
తాజా వార్తలు
అత్యవసర రుణ హామీ పథకం కింద
ఎంఎస్ఎంఈలకు రూ.52000 కోట్లు
దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కోసం తీసుకొచ్చిన రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం కింద బ్యాంకులు రూ.52,255.53 కోట్లు పంపిణీ చేశాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ 1 ఈ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. జులై 1కి ఈ పథకం కింద బ్యాంకులు రూ.1,10,343.77 కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ.52,255.53 కోట్లను ఇప్పటికే మంజూరు చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.63,234.94 కోట్లు మంజూరు చేయగా.. రూ.33,349.13 కోట్లు పంపిణీ చేశాయి. ఇక ప్రైవేటు బ్యాంకులు రూ.47,108.83 కోట్లు మంజూరు చేయగా.. ఎంఎస్ఎంఈలకు రూ.18,906.40 కోట్లు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ రూ.20,281 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రూ.12,885 కోట్లు పంపిణీ చేసింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.7,957 కోట్లు మంజూరు చేయగా.. రూ.2404 కోట్లు ఇచ్చింది.