close

తాజా వార్తలు

Updated : 17/09/2020 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ పేలిన డ్రాగన్‌

  భారత స్థావరం వైపు దూసుకొచ్చిన చైనా బలగాలు
  మన సైనికులు స్థిరంగా నిలబడటంతో చేసేదేం లేక వెనక్కి
  వెళ్తూ వెళ్తూ గాల్లోకి 200 రౌండ్ల కాల్పులు
  పాంగాంగ్‌కు ఉత్తరాన గతవారం ఘటన

దిల్లీ, బీజింగ్‌: సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, కుయుక్తులకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 45 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెల ఏడున కాల్పులకు తెగబడిన డ్రాగన్‌ దళాలు.. మరోసారి అదే దురాగతానికి పాల్పడ్డాయి. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ఉత్తరపు ఒడ్డున భారత బలగాలను భయపెట్టేందుకుగాను గాల్లోకి దాదాపు 200 రౌండ్లు కాల్పులు జరిపాయి. ఈ నెల 10న భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు మాస్కోలో భేటీ కావడానికి ముందు ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. పాంగాంగ్‌కు ఉత్తరాన ఫింగర్‌-4 రిడ్జ్‌లైన్‌ వద్ద మన సైన్యం ఇటీవల బలగాల మోహరింపును భారీగా పెంచింది. అక్కడ ఏర్పాటుచేసిన సైనిక స్థావరం వైపునకు గత వారం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు దూకుడుగా దూసుకొచ్చారు. వారికి భారత సైనికులు ఏమాత్రం వెరవలేదు. స్థిరంగా నిలబడ్డారు. దీంతో చేసేదేం లేక చైనీయులు వెనక్కి తగ్గారు. అయితే- వెనక్కి వెళ్తూ వెళ్తూ మన సైనికులను భయపెట్టేందుకుగాను 100-200 రౌండ్ల వరకు గాల్లోకి కాల్పులు జరిపారు.

సరిహద్దులకు బోఫోర్స్‌
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. సరిహద్దులకు భారీగా బలగాలు, ఆయుధ సామగ్రిని చేరవేస్తోంది. ఇందులో భాగంగా లద్దాఖ్‌లో బోఫోర్స్‌ హావిట్జర్లను మోహరించాలని అధికారులు నిర్ణయించారు. 1980వ దశకంలో అవి మన సైన్యంలో చేరాయి. కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాయి. శత్రు సైనికులకు చెందిన బంకర్లు, ఎత్తయిన ప్రాంతాల్లో వారు నిర్మించుకున్న శిబిరాలను తునాతునకలు చేశాయి. ప్రస్తుతం బోఫోర్స్‌ హావిట్జర్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయిన వెంటనే లద్దాఖ్‌ సరిహద్దుల్లో మోహరించనున్నారు.
పూర్తిస్థాయి యుద్ధానికి భారత్‌ సిద్ధం
తూర్పు లద్దాఖ్‌లో శీతాకాలంలోనూ చైనాతో పూర్తిస్థాయి యుద్ధంలో తలపడేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని విశ్రాంత బ్రిగేడియర్‌ హేమంత్‌ మహాజన్‌ తెలిపారు. డ్రాగన్‌ సైన్యంలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారేనని ఆయన తెలిపారు. వారు పెద్దగా కష్టాలను అనుభవించి ఉండరని, క్షేత్రస్థాయిలో దీర్ఘకాలంపాటు విధుల్లో ఉండటంలోనూ సిద్ధహస్తులు కారని వివరించారు. వారితో పోలిస్తే భారత సైనికులు మెరుగ్గా పోరాడగలరని తెలిపారు. శీతాకాలంలో పోరాడే సామర్థ్యం భారత సైన్యానికి లేదని, అందుకు తగిన వసతులు అందుబాటులో లేవని చైనా ప్రభుత్వ రంగ వార్తాసంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ఓ కథనాన్ని వెలువరించిన నేపథ్యంలో మహాజన్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. ఏటా నవంబరు తర్వాత లద్దాఖ్‌లో 40 అడుగుల వరకు మంచు పేరుకుపోతుంటుందని, మైనస్‌ 30-40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుందని ఆయన చెప్పారు. అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ పోరాడేందుకు భారత సైనికులు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ సన్నద్ధతతో ఉన్నారని పేర్కొన్నారు.
మేం శాంతికి కట్టుబడి ఉన్నాం: చైనా
సరిహద్దులకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను డ్రాగన్‌ బలగాలు ఉల్లంఘిస్తున్నాయంటూ లోక్‌సభ వేదికగా రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన విమర్శలపై చైనా మండిపడింది. భారతే తప్పుడు విధానాలను అవలంబిస్తోందని ఆరోపించింది. మరోవైపు, తాము భారత్‌తో ఒప్పందాలను ఉల్లంఘించడం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెన్‌బిన్‌ స్పష్టం చేశారు. శాంతిని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 


భారతీయ సంగీతంతో ఏమార్చేందుకు చైనా ప్రయత్నాలు!

కొన్నేళ్ల క్రితం నాటి సంగతి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు సమీపంలో చైనాతో సరిహద్దుల్లో గస్తీ తిరుగుతూ భారత యువ సైనికాధికారి ఒకరు బాగా అలిసిపోయారు. సేద తీరేందుకుగాను ‘చోటా కిల్లా’ అనే ఓ స్థావరం వద్ద నీడలో కూర్చున్నారు. అక్కడ ఆయనకు హాయిగొలిపే బాలీవుడ్‌ సంగీతం వినిపించింది. చుట్టుపక్కల భారతీయులెవరు లేకున్నా ఆ సంగీతమెక్కడి నుంచి వస్తోందబ్బా అని వెనక్కి తిరిగి చూశారు. ఇద్దరు చైనా సైనికులు ఆయన వైపు చేతులు ఊపుతూ (కాస్త స్నేహభావంతోనే) కనిపించారు. వారి వద్ద నుంచే ఆ పాట వినిపిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు.
* చైనీయులు బాలీవుడ్‌ సంగీతాన్ని అమితంగా ఇష్టపడతారని చెప్పేందుకు నిదర్శనమీ ఘటన. ఇప్పటికీ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ అధికారి (పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు) నాటి అనుభవాన్ని తాజాగా ‘ఈటీవీ భారత్‌’తో పంచుకున్నారు.
* ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే- ఇప్పుడు కూడా చైనా శిబిరాల నుంచి భారతీయ సంగీతం వినిపిస్తూనే ఉంది. తాజాగా పాంగాంగ్‌కు ఉత్తరాన పరస్పరం కేవలం 200 మీటర్ల దూరంలో ఇరు దేశాల బలగాలు శిబిరాలను ఏర్పాటుచేసుకోగా.. చైనా గుడారాల నుంచి పంజాబీ హిట్‌ పాటలు వినిపించాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. చైనీయులకు భారతీయ సంగీతమంటే ఇష్టమేనని.. కానీ, మన సైనికుల దృష్టిని ఏమార్చేందుకు కూడా వారు ఒక్కోసారి ఇలాంటి పాటలు వినిపిస్తుంటారని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే- ప్రస్తుతం భారత సైనికులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని ఆయన చెప్పారు. మానసికంగానూ చాలా దృఢంగా ఉన్నట్లు తెలిపారు. బాలీవుడ్‌ సంగీతాన్ని వినిపించినంత మాత్రాన మన సైనికులు రెప్పపాటైనా తమ విధులను విస్మరిస్తారని చైనా ఆశించడం మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.