close

తాజా వార్తలు

Published : 27/10/2020 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిద్దిపేట రణరంగం

భాజపా అభ్యర్థి రఘునందన్‌ మామ, మరొకరి ఇళ్లలో సోదాలు
రూ.18.67 లక్షలు దొరికినట్లు పోలీసుల వెల్లడి
ఆ సొమ్ము నుంచి రూ.12.80 లక్షల్ని కొందరు లాక్కెళ్లారన్న సీపీ
భాజపా శ్రేణుల ఆందోళన... చెదరగొట్టిన పోలీసులు
బండి సంజయ్‌ అరెస్టు.. సిద్దిపేటకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆరా
పట్టుబడిన సొమ్ముతో తనకు సంబంధం లేదన్న రఘునందన్‌

సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌, అర్బన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేటలో పోలీసుల తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు మామ, మరో వ్యక్తి ఇంట్లో సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనలు, నినాదాలతో సిద్దిపేట హోరెత్తింది. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పలువురు భాజపా నాయకులు గాయపడ్డారు. తోపులాటలో భాజపా అభ్యర్థి కిందపడగా చేతికి గాయమైంది. వందల సంఖ్యలో భాజపా శ్రేణులతోపాటు ముఖ్య నేతల రాకతో తనిఖీ జరిగిన పరిసర ప్రాంతాలు అట్టుడికాయి. ఈ క్రమంలో సిద్దిపేటకు బయలుదేరిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తనపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని.. సిద్దిపేట కమిషనర్‌ను బదిలీ చేసేవరకూ దీక్షలో ఉంటున్నానని సంజయ్‌ ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంజయ్‌కి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రఘునందన్‌రావు మామ ఇంటికి సోమవారం రాత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేరుకున్నారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో సిద్దిపేటలో మూడు ఇళ్లలో సోదాలు చేశామని తెలిపారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, ఆయన బంధువు అంజన్‌రావు ఇళ్లలో మధ్యాహ్న సమయంలో రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేశామన్నారు. ఈ క్రమంలోనే అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు లభించాయని తెలిపారు. ఈ విషయమై విచారించగా.. ఆ సొమ్మును దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారి బంధువు జితేందర్‌రావు అనే వ్యక్తి  డ్రైవర్‌ ద్వారా ఇంటికి చేరవేశారని తెలిసిందన్నారు. నగదును సీజ్‌ చేసిన తర్వాత బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇంటి ఆవరణలో సుమారు 20 నుంచి 30 మంది భాజపా నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా కొంత సొమ్మును లాక్కెళ్లారని డేవిస్‌ చెప్పారు. అది రూ.12.80 లక్షలుగా తేలిందన్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, సీజ్‌ చేసిన సొమ్ము చోరీ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో తెరాస నేత, మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సు ఇంట్లోనూ సోదాలు చేయగా ఎలాంటి నగదు లభ్యం కాలేదని ఆయన వివరించారు.

ఎన్నికల క్షేత్రం నుంచి తప్పించే కుట్ర: రఘునందన్‌రావు
స్వాధీనం చేసుకున్న సొమ్ముతో, అంజన్‌రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏదో ఒకరకంగా నాపై కేసులు బనాయించి ఎన్నికల క్షేత్రం నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. సంబంధం లేని వ్యక్తుల ఇంట్లో డబ్బులు దొరికితే నన్ను ఎలా బాధ్యుడిని చేస్తారు? సెర్చ్‌ వారెంటు, నోటీసు ఇవ్వకుండా అధికారులు, వందల మంది పోలీసులతో ఎలా సోదాలు చేస్తారు. రాత్రి వరకూ పంచనామా నివేదిక గురించి చెప్పలేదు. మూడుసార్లు తోపులాట, నాలుగుసార్లు లాఠీఛార్జీతో భయబ్రాంతులకు గురిచేశారు. అంజన్‌రావుది, నాదీ ఒకే సామాజికవర్గం.. కానీ బంధుత్వం లేదు. అంజన్‌రావు ఇంట్లో డబ్బును ఎవరైనా పెట్టారా లేదా అధికారులే తెచ్చిపెట్టారా అనే విషయం నాకు తెలియదు. మేం ఏ తప్పూ చేయలేదు. అధికారుల నుంచి మా శ్రేణులు ఎలాంటి డబ్బు లాక్కెళ్లలేదు. చేయని తప్పునకు నన్ను ముద్దాయిగా చేయొద్దు. మా మామ, అత్త వృద్ధులు అని చూడకుండా ఇంట్లోకి చొరబడి వస్తువులను చెల్లాచెదురు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు వారి నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం.. దీంతో నాపై కక్ష కట్టారు. హైదరాబాద్‌లో మా కూతురు, అల్లుడిని ఉద్యోగం చేయనీయడం లేదు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికారులు గూండాల్లాగా వ్యవహరించారు. కేరళ, బెంగాల్‌లలో మాదిరి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతాం’’ అని పేర్కొన్నారు.

రోదించిన సంజయ్‌..
రఘునందన్‌రావు మామ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సిద్దిపేట వస్తుండగా పట్టణ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ జోయల్‌ డేవిస్‌ నేతృత్వంలో పోలీసులు ఆయనను అక్కడే నిలువరించారు. అరెస్టు చేస్తున్న క్రమంలో సంజయ్‌కి గాయమవగా ఒక్కసారిగా రోదించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అక్కడి నుంచి కరీంనగర్‌ తరలించారు. బండి సంజయ్‌ తలకు గాయమైందని కార్యకర్తలు తెలిపారు. సిద్దిపేటలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.