Cyber crime: కొలువుల వల
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 08:44 IST

Cyber crime: కొలువుల వల

కొవిడ్‌ వేళ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగావకాశాలంటూ టోకరా

ఈనాడు, హైదరాబాద్‌

‘టీసీఎస్‌లో కొత్తగా ఓపెనింగ్స్‌ ఉన్నాయ్‌. పుణేలో ఇన్ఫోసిస్‌ కంపెనీ హైదరాబాదీయులకు ప్రాధాన్యం ఇస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలున్నాయ్‌. వెంటనే దరఖాస్తు చేయండి’ అంటూ ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు సైబర్‌ నేరస్థులు కొలువుల వల విసురుతున్నారు. కొవిడ్‌ వేళ ప్రముఖ బహుళజాతి సంస్థల్లో కొత్త ఉద్యోగాలున్నాయంటూ నమ్మిస్తున్నారు. రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. రెండు నెలల్లో ఇలా 54 మంది వారి వలలో చిక్కుకోగా, రూ.1.20 కోట్లు సైబర్‌ నేరస్థుల వశమైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలున్నాయంటే వెంటనే నమ్మొద్దని, ప్రముఖ కంపెనీలు అభ్యర్థుల నుంచి నేరుగా డబ్బు కట్టించుకోవన్న విషయాలను గమనించాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. దిల్లీ.. నోయిడాల్లో ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో ఉన్నాయని వీటిపై నిఘా పెట్టామని తెలిపారు.

బెంగళూరులో...

ఫలక్‌నుమాలో ఉంటున్న సొనాలి ఇటీవల మాన్‌స్టర్‌ డాట్‌కాంలో ఓ ప్రకటన చూసింది. టీసీఎస్‌లో ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగం ఇస్తామన్నది అందులోని సారాంశం. అందులోని నంబర్‌కు ఫోన్‌ చేసింది. ప్రశాంత్‌ అనే వ్యక్తి మాట్లాడాడు. తాను టీసీఎస్‌ బెంగళూరులో లీడ్‌ మేనేజర్‌నని, ప్రతిభ ఉన్నవారికి వెంటనే ఉద్యోగం వస్తుందని చెప్పాడు. రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.10 వేలు కట్టాలని చెప్పగా, ఆ మొత్తాన్ని చెల్లించింది. ధరావతు కింద మూడు నెలల జీతం రూ.1.50 లక్షలు పంపించాలంటే బదిలీ చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుందని చెప్పిన అతను ఫోన్‌ ఆపేశాడు. పలుమార్లు ప్రయత్నించిన తరవాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాన్‌స్టర్‌.. నౌకరీ.. షైన్‌...

విదేశీ కొలువులు, ప్రైవేటు, బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు నౌకరీ డాట్‌కాం, షైన్‌, మాన్‌స్టర్‌, క్వికర్‌ డాట్‌కాం వెబ్‌సైట్లలో అర్హతలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను ఆ వెబ్‌సైట్ల నుంచి సైబర్‌ నేరస్థులు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగార్థులకు నేరుగా ఫోన్లు చేసి తాము ఫలానా కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుము, ధరావతు, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన నగదు పంపించాలంటూ రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు వసూలు చేసుకున్నాక సంప్రదింపులు నిలిపేస్తున్నారు. ఆయా వెబ్‌సైట్ల ప్రతినిధులమని సైబర్‌ నేరస్థులు చెబుతుండడంతో ఉద్యోగార్థులు నిజమేనని నమ్మి మోసపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని