కుమార్తె అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 17/07/2021 06:55 IST

కుమార్తె అదృశ్యం.. తండ్రి ఆత్మహత్య

ఠాణాలోనే కుప్పకూలిన వైనం..

పర్వతగిరి, న్యూస్‌టుడే: ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆవేదన చెంది ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన ఆ రైతుకు ఇంటర్‌ చదువుతున్న కుమారుడితో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె (15) ఉన్నారు. ఆమె ఈనెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో 8వ తేదీన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు బాలిక తల్లిదండ్రుల కాల్‌డేటాను పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్‌కు చెందిన బాలుడు, ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలుడితో బాలిక మాట్లాడినట్లు గుర్తించారు. కేసు విచారణలో ఉండడం, పది రోజులు గడుస్తున్నా కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో గొడవపడిన నాగరాజు పురుగుమందు తాగి పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. న్యాయం చేయండీ.. అంటూ స్టేషన్‌లోనే కుప్పకూలిపోయారు. పోలీసులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన మృతిచెందారు. ఈ విషయంపై పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌ మాట్లాడుతూ బాలిక అదృశ్యంపై ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదుచేసి సామాజిక మాధ్యమాల ఆధారంగా విచారణ చేపట్టామని చెప్పారు. నాగరాజు పురుగుమందు తాగి స్టేషన్‌కు వచ్చాడని, కేసు విషయమై మాట్లాడుతుండగానే ఆయన నేలకొరిగినట్లు వివరించారు. భర్త మృతిచెందినట్లు భార్య విజయ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని