ఊరికి పోదాం.. ఉన్నదే తిందాం!
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊరికి పోదాం.. ఉన్నదే తిందాం!

లాక్‌డౌన్‌తో పట్నం వదిలి సొంతూళ్లకు తరలుతున్న ప్రజలు 
పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెరిగిన వాహన రద్దీ


చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో భాగ్యనగరంలో ఉపాధి పొందుతున్న వారు మళ్లీ సొంతూరు బాట పట్టారు. రెండో దశలో కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, లాక్‌డౌన్‌ను మళ్లీమళ్లీ పొడిగిస్తూ పోతారనే అపోహల మధ్య ప్రైవేట్‌ ఉద్యోగులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. మూటముల్లె సర్దుకొని పనికోసం పట్నం వచ్చిన వారంతా..మళ్లీ అవే సంచులతో వాహనాల్లో తిరిగి వెళ్తున్న దృశ్యాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం నుంచి కుప్పలుతెప్పలుగా కనిపించాయి. మంగళవారం మధ్యాహ్నం లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన అనంతరం అర్ధరాత్రి వరకు 12 వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు టోల్‌ప్లాజా అధికారులు అంచనా వేశారు. 

నాలుగు గంటల్లోనే రెట్టింపు వాహనాలు

తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకలకు వెసులుబాటు ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తెల్లవారుజాము నుంచే ప్రయాణాలు ప్రారంభించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యలో నాలుగు గంటల్లోనే 6,550 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ సమయంలో సాధారణ రోజుల్లో సుమారు మూడు వేల వాహనాలే రాకపోకలు సాగించేవి. రద్దీ పెరిగినా ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉండటంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరడం లేదు.

పని లేక.. బతుకు భారమై..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్‌ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ల్యాండ్రీ దుకాణం నడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఎన్నిరోజులు కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో తల్లి, భార్య, పిల్లలతో కలిసి ఇలా ఆటోలో ఇంటి బాటపట్టారు. 
వ్యాపారం కరోనా ‘పాలు’
ఈయన పేరు జానయ్య. సూర్యాపేట జిల్లా కేశవపురం గ్రామం. హైదరాబాద్‌లో పాల వ్యాపారం చేసేవాడు.  లాక్‌డౌన్‌తో హోటళ్లు మూతపడటంతో వ్యాపారం దెబ్బతింది. హైదరాబాద్‌లో బతుకు భారమవుతుందని భావించిన ఆయన ఆటోలో సామగ్రిని సర్దుకొని స్వగ్రామానికి బయలుదేరారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని