో ఉండేలా పారదర్శకమైన జాతీయ ధరల విధానాన్ని రూపొందించాలి.
4. ప్రభుత్వ-పౌర సహకారం: ప్రభుత్వం-పౌర సంఘాల మధ్య క్రియాశీల సమన్వయం ఉండాలి. సరైన సమాచారం అందజేయడం, ఇళ్ల వద్దనే వైద్య సేవలు అందించడం, వ్యాధి నిరోధక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాణ రక్షణ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, టీకాలు వేయించుకునేలా ప్రోత్సహించడంలో సహకారం ఉండాలి.
5. పారదర్శక గణాంకాలు: ప్రభుత్వం సేకరిస్తున్న గణాంకాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే జిల్లా స్థాయిలో తగిన ప్రణాళికలు రూపొందించడానికి వీలు కలుగుతుంది.
6. ఆధార సహిత సమాచారం: కొవిడ్‌ నిర్వహణలో రుజువులు ఉండే సమాచారం ప్రజల్లో వ్యాప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి.
7. మానవ వనరులు: మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థలో అందుబాటులో ఉండే అన్ని మానవ వనరులను సమీకరించాలి. ప్రయివేటు రంగంలో ఉన్నవారినీ తీసుకోవాలి.
8. నగదు బదిలీ: జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులకు నగదు బదిలీ చేయాలి. తద్వారా మహమ్మారికి గురయ్యే ముప్పు నుంచి తప్పించాలి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టి సహకరించుకోవాలి.

ఈ వ్యాసాన్ని రాసిన వారిలో ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, నారాయణ హృదయాలయ ఛైర్‌పర్సన్‌ దేవి శెట్టి, హార్వర్డ్‌ టి.హెచ్‌. ఛాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ప్రొఫెసర్‌ విక్రం పటేల్‌, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని