అంతం చేసిన ఆవేశం
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 08:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతం చేసిన ఆవేశం

జుత్తాడలో ఆరుగురి హత్య
మధురవాడలో మరో ఘటన
ఈనాడు-విశాఖపట్నం, అమరావతి, న్యూస్‌టుడే: పెందుర్తి, వేపగుంట

గురువారం ఉదయం...ఒక్కసారిగా విశాఖలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే ఇంటిలో ఆరుగురిని నరికి చంపారనే విషయం సంచలనం రేపింది. అప్పటికే మధురవాడ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనంలో నలుగురు మరణించిన తీరూ చర్చనీయాంశమయింది. ఇలా హత్యా ఘటనల్లో ఒకే రోజు పది మంది మరణించారని తెలిసి నగరం ఉలిక్కిపడింది.  పోలీసులు, ఇతర అధికారులు తక్షణం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

ఉమ్మడి కుటుంబం చెల్లాచెదురు
ఓ హత్య.. ఉమ్మడి కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. అందరూ కలిసిమెలిసి, సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పెందుర్తి మండలం జుత్తాడలో గురువారం తెల్లవారుజామున స్థానికుడు అప్పలరాజు ఒకే కుటుంబంలోని ఆరుగురిని కత్తితో నరికి ప్రాణాలు తీశాడు.  పెందుర్తి సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కుటుంబ సభ్యులు, సోదరులు ఇళ్లకు తాళాలు వేసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి పరారయ్యారు.
తీవ్ర ఉద్రిక్తత.. పెల్లుబికిన ఆగ్రహావేశాలు:  జుత్తాడలో ఆరుగురి హత్య తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుడు అప్పలరాజును జుత్తాడకు తీసుకురావాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు మృతదేహాలను తరలించేందుకు అంగీకరించమని పట్టుబట్టారు. జిల్లా యాదవ సంఘం ప్రతినిధులు ఒమ్మి సన్యాసిరావు, వైకాపా నేత గువ్వల చంద్రశేఖర్‌, వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ వస్తేనే కాని పోస్టుమార్టంకు అంగీకరించమని తేల్చిచెప్పారు. మృతదేహాలను నిందితుడికి సంబంధించిన స్థలంలోనే ఖననం చేయాలని డిమాండ్‌ చేశారు.
మృతదేహాలు తరలించడానికి ససేమిరా...
* విజయవాడలో ఉంటున్న మృతురాలు ఉషారాణి భర్త విజయ్‌కిరణ్‌ జుత్తాడ గ్రామానికి సాయంత్రం 4గంటల సమయంలో చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల బంధువులు నిందితుడు, అతని బంధువుల ఇళ్లపై దాడి చేశారు. తాళాలు వేసి ఉన్న తలుపులు విరగొట్టి లోనికి దూసుకెళ్లారు. వస్తువులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
* కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసిన విజయ్‌కిరణ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆగ్రహంతో నిందితుడి ఇంటిపై దాడి చేసేందుకు పరుగులు తీశాడు. ఆయన వెంట బంధువులు కూడా దూసుకువచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ వారిని అదుపు చేశారు.
* మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు అనుమతించాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ కోరినప్పటికీ బంధువులు అంగీకరించలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టారు. ఆ నేపథ్యంలో అదీప్‌రాజ్‌ మంత్రి ముత్తంశెట్టికి విషయం తెలియజేసి ఘటన స్థలానికి రావాలని కోరారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి ముత్తంశెట్టి

 

విజయ్‌కిరణ్‌తో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

* మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సాయంత్రం 6గంటల సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులు గతంలో జరిగిన ఘటనలను మంత్రికి వివరించారు. నిందితుడు అప్పలరాజుతో పాటు ఆయన తల్లి, భార్య, సోదరులపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పథకం ప్రకారమే వారంతా తన కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నారని బాధితుడు విజయ్‌కిరణ్‌ ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామని, హత్యలతో సంబంధం ఉన్నవారందరిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో మృతదేహాల తరలింపునకు అంగీకరించారు. సాయంత్రం సుమారు 6.30గంటల సమయంలో భారీ బందోబస్తు నడుమ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
* ఘటన ప్రాంతాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, నగర డీసీపీ సురేశ్‌బాబు, పశ్చిమ జోన్‌ ఏసీపీ శ్రీపాద్‌రావు, పెందుర్తి, గోపాలపట్నం, ఎంవీపీకాలనీ సీఐలు కె.అశోక్‌కుమార్‌, మళ్ల అప్పారావు, రమణయ్య, పదుల సంఖ్యలో ఎస్‌ఐలు పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మృతదేహం వద్ద  ఆవేదనలో విజయ్‌కిరణ్‌

విజయవాడలో విషాదం...

జుత్తాడ ఘటనలో విజయ్‌ కిరణ్‌ తండ్రి రమణ, భార్య ఉషారాణి, రెండో కుమారుడు ఉదయ్‌, ఆరు నెలల కుమార్తె లిషిత, అత్త రమాదేవి, ఆమె చెల్లెలు అరుణ చనిపోయారు. విజయ్‌ పెద్ద అబ్బాయి అఖీరనందన్‌ హత్య జరిగిన సమయంలో విశాఖ నగరంలోని మరోచోట బంధువుల ఇంట్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన.. మృతుల్లో అయిదుగురు విజయవాడ వాసులు కావడంతో అక్కడి బ్రహ్మానందరెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. విశాఖ వచ్చిన తరువాత ఇక్కడ పనులు పూర్తిచేసుకొని తిరిగి బెజవాడ వెళ్దామనుకుంటున్న సమయంలో విగతజీవులుగా మారారు. బుధవారం రాత్రి కూడా తాము వారితో ఫోన్లో మాట్లాడామని, శుక్రవారం ఉదయానికి తిరిగి వస్తామని చెప్పారని ఇరుగుపొరుగు వారు గద్గద స్వరంతో చెప్పారు.

హత్యకు గురైన లిషిత, రమాదేవి, రమణ, అరుణ

* 2018లో విజయవాడకు..: జుత్తాడకు చెందిన విజయ్‌.. తన మేనత్త అయిన అల్లు రమాదేవి కుమార్తె ఉషారాణిని వివాహం చేసుకున్నారు.   అప్పలరాజు, విజయ్‌ కుటుంబాలమధ్య ఘర్షణల కారణంగా వ్యవహారం ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో విజయ్‌ తన భార్య, బిడ్డలతో విజయవాడకు వెళ్లి.. అత్త రమాదేవి ఇంట్లో ఉంటున్నాడు. చుట్టుగుంటలో మొబైళ్లకు టెంపర్డ్‌ గ్లాసులు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అత్తకు మగ పిల్లలు లేకపోవడం, భర్త చనిపోవడంతో ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇదే ఇంట్లో మరో మేనత్త నిక్కట్లు అరుణ(37), ఆమె భర్త మల్లేశ్వరరావు, వీరి కుమార్తె లీలవేణి, కుమారుడు రమణతో కలిపి మొత్తం పది మంది ఉంటున్నారు.

కుటుంబీకుల రోదన

* ఓటు వేయడానికి, శుభలేఖలు ఇచ్చేందుకు వచ్చి..: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య, ముగ్గురు పిల్లలు, చిన్న మేనత్త అరుణతో కలిసి ఈనెల 7వ తేదీన విజయ్‌ జుత్తాడకు వచ్చాడు. అరుణ కుమార్తె లీలవేణి వివాహం మే 14న నిశ్చయమైంది. ఇది విజయవాడలో జరగనుంది. దీంతో ఓటు వేసిన అనంతరం నగరంలో పెళ్లికి కావాల్సిన నూతన వస్త్రాలు, ఇతర వస్తువులు కొనాలని నిర్ణయించుకున్నారు. విజయ్‌ తిరుగు ప్రయాణమై 10వ తేదీన విజయవాడ చేరుకున్నాడు. మిగిలినవారు పెళ్లికి అవసరమైన వస్తువులు కొని గురువారం ఉదయం విజయనగరం వెళ్లి... రాత్రి బయలుదేరి, శుక్రవారం ఉదయానికి విజయవాడ చేరుకోవాల్సి ఉంది. ఇంతలో ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి గురువారం ఉదయం సమాచారం అందుకున్న విజయ్‌, మల్లేశ్వరరావు, లీలవేణి, రమణ.. వెంటనే జుత్తాడకు బయలుదేరి వెళ్లారు.
* కూతురు కోసం పూజలు: విజయ్‌, ఉషారాణికి ముగ్గురు పిల్లలు. వీరికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మొదటి, రెండోసారి కూడా అబ్బాయిలే పుట్టారు. దీంతో ఆడపిల్ల కోసమని ఎన్నో పూజలు చేశారు. ఆరు నెలల క్రితం అమ్మాయి పుట్టింది. ఎంతో అల్లారుముద్దుగా చిన్నారి లిషితను పెంచుకుంటున్నారు.

ఉత్తమ రైతు...

హత్యకు పాల్పడ్డ అప్పలరాజుకి మండలంలో ఉత్తమ రైతుగా పేరుంది. పొక్లయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తాడు. హిందీతో పాటు మరో రెండు భాషలు మాట్లాడతాడు. ఊర్లో ఆర్థికంగా బాగున్న వ్యక్తే. పశువుల పెంపకం, విభిన్న రకాల పండ్ల మొక్కలు, గడ్డి, నర్సరీ మొక్కలు వంటివి సాగు చేస్తూ మంచి రైతుగా పేరుతెచ్చుకున్నాడు. సానుకూల ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అంత దారుణంగా వ్యవహరించడంపై స్థానికులు విస్తుపోతున్నారు.

రాత్రి తీసుకురాకుండా ఉండాల్సింది: అరుణ కూతురితో నాకు మే నెలలో వివాహం చేయాలని నిర్ణయించారు.  వారం రోజుల కిందటే విశాఖకు వచ్చి శివాజీపాలెంలోని బంధువుల ఇంటి వద్ద వీరంతాఉన్నారు. పెళ్లి కార్డులు పంచాల్సి ఉన్నందున బుధవారం రాత్రి వీరందరినీ గ్రామానికి తీసుకువచ్చా. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. విజయ్‌కిరణ్‌ పెద్దకొడుకు రానని అల్లరి చేయడంతో శివాజీపాలెంలోనే  ఉండిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

-సాయి

ఊళ్లో ఉంటే చంపేస్తానన్నాడు: ఉదయం 6.30 గంటల సమయంలో అప్పలరాజు నాకు ఫోన్‌ చేశాడు. ఇంట్లో ఉన్నవారందరినీ కత్తితో నరికేశా. మీరూ ఊళ్లో ఉండకండి. ఉంటే మిమ్మల్నీ నరికేస్తా. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోండని బెదిరించాడు. వచ్చి చూసేసరికి ఘోరం జరిగిపోయింది. వెంటనే విజయవాడలోని విజయ్‌కిరణ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పా.

- దుర్గాప్రసాద్‌ఆ నలుగురు విగత జీవులై...
మధురవాడలో మరో ఘటన
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పీఎంపాలెం, గంట్యాడ


చిరంజీవితో బంగారు నాయుడు కుటుంబం (దాచిన చిత్రం)

విశాఖ ఉలిక్కిపడింది. మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య ఫార్చున్‌ టవర్స్‌ సి-బ్లాక్‌ ఐదో అంతస్తు ఫ్లాట్‌ నెంబరు 505లో సుంకరి బంగారు నాయుడు(50) కుటుంబ సభ్యులు నలుగురు విగతజీవులై పడి ఉండటం కలకలం రేపింది. తండ్రి బంగారునాయుడు, తల్లి నిర్మల, తమ్ముడు కశ్యప్‌లను దీపక్‌(25) హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. దీపక్‌  ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు అనేది జవాబు తెలియని ప్రశ్నగా మారింది.
* వాగ్వాదం ఏమిటి?: హత్యలకు ముందు కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అది ఏ అంశంపై అన్నది కీలకంగా మారింది. ఏ కారణాలపై జరిగుంటుందన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపక్‌ క్షణికావేశంలోనే ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

* దొంగతనం కోణంలోనూ:  చోరీకి వచ్చిన వారెవరైనా ఈ హత్యలు చేశారా ? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ  చేపట్టారు. ఆ మేరకు క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సాక్ష్యాల కోసం ప్రయత్న చేస్తున్నారు. ఇంటి నుంచి వస్తువులు పోయిన ఆనవాళ్లేవీ ప్రస్తుతం గుర్తించలేదు. క్రైం డీసీపీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో దొంగతనం కోణంలోనూ విచారణ చేశారు.
* రాత్రి వరకు విచారణ.:   బంగారునాయుడు కుటుంబసభ్యుల హత్యోదంతంలో పోలీసులు కేసుకు సంబంధించిన సాక్ష్యాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. రాత్రివరకు శవాల్ని తరలించకుండా ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో సాక్ష్యాల సేకరణలోనే  నిమగ్నమయ్యారు. సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా సంఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఏఏ కోణాల్లో విచారణ చేయాలన్న అంశాలపై అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు.

వివరాలు వెల్లడిస్తున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా

* గంట్యాడ కంటతడి: గంట్యాడ కంటతడి పెట్టింది. అందరినీ పేరుపేరునా పిలిచి ఆప్యాయంగా పలకరించే బంగారునాయుడు (గోవింద), అతని కుటుంబం ఇక లేదని తెలుసుకున్న స్థానికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విషయం తెలుసుకున్న ఆయన రెండో అన్న రామునాయుడు కుప్పకూలిపోయారు. మాజీ సమితి అధ్యక్షుడు సుంకరి శ్రీరాములు ఐదుగురు సంతానంలో గోవింద నాలుగో కుమారుడు. చిన్నతనం నుంచి చదువంటే ఎంతో ప్రేమని రామునాయుడు చెప్పారు.‘ ఐదో తరగతి వరకు గ్రామంలో, తర్వాత విజయనగరం ఆర్సీఎం స్కూల్‌లో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరు పూర్తి చేశారు. పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రూ.5 వేలు జీతానికి పనిచేశారు. తర్వాత ఎంబీఏ పూర్తి చేసి సంవత్సరం పాటు మద్రాసులో ఉద్యోగం చేశారు. నోటిఫికేషన్‌ ద్వారా బహ్రయిన్‌ రాజుకు చెందిన కెమికల్‌ పరిశ్రమలో ఉద్యోగంలో చేరారు. 20 ఏళ్ల పాటు అక్కడ పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ తెలుగు అకాడమి కార్యదర్శిగా పనిచేశారు. నాలుగేళ్ల కిందట ఇండియా తిరిగి వచ్చేసిన ఆయన ఆరు నెలల పాటు విశాఖలో ఒక పరిశ్రమలో పనిచేశారు. తరువాత విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థులతో సెమినారు నిర్వహించేవారు. విజయనగరం సీతం కాలేజీలో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇంట్లో రక్తపు మరకలు... దగ్ధమైన ఏసీ

*  నమ్మలేకపోతున్నాం: ‘నేను, బంగారునాయుడు పదోతరగతి వరకు కలిసే చదువుకున్నాం. అందరితోనూ ఎంతో మంచిగా ఉంటారు. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యారన్న విషయం నమ్మలేకపోతున్నాం’ అని వెంకట్రావు పేర్కొన్నారు.

* కుటుంబానికి అండగా: ‘గోవింద వల్లే కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంది. ఐదుగురు అన్నదమ్ములం ఒకే మాటపై ఉంటాం. ఆర్థికంగా చేయూతను  ఇచ్చేవాడు. పిల్లలందరికీ చదువుకోమని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పేవాడు. మా తమ్ముడికి భక్తి ఎక్కువే. గంట్యాడ, బూడిపేట రామాలయాలకు రూ.50 వేల చొప్పున ఇచ్చాడు. గోవింద లేకుంటే మా ఇంటికి వెలుగు లేదు’ అని  రామునాయుడు కన్నీరుమున్నీరయ్యారు.
* అందరితోనూ సన్నిహితంగా మెలిగేవారు: విధి నిర్వహణలో తలమునకలై ఉన్నప్పటికీ చిన్ననాటి మిత్రులను ఏమాత్రం మరచేవారు కాదు. బహ్రయిన్‌లో ఉన్నప్పుడు ఒకట్రెండు సంవత్సరాలకు ఒకసారి విజయనగరం వచ్చినప్పుడు మిత్రులను కలిసేవారు. అందరితోనూ సన్నిహితంగా మెలిగేవారు. కొంతకాలం కిందట కుటుంబంతో సహా విశాఖ వచ్చేశారు. కొందరు మిత్రులను ఆయన ఆర్థికంగా కూడా ఆదుకున్నట్లు మిత్రులు చెబుతున్నారు. హత్య విషయం తెలుసుకుని పలువురు మిత్రులు ఆదిత్య ఫార్చూన్‌ టవర్స్‌ దగ్గరికి వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

* కుమారుల కోసమే..: భారతదేశంలో విద్యాప్రమాణాలు బాగుంటాయని బంగారునాయుడు చెప్పేవారని, కేవలం కుమారుల చదువుల కోసమే స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకున్నారని కుటుంబీకులు చెబుతున్నారు. పెద్దకుమారుడు దీపక్‌ను వరంగల్‌ నిట్‌లో చేర్చిన అనంతరం వారి కుటుంబం శాశ్వతంగా విశాఖపట్నం వచ్చేసింది. పెద్దకుమారుడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌కు శిక్షణ ఇప్పించారు.
* ఆర్థికంగా ఎదిగి: విదేశాల్లో ఉన్నతోద్యోగం చేయడంతో బంగారునాయుడు ఆర్థికంగా బాగా సంపాదించారు.  మిథిలాపురి కాలనీలో భారీ భవంతిని నిర్మిస్తున్నారు. వచ్చేనెలలోనే గృహప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తన సొంతూరులోనూ, నగరంలోనూ, మరికొన్ని చోట్ల కూడా భూములు కొన్నారని తెలుస్తోంది. ఆనందపురంలో భూమి కొనుగోలు చేయడానికి ఇటీవలే ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారని, రెండు మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ కూడా ఉందని వారి బంధువులు పేర్కొంటున్నారు.

కుమారుడి ప్రమేయం లేదనే భావిస్తున్నాం:  బంగారునాయుడు కుటుంబసభ్యుల మరణానికి కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అది వాస్తవం కాదేమోననిపిస్తోంది. దీపక్‌ చాలా మంచి వ్యక్తి. అలా చేసి ఉండడనే అనుకుంటున్నాం. కుటుంబపరంగా ఎలాంటి విభేదాలు లేవు. వారితో ఎవరికీ తగాదాలు లేవు. ఆయనకు శత్రువులంటూ ఎవరూ లేరు. కుటుంబం అంతా ఐకమత్యంగా ఉంది. సంక్రాంతిని అందరం కలిసిమెలిసి జరుపుకొంటాం. ఆయన మరణం మాకు తీరని లోటే. కేసును ఇంకా లోతుగా విచారణ చేయాలి. ఒక ల్యాప్‌టాప్‌ కనబడడంలేదు. దానిపై పోలీసులు విచారణ చేయాలని కోరుతున్నాం. ఆయన బహ్రయిన్‌ నుంచి వచ్చి ఎవరితోనూ విభేదాలు లేకుండా జీవిస్తున్నారు.

-రమణ, చినఅప్పలనాయుడు (బంగారునాయుడి సోదరులు)

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని