చక్రాలకుర్చీ నుంచే విజేత అయ్యింది!
close

తాజా వార్తలు

Published : 19/03/2021 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చక్రాలకుర్చీ నుంచే విజేత అయ్యింది!

ఆమె అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి.. సామాజిక కార్యకర్త.. దివ్యాంగుల హక్కుల కోసం అలుపులేకుండా పోరాడుతోంది. తన ప్రసంగాలతో ఎంతోమందిలో స్ఫూర్తినీ నింపుతోంది. ఇన్ని పనులనూ ఆమె చక్రాల కుర్చీ నుంచే చేస్తుంది. ఆమే.. సువర్ణరాజ్‌.

నాగ్‌పుర్‌కు చెందిన సువర్ణ రెండేళ్ల వయసులోనే పోలియో బారినపడి మంచానికే పరిమితమైంది. ఆ తర్వాత చక్రాల కుర్చీ సాయంతో బడికి వెళ్లడం మొదలుపెట్టింది. పదోతరగతి తర్వాత ఎవరి మీదా ఆధారపడకుండా తన పనులన్నీ తనే సొంతంగా చేసుకోవడానికి హాస్టల్‌లో చేరింది సువర్ణ. ఆ తర్వాత బీకాం, బిఇడీ, ఎంకాం పూర్తిచేసింది. దిల్లీలోని ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి సోషల్‌వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదివింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత చదువు మీద ఉండే ఆసక్తితో పీజీ చేసింది. చదువులో ఎంత చురుగ్గా ఉన్నప్పటికీ వైకల్యం కారణంగా చిన్నప్పటి నుంచీ ఆటలకు దూరంగానే ఉండేది. అయితే టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడైన ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లోటూ తీరిపోయింది. అతడితో కలిసి టేబుల్‌ టెన్సిస్‌ ఆడటం మొదలుపెట్టింది. మెల్లగా ఆటలో నైపుణ్యం సాధించడంతోపాటు అంతర్జాతీయ పోటోల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. బ్యాంకాక్‌లో జరిగిన థాయ్‌లాండ్‌ ‘పారా టేబుల్‌ టెన్నిస్‌ ఓపెన్‌’, కొరియాలో జరిగిన ‘ఆసియా పారా గేమ్స్‌’లో పాల్గొని పతకాలనూ గెలుచుకుంది.

అవార్డులూ అందుకుంది...
2013లో ‘నేషనల్‌ ఉమెన్‌ ఎక్సలెన్స్‌’, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘నేషనల్‌ రోల్‌ మోడల్‌’ అవార్డునూ అందుకుంది. 2014లో ‘జాతీయ యువ అవార్డు’, ‘కరమ్‌వీర్‌’ పురస్కారాలనూ సాధించింది. అంతేకాదు ముంబయికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ తరపున దివ్యాంగుల ఉపాధికీ, ఉద్యోగావకాశాల కల్పనకు కృషిచేస్తోంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల మీద వెళ్లే దివ్యాంగులు సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులకూ గురవుతుంటారు. అందుకే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరుతోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని