close

తాజా వార్తలు

బొజ్జనిండా తింటాం.. చలికాలమంతా బజ్జుంటాం!

శీతాకాలం వచ్చిందంటే గజగజే... మనం చలికి నిలువెల్లా వణికిపోతాం... ముసుగు తన్ని చక్కగా బబ్బుంటాం... మన దగ్గర కాస్త నయం... కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా నరాలు కొరికే చలి ఉంటుంది...  దీనికి తట్టుకోలేక కొన్ని జంతువులూ చక్కగా ముసుగు తన్నేస్తాయి! కానీ మనలా కేవలం గంటలు కాదు... రోజులకు రోజులే... నెలలకు నెలలే! దీన్నే హైబర్‌నేషన్‌ (శీతాకాల సుప్తావస్థ) అంటారు. పాపం.. మరి వాటికి ఆకలి వేయదా? అనే అనుమానం మీకు వచ్చిందా? ఇంకెందుకాలస్యం వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందామా మరి!


బంటీ.. నీకు ఆకలేయదా ? ఏంటి!


ధృవపు ఎలుగుబంట్లు, అమెరికన్‌, ఆసియాటిక్‌ ఎలుగుబంట్లు చలికాలంలో గాఢనిద్రలోకి జారుకుంటాయి. అత్యవసరమైతే వెంటనే మెలకువలోకీ రాగలవు. దీర్ఘనిద్రలోకి పోయే కొద్ది రోజుల ముందు నుంచి విపరీతంగా ఆహారాన్ని తీసుకుంటాయి. రోజుకు ఏకంగా 20వేల కెలోరీల శక్తిని సంపాదిస్తాయి. ఒక వారంలోనే దాదాపు 13కిలోల బరువు పెరుగుతాయి. శక్తినంతా కొవ్వురూపంలో మార్చుకుంటాయి. సురక్షిత ప్రాంతానికి చేరుకుని.. హైబర్‌నేషన్‌లోకి వెళ్లగానే ఎలుగుబంటి గుండె కొట్టుకొనే వేగం నిముషానికి 10 నుంచి 8సార్లకు పడిపోతుంది. మాములుగా ఈ వేగం 80 నుంచి 90 వరకు ఉంటుంది. 5 నుంచి ఆరునెలల వరకు దీర్ఘనిద్రలో ఉండగలవు. ఈ సమయంలో కొవ్వురూపంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటాయి.
 


ఓ పిట్ట.. నువ్వు కూడానా!

జంతువులే కాదు... ఒక పక్షీ శీతాకాలంలో చక్కగా దీర్ఘనిద్రలోకి వెళుతుంది. దీని పేరు పూర్‌విల్‌. ఇలా చేసేది ఈ ఒక్క పక్షి జాతి మాత్రమే! ఇది ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో జీవిస్తుంది. చూడటానికి పిచ్చుక, గుడ్లగూబల పోలికలతో ఉంటుంది. దాదాపు 5 నెలలు దీర్ఘనిద్రలో గడుపుతుంది. తన శరీర జీవక్రియల వేగాన్ని, ఖర్చయ్యే శక్తిని తగ్గించుకుంటుంది.


తాబేలుకు చలి బెంబేలు!

బాక్స్‌ టర్టెల్‌.. ఇదో రకం తాబేలు. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. ఇది శీతాకాలంలో దీర్ఘనిద్రలోకి వెళుతుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇవి 70 రోజుల నుంచి 150 రోజుల వరకు ఏకధాటిగా నిద్రపోతాయి. ఆ సమయంలో వీటి గుండె ప్రతి 5 నుంచి 10 నిముషాలకు ఒక్కసారి మాత్రమే కొట్టుకుంటుంది. ఇది కనుక మధ్యలోనే నిద్రలేస్తే  ఇక చనిపోవాల్సిందే పాపం...!


ప..ప.. పాములు!

చాలా జీవులు ఒంటరిగా... దేనికదే శీతాకాల నిద్రలోకి జారుకుంటే... కెనడాలో గార్డర్‌ పాములు మాత్రం మూకుమ్మడిగా దీర్ఘనిద్రలోకి పోతాయి. చలికాలం దగ్గరవ్వగానే వందలకు వందలు ఓ చోట పోగవుతాయి. ఒకదానికొకటి అల్లుకుని వెచ్చదనాన్ని పొందుతాయి. శీతాకాలం ముగిసేంత వరకు ఇవి ఇలానే ఉంటాయి.


ఉడతా ఉడతా ఊచ్‌.. నిద్రపోతావోచ్‌!

ఉడతలన్నీ శీతాకాల నిద్రలోకి జారుకోవు కానీ.. ఆర్కిటిక్‌ నేల ఉడతల వంటివి (ఆర్కిటిక్‌ గ్రౌండ్‌ స్క్వురల్‌) మాత్రం దీర్ఘకాలం నిద్రపోతాయి. మాములుగా ఉడతలు చెట్లపై ఉంటాయి. కానీ ఇవి నేల బొరియల్లో జీవిస్తుంటాయి. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా కనిష్ఠస్థాయికి చేరుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఏడు నుంచి 8 నెలలు హైబర్‌నేషన్‌ స్థితిలోనే ఉంటాయి.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.