close

తాజా వార్తలు

Published : 05/03/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. అప్పు చేశాం.. అందులో దాపరికం లేదు: బుగ్గన

బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువగా అప్పులు చేసిన మాట వాస్తవమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాబడి విపరీతంగా తగ్గిపోయిందని.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యల కోసమే ప్రభుత్వం రూ.వందలకోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ‘గుజరాత్‌కేనా?..హైదరాబాద్‌కు అర్హతలేదా?’

బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? ..హైదరాబాద్‌కు అర్హత లేదా? అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం.. దేశం కోసం పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కొవిడ్‌ రిపోర్టు ఉంటేనే సేవకు..: తితిదే

ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. కరోనా భయం పూర్తిగా తొలగిన తర్వాతే ఆన్‌లైన్‌ లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం అనంత‌రం జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంట‌ల ముందు కొవిడ్ ప‌రీక్ష చేయించుకుని స‌ర్టిఫికెట్ తీసుకువ‌స్తేనే అనుమ‌తిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నందిగ్రామ్‌ నుంచి దీదీ: 291మందితో జాబితా 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291మంది అభ్యర్థుల జాబితాను సీఎం మమతా బెనర్జీ గురువారం విడుదల చేశారు. ఈసారి నందిగ్రామ్‌ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు దీదీ స్పష్టంచేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ నుంచి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ను బరిలో దించుతున్నట్టు దీదీ స్పష్టంచేశారు. బెంగాల్‌ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా.. 291 స్థానాలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి మమత భారీ జాబితాను ప్రకటించారు. మిగతా మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* స్టెప్పులతో అదరగొట్టిన ఫరూక్‌ అబ్దుల్లా

5. కల్తీ సారా కేసు.. 9మందికి మరణశిక్ష! 

కల్తీ సారా కేసులో బిహార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కల్తీసారా కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదు విధించింది. 2016లో గోపాల్‌గంజ్‌లో కల్తీ సారా తాగిన ఘటనలో 21మంది మరణించగా.. అనేకమంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఈ విషాదానికి బాధ్యులైన వారికి శిక్షలు ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. జియో ల్యాప్‌టాప్‌లు వచ్చేస్తున్నాయట!

తక్కువ ధరకే ఇంటర్నెట్‌, ఫీచర్‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి... రిలయన్స్‌ జియో భారత్‌ టెలికాం రంగంలో విప్లవాన్ని తెచ్చింది. రిలయన్స్‌ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్‌ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. ‘జియో బుక్‌’ పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు విపణిలోకి రావొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* ఎస్‌బీఐ బాటలో ఐసీఐసీఐ.. వడ్డీరేటు తగ్గింపు

7. 15వేల దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో నిఫ్టీ 15వేల దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.02గా ఉంది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా కోల్పోయిన సూచీ.. చివరికి 440.76 పాయింట్ల నష్టంతో 50,40532 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 142.70 పాయింట్ల నష్టంతో 14,938.10 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఇది ఎగరని రఫేల్‌ విమానం

విమానంలో విహరించాలన్నది ప్రతి సామాన్య మానవుడి కల. కానీ, ఆర్థిక స్థోమత అడ్డంకిగా మారి చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోరికను కొంతైనా నిజం చేసేందుకు వినూత్నంగా ప్రయత్నించారు పంజాబ్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌. రఫేల్‌ యుద్ధ విమానం డిజైన్‌తో ఓ వాహనాన్ని రూపొందించి కొందరి కలను కొంతైనా నిజం చేస్తున్నారు. భటిండాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రాంపాల్‌ బెహానివాల్‌ రఫేల్‌ యుద్ధ విమానం స్ఫూర్తితో అదే ఆకారంలో ఉన్న ఓ వాహనాన్ని రూపొందించారు. దానికి ‘పంజాబ్‌ రఫేల్‌’ అని పేరు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆస్తి కోసం అన్నను హత్యచేసిన తమ్ముళ్లు

ఆస్తి కోసం తమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఎకంగా రక్తం పంచుకుని పుట్టిన అన్ననే చంపేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టంగుటూరు గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు యాదయ్య, పాండు, శ్రీనివాస్‌ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వారిలో పెద్దవాడైన యాదయ్యతో తమ్ముళ్లిద్దరు ఘర్షణకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పంత్‌ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు

టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్భుతం చేశాడు. సొంతగడ్డపై తొలిసారి శతకం అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. 82 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు శతకాన్ని 115 బంతుల్లోనే అందుకోవడం గమనార్హం. కొత్త బంతి తీసుకున్న తర్వాత స్టోక్స్‌, అండర్సన్‌ బౌలింగ్‌లో అతడు కళ్లుచెదిరే బౌండరీలు బాదేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

భారత్Xఇంగ్లాండ్‌: లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్‌ చేయండి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని