AP News: అమ్మలేదని.. ముగ్గురు బిడ్డల బలవన్మరణం

తాజా వార్తలు

Updated : 08/06/2021 08:36 IST

AP News: అమ్మలేదని.. ముగ్గురు బిడ్డల బలవన్మరణం

గోదావరిలో లభ్యమైన మృతదేహాల కేసులో వీడిన మిస్టరీ

కొవ్వూరు వాసులుగా గుర్తించిన పోలీసులు

కుటుంబ సభ్యులతో నరసింహం (పాతచిత్రం)

రాజమహేంద్రవరం నేరవార్తలు, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: నాన్నా.. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లు.. మే ముగ్గురం మిగిలిన పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాం.. అవే చివరి మాటలవుతాయని అనుకోలేదంటూ ఆ తండ్రి బోరున విలపిస్తున్నారు. భార్య మృతి గుండెలు పిండేస్తుంటే.. బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తుండగా.. గోదావరిలో మునిగి చనిపోయింది తన పిల్లలేనని తెలియగానే హతాశుడయ్యారు. మూడురోజుల పాటు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే మృతదేహాలు ఉండగా.. ఎవరూ గుర్తించలేదని పోలీసులే ఖననం చేశారు. అయ్యో ఆఖరి చూపూ దక్కలేదే.. అంటూ ఆయన రోదిస్తుంటే.. చూసినవారు కనీళ్లాపుకోలేకపోయారు. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఇసుకరేవు వద్ద గోదావరిలో తేలిన ముగ్గురి మృతదేహాల విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. కొవ్వూరులోని బాపూజీనగర్‌ ప్రాంతానికి చెందిన మామిడిపల్లి నరసింహం రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు భార్య మాణిక్యం(58)తోపాటు ఇద్దరు కుమార్తెలు కన్నాదేవి(34), నాగమణి(32), కుమారుడు దుర్గారావు(30) ఉన్నారు. ముగ్గురు బిడ్డలూ ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతిలోనే చదువు మానేశారు. కూతుళ్లు ఇంటి వద్దనే ఉంటుండగా, కొడుకు రాజమహేంద్రవరంలోని ఓ మొబైల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. తన పెళ్లి కన్నా.. ముందు సొంతిల్లు కట్టుకుందామన్న పెద్దకూతురు కన్నాదేవి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు కాదనలేకపోయారు. గతేడాది స్వస్థలంలో చిన్నపాటి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అంతలోనే ఇంటావిడ మాణిక్యానికి ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆమెను గత నెల 27న రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. 29న ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్సపొందుతూ 31వ తేదీన మధ్యాహ్నం మృతిచెందారు. ఆ రోజు సాయంత్రం స్థానిక కైలాసభూమిలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆ తరువాత ఏడు గంటల సమయంలో తండ్రిని, మేనమామ నాగేశ్వరావును మీరు ఇంటికి వెళ్లండి.. మేము పనులుచూసుకుని వస్తామనడంతో వారు వెళ్లిపోయారు. అనంతరం కన్నాదేవి, నాగమణి, దుర్గారావు నడుచుకుంటూ ఇసుకరేవు వద్దకు వెళ్లారు. ఎవరో ముగ్గురు ఇక్కడ కూర్చుని ఏడ్చారంటూ విచారణ సమయంలో అక్కడి జాలర్లు పోలీసులకు చెప్పడంతో.. తల్లి మరణంతో మనస్తాపానికి గురైన బిడ్డలు ముగ్గురూ నదిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తానని ఎస్సై నవీన్‌ తెలిపారు.

ఒంటరిగా మిగిలి..

మొన్నటి వరకు ఇల్లాలితో పాటు ముగ్గురు సంతానంతో ఆనందంగా గడిపిన అతనిపై విధి పంజా విసిరింది. కోలుకోలేని రుగ్మతతో ఆరిన ఇంటి దీపం.. కంటిపాపల ఆవేదన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. చిన్ననాటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తమ మాతృమూర్తి ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేని వారు వెక్కి వెక్కి ఏడ్చి, ఒక్కసారిగా గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యతోపాటు చేతికొచ్చిన కన్నబిడ్డలు సైతం అనంత లోకాలకు వెళ్లడంతో ఆ ఇంటి పెద్ద ఒంటరిగా మిగిలాడు. ఆ ఇంటికి తీరని వేదన..అంతలేని రోదనను మిగిల్చిన ఈ ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని