స్నేహితులే అంతం చేశారా ?
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్నేహితులే అంతం చేశారా ?

నాగరాజు హత్య కేసులో పురోగతి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే భర్త హత్య, భార్య ఆత్మహత్యలకు సంబంధించి మిస్టరీ వీడుతోంది. అతడ్ని ఎవరు చంపారు.. ఎందుకు చంపారు.అంతదూరం ఎలా తీసుకెళ్లి హతం చేశారు. భర్త హత్య విషయం తెలిసి భార్య ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకీ హంతకులెవరు..? ఈ ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు శరవేగంగా చేపట్టారు. టంగుటూరు మండలం మర్లపాడు గ్రామ శివారులో బుధవారం ఉదయం వెలుగుచూసిన కబాలి నాగరాజు హత్య, ఒంగోలులోని తమ నివాసంలో అతని భార్య శ్రీవల్లి ఆత్మహత్య.. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ కేసుల్లో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఒంగోలు నగరానికే చెందిన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా హతుడు నాగరాజుకు అత్యంత సన్నిహిత మిత్రులే కావటం గమనార్హం. పోలీసు విచారణలో తామే నాగరాజును హత్యచేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఒంగోలుకే చెందిన ఆటోడ్రైవర్‌ పి.శ్రీను అనే యువకుడితో నాగరాజుకు వివాదం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం హత్యకు గురైన నాగరాజు... శ్రీనును చంపుతానని గతంలోనే బెదిరించినట్లు సమాచారô. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను, ఎప్పటికైనా నాగరాజు నుంచి తనకు ముప్పు తప్పదని భావించాడు. అతను తనను ఏదో చేయకముందే తానే అతడ్ని ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఇందుకోసం పక్కా పథకం రచించాడు. ఇద్దరికీ ఉమ్మడి మిత్రులు(కామన్‌ ఫ్రెండ్స్‌)ను ఇందుకోసం వినియోగించాడు. 
జాళ్లపాలెం తిరునాళ్లు పేరుచెప్పి... : మంగళవారం రాత్రి నాగరాజును జాళ్లపాలెం తిరునాళ్లు పేరుచెప్పి బయటకు రప్పించి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. మిత్రులతో కలిసి తిరునాళ్లకు వెళ్లిన నాగరాజు వారితో అక్కడ మద్యం సేవించాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం శ్రీను వీరికి అక్కడ తోడయ్యాడు. తిరునాళ్లు అనంతరం తిరిగి వచ్చే క్రమంలో మిత్రులతో కలిసి ముందుగా తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో నాగరాజుపై దాడిచేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మర్లపాడు సమీపంలోని చెరువులో పడేసి ఒంగోలు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు శ్రీను ఈ హత్య విషయాన్ని ఒంగోలులో మహిళకు ఫోన్‌ద్వారా చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరి మధ్య తరచూ ఫోన్‌కాల్స్‌ వెళ్లినట్లు నిర్థారించుకున్నారు. ఇంతలో నాగరాజు భార్య తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాగరాజు హత్యకేసు ఒక కొలిక్కి వచ్చిందనీ, వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు గుర్తించామని ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ చెప్పారు. 
ఇరు వర్గాల ఘర్షణ... :  భార్యాభర్తల మృతదేహాలకు ఒంగోలు జీజీహెచ్‌లో గురువారం పోస్టుమార్టం పూర్తయింది. నాగరాజు మృతదేహానికి సింగరాయకొండ సర్కిల్‌ పోలీసులు, శ్రీవల్లి మృతదేహానికి ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. అనంతరం రెండు మృతదేహాలకు జీజీహెచ్‌ వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్‌ వద్ద గుమిగూడారు. తమవారి మృతికి మీరు కారకులంటే, మీరు కారకులని పరస్పరం దూషించుకుంటూ దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మృతదేహాలను వారివారి బంధువులకు అప్పగించారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని