బిడ్డకు జన్మనిచ్చేలోపే కబళించిన మృత్యువు
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిడ్డకు జన్మనిచ్చేలోపే కబళించిన మృత్యువు

● ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మరణం

● వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆందోళన


మృతి చెందిన నాగమణెమ్మ

రాజంపేట(కడప), న్యూస్‌టుడే : నవ మాసాలు కడుపున మోసిన తన ప్రతిరూపాన్ని చూడాలన్న కల నెరవేరకనే ఓ నిండు గర్భిణి మృతి ఒడికి చేరింది. ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ఆమె పురుడు పోయక ముందే ప్రాణాలు వదలడం కుటుంబ సభ్యులకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. కాన్పు కోసం వచ్చిన గర్భిణి చికిత్స పొందే సమయంలో మృతి చెందిన సంఘటన మంగళవారం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం వల్లూరుపల్లికి చెందిన నాగమణెమ్మ (24)ను రెండో కాన్పు కోసం భర్త ఈశ్వరయ్య ఈనెల 3న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుడు అనిల్‌ పరీక్షించారు. మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగమణెమ్మ మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొస్తే మంగళవారం ఉదయం వరకు కూడా కాన్పు చేయలేదని, పైగా రూ.50 వేలు ఇస్తే ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు చేస్తానని చెప్పారని ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ వైద్యుడు అనిల్‌తో వాగ్వాదానికి దిగారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రభుత్వ వైద్యాధికారి అనిల్‌ స్పందిస్తూ.. సోమవారం సాయంత్రం ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే పరీక్షించానన్నారు. సాధారణ కాన్పయితే పర్వాలేదని, శస్త్రచికిత్స చేయాల్సి వస్తే మత్తు సూది ఇచ్చే వైద్యులు ఇక్కడ లేరని, ఆమెను పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పానన్నారు. వారు ఎలాగైనా కాన్పు చేయాలని కోరారన్నారు. మంగళవారం ఉదయం పరీక్షించి ఇంటికి వెళ్లానని, అంతలోపే ఆమెకు పక్షవాతం వచ్చినట్లు సమాచారం రావడంతో వెంటనే ఆసుపత్రికి వచ్చి వైద్యానికి ఉపక్రమించినట్లు చెప్పారు. ఈ సమయంలో ఆమె మృతి చెందారని, ఇందులో తన తప్పేమీ లేదన్నారు. ప్రైవేటు వైద్యం చేస్తానని చెప్పాననడం అవాస్తవం అని పేర్కొన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని