AP News: ఈ కష్టం పగోడికీ రావొద్దు!
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 08:19 IST

AP News: ఈ కష్టం పగోడికీ రావొద్దు!

కరోనాతో ఒకే ఇంటికి చెందిన ఐదుగురి మృతి
అమ్మానాన్న వస్తారన్న ఆశతో బాలుడు
వారు తిరిగి రారని చెప్పలేని దైన్యస్థితిలో మేనమామ

రాజానగరం, న్యూస్‌టుడే: అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మతో ఆన్‌లైన్‌ క్లాసులతో సాగిపోతున్న జీవితం ఓ బాలుడిది.ఆస్ట్రేలియాలో ఉద్యోగమైనా వర్క్‌ ఫ్రంహోం వల్ల అమ్మానాన్న కళ్లముందే విధులు నిర్వర్తిస్తున్నాడు ఓ యువకుడు. వీరిద్దరి జీవితంలో కరోనా కల్లోలం సృష్టించింది. అమ్మానాన్నతో సహా అయిదుగురు పెద్దలను ఆ బాలుడు కోల్పోతే.. అతనికి మేనమామ అయిన ఆ యువకుడు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కన్నీళ్లు రెప్పదాటకుండా మౌనవేదన అనుభవిస్తున్నాడు.తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ మేడిచర్ల వి.సుధీర్‌రాయ్‌(45), ఆయన భార్య శ్వేత హరిత(36), తల్లి ఉమామహేశ్వరి(74), కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. సుధీర్‌రాయ్‌ దంపతులకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. శ్వేతహరిత సోదరుడు బండారు రాజీవ్‌ వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్చాడు. అల్లుడైన 12ఏళ్ల సాయిసత్య సహర్షను చూసుకుంటూ వారింటి వద్దే ఉంటున్నాడు. ఏప్రిల్‌ 25న సుధీర్‌రాయ్‌, మే 9న శ్వేతహరిత, మే 4న ఉమామహేశ్వరి మృతిచెందారు. రాజీవ్‌ ఈ విషయం సహర్షకు చెప్పకుండా ఆసుపత్రిలో ఉన్నారంటూ దాటవేస్తూ వస్తున్నారు. కిర్లంపూడి మండలం రామచంద్రపురంలో ఉంటున్న సహర్ష తాతయ్య, అమ్మమ్మ, రాజీవ్‌ అమ్మానాన్న అయిన బండారు సురేష్‌కుమార్‌(65), శేషవాణి(60) జూన్‌ 1, 2 తేదీల్లో కొవిడ్‌తో కన్నుమూశారు. వారు లేరనే విషయం తెలిస్తే సహర్ష తట్టుకోలేడని రాజీవ్‌ ఈ సంగతీ చెప్పలేదు. ఇప్పటికీ ఇంట్లో అయిదుగురు చనిపోయారనే విషయం బాలుడికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజీవ్‌ ‘వర్క్‌ ఫ్రం హోం’ వల్ల కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. సహర్షకు టీవీ చూసే అలవాటు లేకపోవడం, ఇతరుల నుంచి అమ్మానాన్న విషయాలేవీ తెలియలేదు. రాజీవ్‌ మనోవేదనను, బాలుడి దైన్య స్థితిని తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ శనివారం వారింటికి వెళ్లారు. రాజీవ్‌ను పరామర్శించారు. సహర్షతో కాసేపు మాట్లాడి, అతనితో క్రికెట్‌ ఆడారు. బాలుడికి ఎంపీ కోటాలో కేంద్రీయ విద్యాలయంలో సీటు ఇప్పించి,  చదువుకోవడానికి సహకరిస్తానన్నారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చేస్తానన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని