Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 14/05/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారు?: హైకోర్టు

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని, అంబులెన్స్‌లను అడ్డుకునేందుకు మరో రూపంలో ప్రయత్నించవద్దని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్‌ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది.

తెలంగాణ హైకోర్టు చెప్పినా ఆపుతున్నారు: సజ్జల

2. Oxygen Express: ఏపీకి బయల్దేరింది!

రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రానుంది. పశ్చిమ్‌బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి నుంచి 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి బయల్దేరింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ను విశాఖపట్నం, నెల్లూరులో స్టేషన్లలో అన్‌లోడ్ చేయనున్నారు. ప్రాణవాయువు అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రావడం ఇదే తొలిసారి. 

3. ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావచ్చు: డీహెచ్‌

వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ‘పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలి. ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవట్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డీహెచ్‌ తెలిపారు.

4. Pfizer: 12 వారాల గడువుతో విస్తృత యాంటీబాడీలు!

కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందన మరింతగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న 12 వారాల తర్వాత రెండో డోసు ఇవ్వడం వల్ల యాంటీబాడీల ప్రతిస్పందనలు దాదాపు మూడున్నర రెట్లు పెరిగినట్లు బ్రిటిష్‌ అధ్యయనంలో తేలింది. దీంతో వ్యాక్సిన్‌ డోసుల వ్యవధిని పెంచడం సరైన నిర్ణయమనడానికి ఇటువంటి శాస్త్రీయ అధ్యయనాలు మద్దతుగా నిలుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5. Sputnik V: పంపిణీ షురూ..ధర ఎంతంటే!

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. 

6. Lebanon Erdogan: రెచ్చగొడుతున్న ఎర్డోగన్‌!

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ మోహరించింది. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన రాకెట్‌ దాడులు, వైమానిక దాడులు నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 100 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

7. Modi: మీ బాధ.. నన్నూ అంతే వేధిస్తోంది!

కరోనా కల్లోలంతో ప్రజలు పడుతున్న పాట్లు తనను అంతే ఆవేదనకు గురి చేస్తున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కనిపించని శత్రువుతో పోరాడుతోందని ఆయన  అభివర్ణించారు. వేగంగా మార్పులు చెందే ఈ వైరస్ ప్రపంచానికి సవాలుగా పరిణమించదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ కరోనా మహమ్మారి కారణంగా మనం ఆత్మీయులను కోల్పోయాం. మీరు అనుభవిస్తోన్న బాధ.. నన్నూ అంతే వేదనకు గురిచేస్తోంది. నేను మీ ప్రధాన సేవకుడిని. మీ ప్రతి ఉద్వేగాన్ని నేను పంచుకుంటాను. మన ముందు కనిపించని శత్రువు ఉంది. 100 ఏళ్లలో ఎన్నడూ లేని కఠిన సమయాన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోంది’ అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

PM Kisan: ₹19 వేల కోట్లు విడుదల

8. అంతరిక్ష కేంద్రానికి.. ఆ తర్వాత చందమామకు

సరదాగా రోదసిలో గడిపిరావడానికి జపాన్‌కు చెందిన ఒక వ్యాపార దిగ్గజం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి పయనం కాబోతున్నారు. అంతేకాదు.. చందమామ వద్దకూ వెళ్లబోతున్నారు. ఇందుకోసం వ్యోమనౌకల్లో సీట్లు బుక్‌ చేసుకున్నారు. ఆ వ్యాపారవేత్త పేరు యుసాకు మేజవా. ఆన్‌లైన్‌లో వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. తన కంపెనీ ఉద్యోగి యోజో హిరానోతో కలిసి ఐఎస్‌ఎస్‌కు వెళ్లడానికి ఆయన రష్యాకు చెందిన సోయజ్‌ వ్యోమనౌకలో రెండు సీట్లను రిజర్వు చేసుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత అంతరిక్షంలోకి వెళుతున్న తొలి పర్యాటకుడిగా యుసాకు గుర్తింపు పొందనున్నారు.

9. Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ అంతలోనే కోలుకొని స్వల్పకాలం లాభాల్లో కొనసాగాయి. ఇలా రోజంతా సూచీల పయనం ఒడుదొడుకులమయంగా సాగింది. చివరకు సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 48,732 వద్ద ముగియగా.. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,677 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. కొవిడ్‌ భయాలు మదుపర్లను వెంటాడాయి. 

10. Ravi shastri: నా బిందాస్‌ బ్యాచే  నం.1

టీమ్‌ఇండియా కుర్రాళ్లపై కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదల ప్రదర్శించారని తెలిపాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో తన కుర్రాళ్లు అద్భుతంగా రాణించారని పొగిడాడు. ఐసీసీ విడుదల చేసిన వార్షిక ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌గా నిలిచింది. 121 రేటింగ్‌ సాధించింది. ఒక పాయింట్‌ అంతరంతో న్యూజిలాండ్‌ను రెండో స్థానంలోకి నెట్టేసింది. ఈ రెండు జట్లు త్వరలోనే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Shahrukh Khan: పోలిక బాగుంది.. కానీ!

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని