వారి ఆలోచన కిరాతకం
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారి ఆలోచన కిరాతకం


నటి నయన

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: అది.. హుబ్బళ్లి నగర శివార్లలోని దేవరగుడిహళ్లి. అక్కడికి చేరువలోనే కంపచెట్లు, వ్యర్థాల దిబ్బలు దండిగా విస్తరించాయి. ఈ నెల 12న ఉదయవేళ ఆ చెట్ల మధ్యలోంచి పనులపై నడుచుకుని వెళుతున్న వారు.. ఒక్కసారిగా పరుగులు తీసినంత పని చేశారు. వారి భయం ఛాయలు పోలీసులకూ సోకాయి. వారంతా అలా పరుగులు తీయడానికి కారణాలు వెతికారు. ఆనోటా.. ఈనోట ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ఎవరో యువకుడిని కిరాతకంగా కడతేర్చారు. చక్కని మేనివర్చస్సున్న ఆ నవ యువకుడిని సాధారణంగా కడతేర్చి ఉంటే.. ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. అతడి తలను కోసుకొని.. మొండేన్ని అక్కడే వదలి వెళ్లారు. పోలీసులకు ఆ కేసు ఓ పెను సవాల్‌గా మారింది. మొండెం కనిపించిన కొన్ని గంటల్లోనే అన్ని వైపుల నుంచీ విమర్శల బాణాలు దూసుకొస్తున్నాయి. వారు రంగంలోకిదిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోజు సాయంత్రానికి మరో కబురు.. నగరంలోని మరో ప్రాంతంలో తెగిపడినట్లున్న తలను కొందరు గుర్తించారు. క్షణాల్లో అక్కడ వాలిన పోలీసులు.. ఆ తల ఉదయం గుర్తించిన మొండెం తాలూకు యువకుడిదేనని తేల్చారు. ఆ రెండింటినీ అతికి.. చూస్తే అసలు విషయం క్షణాల్లో తేలిపోయింది.

నగరానికే చెందిన రాకేష్‌ రెండు రోజులుగా కనిపించకుండా పోవడం.. ఇప్పుడీ హత్య.. అక్కడే లంకె కుదిరింది. హత్యకు గురైంది రాకేష్‌ అని తేల్చి.. అందుకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీసే సరికి అసలు షాక్‌ అప్పుడు తగిలింది. కట్‌చేస్తే.. వివరాలు ఒకదానికొకటి అందివచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు దుండగుల్ని వలపన్ని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే రాకేశ్‌ సోదరే ఈ హత్యను ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైంది. నియాజ్, తవసీఫ్, అల్తాఫ్, అమన్‌ అనే నలుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తులో అనూహ్యమైన వాస్తవాలు వెలుగు చూశాయని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడైన నియాజ్‌- హతుడి సోదరి నయన (వర్ధమాన నటి) ప్రేమికులు. వీరి ప్రేమను రాకేశ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడని సమాచారం. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రాకేశ్‌ను తప్పిస్తే సరిపోతుందని నియాజ్‌ ఒకానొక సందర్బంలో నయన వద్ద ప్రస్తావించాడట. అందుకు ఆమె అంగీకారం తెలిపి.. ‘నిజమే.. ఆ పనిచేస్తే మన ప్రేమను అడ్డుకునే వారెవరూ ఉండరు’ అంటూ ప్రోత్సహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ క్రమంలోనే అదును చూసి స్నేహితుల సహకారంతో రాకేశ్‌ను హతమార్చాడని వెల్లడైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. నయన ఒకటి రెండు సినిమాల్లో నటించింది.                         
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని