close

తాజా వార్తలు

Published : 23/10/2020 05:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అపహరించిన 2 గంటల్లోనే హత్య

 గొంతు నులిమి.. పెట్రోలుతో కాల్చి..
 డబ్బు కోసం బతికే ఉన్నట్లు నాటకం
చిన్నారి తండ్రి ఊరివాడే హంతకుడు
బాలుడి కిడ్నాప్‌ విషాదాంతం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే- యంత్రాంగం: మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం విషాదాంతమయ్యింది. జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీకి చెందిన కుసుమ వసంత-రంజిత్‌రెడ్డిల పెద్ద కుమారుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) అపహరణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితుడు మంద సాగర్‌ రెండు గంటల్లోనే కిరాతకంగా హత్య చేశాడు. దీక్షిత్‌ను చంపేసినా అతడు బతికే ఉన్నట్లు నమ్మిస్తూ... రూ.45 లక్షలు కావాలని బాలుడి తల్లిదండ్రులను డిమాండ్‌ చేశాడు. ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన ప్రతిసారీ ఎక్కడా దీక్షిత్‌కు హాని చేస్తానని హెచ్చరించలేదు. పైగా జ్వరంగా ఉంటే మాత్ర వేసినట్లు నమ్మబలికాడు. బాలుడి తల్లిదండ్రులు సొమ్ము చెల్లించడానికి సిద్ధమైనందున కిడ్నాప్‌ కథ సుఖాంతమవుతుందని అందరూ భావించారు. కానీ క్రూరంగా హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీక్షిత్‌ హత్యోదంతం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు తిరిగిరాడన్న చేదు నిజాన్ని తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దానమయ్య గుట్టలకు తీసుకెళ్లి..
బాలుడిని కిడ్నాప్‌ చేసిన మంద సాగర్‌ది మహబూబాబాద్‌ మండలం శనిగపురం. పట్టణంలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. బాలుడి తండ్రి రంజిత్‌రెడ్డిది అదే ఊరు కావడం, గ్రామంలో రంజిత్‌-సాగర్‌ల ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో బాలుడు దీక్షిత్‌రెడ్డికి హంతకుడు తెలుసు. సాగర్‌ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో తోటి స్నేహితులతో ఆడుకుంటున్న దీక్షిత్‌కు చాక్లెట్‌ ఆశ చూపి బైక్‌పై ఎక్కించుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్‌ కూడా.. ‘సాగర్‌ అన్నయ్య వచ్చాడు.. వెళుతున్నా’ అంటూ స్నేహితులకు టాటా చెప్పాడు. దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసిన సాగర్‌ మహబూబాబాద్‌ నుంచి ప్రధాన రహదారి మీదుగా కేసముద్రం మండలం అన్నారం గ్రామ పరిధిలో ఉండే దానమయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఇది బాలుడిని కిడ్నాప్‌ చేసిన ప్రాంతం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. బైక్‌పై వెళుతున్న సమయంలో పట్టణ శివారులోని సీసీ కెమెరాలో దీక్షిత్‌ను బైక్‌పై తీసుకువెళుతున్న దృశ్యం నిక్షిప్తమైంది. దీక్షిత్‌ను దానమయ్య గుట్టపైకి సుమారు 100 మీటర్ల ఎత్తులోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే 2గంటల సేపు ఉంచాడు. ఇంటికి వెళదామని అనడంతో బాలుడితో మత్తు మాత్ర మింగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. బాలుడు ఇంటికి వెళితే తన బండారం బయటపడుతుందని భావించి అపస్మారక స్థితికి చేరుకున్నాక సుమారు 8 గంటల ప్రాంతంలో దీక్షిత్‌ను గొంతునులిమి చంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం హంతకుడు శనిగపురంలోని ఇంటికి వెళ్లి మళ్లీ రాత్రి 9.15 గంటల ప్రాంతంలో తొలిసారి బాలుడి తల్లి వసంతకు కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని ఎవరైనా చూస్తే ఆధారాలు దొరుకుతాయేమో అని భావించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గుట్టపైకి వచ్చాడు. వెళ్లేటప్పుడు సీసాలో పెట్రోలు తీసుకెళ్లి మృతదేహాన్ని కాల్చివేశాడు. ఆ సమయంలో బాలుడి చేతులు కట్టేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది.

అందరిలోనే కలిసి తిరుగుతూ..
దీక్షిత్‌ను హత్య చేశాక సాగర్‌ అందరితోనే కలిసి తిరుగుతూ అక్కడ ఏం జరుగుతోందో పరిశీలించాడు. బాలుడి తల్లిదండ్రులకు ఇం
ర్నెట్‌ కాల్‌ చేసినప్పుడల్లా మీరు ఎక్కడెక్కడికి వెళుతున్నారో.. నాకు తెలుస్తూనే ఉంటుంది. పోలీసులకు చెబుతున్నారా అంటూ హెచ్చరించడాన్ని బట్టి సాగర్‌ పట్టణంలోనే తిరుగాడినట్లు అనుమానిస్తున్నారు. రంజిత్‌రెడ్డి తన కుమారుడు కిడ్నాప్‌ అయిన విషయాన్ని అగంతకుడి నుంచి ఆదివారం రాత్రి 9.15 గంటలకు వచ్చిన ఇంటర్నెట్‌ ఫోన్‌కాల్‌ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఎస్పీ కోటిరెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది పట్టణమంతా విస్తృతంగా గాలింపు చేపట్టారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి.. పలువురిని విచారించారు. బాలుడి తల్లిదండ్రులకు కిడ్నాపర్‌ ఆదివారం రాత్రి మొదలుకొని సోమవారం మధ్యాహ్నం, మంగళ, బుధవారాల్లో మొత్తం ఏడు సార్లు ఇంటర్నెట్‌ కాల్‌ చేశాడు. సొమ్ము సిద్ధం చేసుకుని బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మూడుకొట్ల ప్రాంతంలోని కిడ్నాపర్‌ చెప్పిన ప్రదేశానికి వెళ్లిన రంజిత్‌ రాత్రి 9 గంటల వరకు నిరీక్షించారు. కొంతసేపటికి సాగర్‌ ఫోన్‌ చేసి తాళ్లపూసపల్లి రహదారి వైపు రావాలనడంతో అక్కడికి వెళ్లారు. గురువారం వేకువజాము వరకూ కిడ్నాపర్‌ జాడ లేదు. ఈలోగానే పోలీసులు అతని ఆచూకీ కనుగొని.. అదుపులోకి తీసుకోవడంతో బాలుడిని క్రూరంగా చంపేసింది మెకానిక్‌ సాగరే అని నిర్ధారణ అయింది.
స్థిరత్వం లేని మనస్తత్వం
హంతకుడు సాగర్‌ది చిన్నప్పటి నుంచీ స్థిరత్వం లేని మనస్తత్వమని శనిగపురం వాసులు కొందరు చెప్పారు. ఇతని తండ్రి మేస్త్రీ పనులు చేస్తుంటాడు. తల్లి గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహించింది. వీరి ముగ్గురు సంతానంలో సాగర్‌ అవివాహితుడు. ఇతను చిన్నప్పటి నుంచే జల్సా జీవనానికి అలవాటుపడ్డాడు. డబ్బులు ఇవ్వమని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడేవాడు. గతంలో ఓ పోలీస్‌ అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఇప్పుడు మహబూబాబాద్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

అప్పుడు బాలిక.. ఇప్పుడు బాలుడు
దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసి పాశవికంగా హత్య చేసిన ఘటన లాంటిదే గతంలో ఉమ్మడి వరంగల్‌లో చోటుచేసుకుంది. 2007 డిసెంబరులో వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన మనీషా(11) అనే బాలికను ముగ్గురు దుండగులు కిడ్నాప్‌ చేశారు. రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని బాధితులను బెదిరించారు. సమయానికి డబ్బు అందకపోవడంతో పాపను హత్య చేసి ధర్మసాగర్‌ మండలం తాటికాయల శివారులోని బావిలో పడేశారు. నిందితులను పోలీసులు పట్టుకుని.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ముగ్గురినీ ఎన్‌కౌంటర్‌ చేశారు.

అలాగే చంపాలి: బాలుడి తల్లిదండ్రులు

‘‘నా కొడుకుని ఎలా చిత్రహింసలు పెట్టి చంపారో వారిని కూడా అలానే చంపాలి. మా బాబు తెలివైనవాడు. ఎలాగైనా అగంతకుల నుంచి తప్పించుకుని వస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నాకు కడుపుకోత మిగిల్చారు. దీక్షిత్‌ను ఎక్కడైతే హతమార్చారో దోషులను అక్కడే శిక్షించాలి’’ అంటూ బాలుడి తల్లి వసంత రోదించారు. ‘‘బాబును రక్షించుకోవడానికి ఇతరుల నుంచి డబ్బు తెచ్చాం. అయినా దక్కలేదు. దోషులను కఠినంగా శిక్షించి మరొకరికి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని దీక్షిత్‌ తండ్రి రంజిత్‌ విలపిస్తూ చెప్పారు.

సవాల్‌గా ఇంటర్నెట్‌ కాల్స్‌

దర్యాప్తు నిర్వహణలో కిడ్నాపర్‌ ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పలుమార్లు ఇంటర్నెట్‌ ద్వారా చేసిన ఫోన్‌కాల్స్‌ పోలీసులకు సవాల్‌గా మారాయి. సాగర్‌ తెలివిగా తన మిత్రుడి ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి దానికొచ్చే ఓటీపీని వాడుకొని తన మొబైల్‌ ద్వారా ఇంటర్నెట్‌ కాల్‌ చేసినట్లు సైబర్‌ విభాగం వారు గుర్తించారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ ఎక్కువగా చేసే యాప్‌లలో రేటింగ్‌ ఎక్కువగా ఉన్న వాటి నిర్వాహకులకు సైబర్‌ క్రైం పోలీసులు ఈ-మెయిల్‌ ద్వారా లేఖలు పంపారు. అందులో ఓ యాప్‌ నిర్వాహకులు కాల్‌కు సంబంధించిన వివరాలు అందజేశారు. దీంతో సాగర్‌ దుకాణం పక్కన ఉండే అనిల్‌ అనే మెకానిక్‌ ఫోన్‌ నంబరుగా తేలింది. పోలీసులు అతన్ని విచారించగా విషయం బయటపడింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.