
తాజా వార్తలు
దిల్లీ పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ లేదు..!
పరీక్షల్లో తేలినట్లు ప్రకటించిన అధికారులు
దిల్లీ: ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా బర్డ్‌ఫ్లూ ప్రబలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధాని దిల్లీలో మూడు నగర పాలికల్లో పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై నిషేధం విధించారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను కూడా అధికారులు మూసివేశారు. అయితే, అక్కడి పౌల్ట్రీల నుంచి సేకరించిన ఉత్పత్తుల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, పరీక్షల్లో నెగటివ్ తేలినట్లు అధికారులు వెల్లడించారు.
‘బర్డ్ ఫ్లూ నిర్ధారణ కోసం ఘాజీపూర్ నుంచి మొత్తం 104 శాంపిళ్లను సేకరించాము. వీటిలో 100శాంపిళ్లు కేవలం ఘాజీపూర్ మార్కెట్ పౌల్ట్రీ నుంచే తీసుకున్నాం. వీటన్నింటిలో బర్డ్‌ఫ్లూ నెగటివ్ వచ్చింది. అందుకే దిల్లీ కోళ్లలో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టమయ్యింది’ అని అక్కడి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారు. అయితే, కొన్ని పక్షుల నుంచి సేకరించిన నాలుగు శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం అక్కడి కాకులు, బాతుల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించడంతో ఆందోశన వ్యక్తమైంది. దీంతో ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను అధికారులు మూసివేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఎక్కడా పౌల్ట్రీ ఉత్పత్తులను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రజలు ఎటువంటి భయాలకు గురికావద్దని దిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
ఇవీ చదవండి..
దిల్లీకి కోడికూత లేని సంక్రాంతే..!
బర్డ్ ఫ్లూ: గుడ్డు, మాంసం తినొచ్చా..?