close

తాజా వార్తలు

Updated : 22/10/2020 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆశల పునాదికి సమాధి!

ఐదేళ్లలో అంతా ఆవిరి
నాడు రాజధాని శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోదీ
అమరావతి అద్భుత నగరంగా, ప్రజా రాజధానిగా భాసిల్లుతుందని ఆకాంక్ష
నాలుగేళ్లలో ఎంతో పురోగతి
3 రాజధానుల నిర్ణయంతో నేడు అనిశ్చితి
అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి 5ఏళ్లు

సరిగ్గా ఐదేళ్ల కిందట.. ఒక గొప్ప సంకల్పానికి బీజం పడిన రోజు.. దేశమంతా విజయదశమి వేడుక నిర్వహించుకుంటున్న వేళ.. అయిదు కోట్ల ఆంధ్రుల అస్తిత్వానికి చిహ్నంగా, పట్టుదలకు ప్రతీకగా అమరావతి పేరుతో కొత్త రాజధాని నిర్మాణానికి ప్రధాని చేతులమీదుగా పునాదిరాయి పడింది. ఆనాటి నుంచి ప్రభుత్వం అమరావతి సాకారం కోసం అహోరాత్రాలు శ్రమించింది ఒక్కొక్క వనరూ సమకూర్చుకుంటూ వడివడిగా అడుగులేసింది.. అయిదేళ్లయ్యాక ప్రభుత్వం మారింది.. అమరావతి భవిత అగమ్యగోచరమైంది ప్రజారాజధాని కావాలన్న ప్రజల ఆకాంక్షల పల్లవి మూగబోయింది. భూములిచ్చిన రైతుల బతుకు కన్నీటి సంద్రమైంది..


విజయదశమి పర్వదినాన ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల చరిత్ర, ఘనమైన సంస్కృతితో తులతూగుతున్న అమరావతి.. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు కేంద్ర స్థానంగా, ప్రజా రాజధానిగా ఆవిర్భవించనుంది. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ సాగించే ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుంటుందని హామీ ఇస్తున్నా. విభజన చట్టంలో చెప్పినవన్నీ తూచ తప్పక అమలు చేస్తామని అమరావతి వేదికగా ప్రకటిస్తున్నా.

- నాటి సభలో ప్రధాని మోదీ


అంతా సక్రమంగా జరిగి ఉంటే.. ఇప్పటికే రాజధాని అమరావతిలో పరిపాలన నగరం దాదాపు పూర్తయ్యేది. ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు, ఇతర సంస్థల భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుండేది. వేల సంఖ్యలో కార్మికులతో, రాజధానికి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో సజీవ స్రవంతిలా కనిపించేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిలో పనులు నిలిపేయడం, మూడు రాజధానుల చట్టం తేవడంతో.. ఇప్పుడు రాజధాని వీధుల్లో, నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రదేశాల్లో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆవేదన, ఆక్రందన అడుగడుగునా ప్రతిధ్వనిస్తోంది. అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో రాష్ట్రంలోని పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి ఆనాటి వైభవానికి ఆనవాలుగా మిగిలిపోయింది. అంత మంది పెద్దలు ఆనాడు చేసిన బాసలేమయ్యాయని నిలదీస్తోంది.

నాడు

ఒక మహానగరాన్ని నిర్మించుకోవాలన్న ఆశ, దాన్ని ప్రజారాజధానిగా మలచుకోవాలన్న ఆకాంక్షలతో మొదలుపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్ల కిందట విజయదశమినాడు శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, అసోం గవర్నర్‌ పీబీ ఆచార్య, నాటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, జపాన్‌ మంత్రి యుసుకె టకారీ తరలివచ్చారు. అమరావతి ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని, పావన యమునా నదీ జలాల్నీ తీసుకొచ్చిన మోదీ.. సాక్షాత్తూ దేశ రాజధానే అమరావతికి తరలి వచ్చిందనడానికి అవి సంకేతమన్నారు.  రాజధాని నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా   సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

నేడు

రాజధానికి భూములిచ్చిన రైతుల ఆవేదన, ఆక్రందన అడుగడుగునా ప్రతిధ్వనిస్తోంది. అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో రాష్ట్రంలోని పవిత్ర స్థలాల నుంచి, గ్రామ గ్రామాల నుంచి తెచ్చిన మట్టి ఆనాటి వైభవానికి ఆనవాలుగా మిగిలిపోయింది. అంత మంది పెద్దలు ఆనాడు చేసిన బాసలేమయ్యాయని నిలదీస్తోంది.

నాడు ప్రధాని మోదీ ఏమన్నారంటే..

2015 అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నాటి సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..
* దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చాలా తక్కువ నగరాల్నే నిర్మించగలిగాం. మనకు కొత్త నగరాల అవసరం ఎంతో ఉంది. దేశంలో పట్టణీకరణ దిశగా వేసిన కొత్త అడుగుకు ఆంధ్రప్రదేశ్‌, అమరావతి మార్గదర్శిగా నిలుస్తాయని ఆశిస్తున్నాను.
* రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాజధాని నిర్మాణ ప్రక్రియను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాల్ని, నమూనాల్ని మేళవించి ఈ నగర నిర్మాణం చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు.
* కొత్త నగరం నిర్మించడంలో ఇబ్బందులన్నీ నాకు అనుభవమే. 2001లో భారీ భూకంపానికి గుజరాత్‌లోని కచ్‌ జిల్లా అతలాకుతలమైంది. నేను ముఖ్యమంత్రినయ్యాక కచ్‌ పునర్నిర్మాణం చేపట్టాం. రాజకీయ సంకల్పం, ప్రజల సహకారం, చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేరగలిగాం.


అమరావతి భవిష్యత్తు సురక్షితం
- వెంకయ్య నాయుడు (కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో)

మరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, రెడ్డిరాజుల నుంచి ఆఖరికి ధరణి కోటను పరిపాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వరకు ఉన్న ఘనమైన చరిత్రను కాపాడుకునేందుకు కృషి చేయాలి. దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలబెడతామని సంకల్పబద్ధులం కావాలి.


మేటి రాజధానిని నిర్మిస్తాం
- చంద్రబాబు (ఏపీ సీఎం హోదాలో)

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం. ఇది ప్రజా రాజధాని. ప్రజల భాగస్వామ్యం అవసరం. అందుకే మన నీరు, మన మట్టి కార్యక్రమానికి పిలుపునిస్తే.. అపూర్వమైన స్పందన వచ్చింది. 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల నుంచి పవిత్రమైన మట్టి, నీరు తెచ్చారు. అమరావతికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి ఈశాన్యంలో నీరు ప్రవహిస్తోంది. అమరావతిని అత్యుత్తమమైన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుతాం.


గొప్ప నగరం కావాలి
- కేసీఆర్‌, తెలంగాణ సీఎం

విజయదశమి రోజు ప్రారంభమైన అమరావతి ప్రస్థానం అద్భుతంగా సాగాలి. ప్రపంచంలోనే గొప్ప నగరంగా రూపుదిద్దుకోవాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాల్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది.


అభివృద్ధి జరిగిందిలా..

మరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్లకు పైగా సాయం కావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు, ఆకర్షణీయ నగరాల అభివృద్ధి ప్రాజెక్టు కింద మరో రూ.800 కోట్ల వరకు నిధులిచ్చింది. గుంటూరులో భూగర్భ మురుగునీటిపారుదల, విజయవాడలో వర్షపు నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటుకు కలిపి రూ.1000 కోట్లు అందించింది.
* పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.
* రైతుల్ని ఒప్పించి ప్రభుత్వం భూసమీకరణ ప్రారంభించింది. రెండు నెలల్లోనే 29 వేల మందికిపైగా 34 వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకారపత్రాలు అందజేశారు.
* నాలుగేళ్లలో రాజధానికి భూసమీకరణ, ప్రణాళికలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర భవనాలకు ఆకృతుల రూపకల్పన పూర్తయింది. నిర్మాణాలూ వేగంగా కొనసాగాయి.
* 2015 జూన్‌ నాటికి రాజధానిలో మౌలిక వసతులు, పరిపాలనా నగరానికి బృహత్‌ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి రూ.53 వేల కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. రూ.10 వేల కోట్ల విలువైన పనులు జరిగాయి.
* వెలగపూడిలో ప్రస్తుత సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణం పూర్తయి వాటిలో కార్యకలాపాలు నడుస్తున్నాయి.
* 145 సంస్థలకు భూములు కేటాయించారు. విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు వచ్చాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నిర్మాణం దాదాపు కొలిక్కివచ్చింది.
* సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు భవనాల పనులు ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేల సంఖ్యలో నివాసగృహాల టవర్ల నిర్మాణం కొలిక్కి వచ్చింది. మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణం మొదలైంది. భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల పనులూ ప్రారంభమయ్యాయి.
* రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు విడుదల చేస్తే 2 గంటల్లోనే రూ.2 వేల కోట్లు వచ్చాయి. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు ఆన్‌లైన్‌లో ఫ్లాట్ల బుకింగ్‌ నిర్వహిస్తే.. గంటల వ్యవధిలోనే 1200 బుక్కయ్యాయి.


విధ్వంసం సాగుతోందిలా..

మరావతి పనులు నిలిపివేయాలన్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజల ఆశల్ని చిదిమేశాయి. వైకాపా అధికారంలోకి రాగానే రాజధానిలో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేసింది. అమరావతి ముంపు ప్రాంతమని, కృష్ణా నదికి వరదలొస్తే అదంతా మునిగిపోతుందని కొందరు మంత్రులు, అధికార పార్టీ నాయకులు పదేపదే వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్‌ చూపించిందే తప్ప అక్కడేమీ నిర్మాణాలు జరగలేదని ప్రచారం చేశారు.
* మరోపక్క రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన పేరుతో జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌కీ బాధ్యతలు అప్పగించింది. వాటి నివేదికలు రాకముందే ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. తర్వాత ఆ రెండు కమిటీలూ మూడు రాజధానులు ఉండాలని నివేదించాయి. అమరావతిలో శాసనసభ ఉంటే చాలని చెప్పాయి.
* రూ.వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు 16 నెలలుగా నిలిచిపోవడంతో అవి పాడవుతున్నాయి.


వాళ్లు వెళ్లిపోయారు

* రాజధానిలో అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్‌ ప్రభుత్వం.. వైకాపా ప్రభుత్వ వైఖరి చూసి ఒప్పందం రద్దు చేసుకుని వెళ్లిపోయింది.
* అమరావతికి జపాన్‌ నుంచి పెట్టుబడులు ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం వెయ్యి చ.మీ.ల విస్తీర్ణంలో ‘హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌’ పేరుతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వాళ్లూ వెళ్లిపోయారు.
* రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో రాజధానికి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుంది.


ఆసియా, పసిఫిక్‌కు ముఖద్వారం
- యుసుకె టకారీ, జపాన్‌ మంత్రి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి అమరావతి ముఖద్వారంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో నాడు బౌద్ధం విలసిల్లింది. కొత్త నగరాల నిర్మాణంలో మా అనుభవాల్ని, సాంకేతికతను అందించి అమరావతి నిర్మాణానికి సంపూర్ణంగా సహకరిస్తాం.


ఆంధ్రులు గర్వించేలా ఎదుగుతుంది
- ఈశ్వరన్‌, సింగపూర్‌ మంత్రి

ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతికి అద్దం పట్టేలా అమరావతిని నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు మమ్మల్ని కోరారు. పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ మమ్మల్ని ఆహ్వానించారు. ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలతో మెరుగైన జీవనం అందించే నగరంగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వించే స్థాయికి అమరావతి ఎదుగుతుంది.

- ఈనాడు, అమరావతి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.