Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 16/05/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. Raghurama: గుంటూరు జైలుకు తరలింపు 

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై కాసేపట్లో జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది. 

Raghurama హ‌క్కుల‌ను కాల‌రాశారు: నాదెండ్ల‌

2. Corona: నిధుల కొర‌త లేదు:కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి నిధుల కొర‌త లేద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. కొవిడ్‌పై పోరుకు అనేక‌ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా బాధితుల‌కు కూడా చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల స‌ర‌ఫ‌రా పెంచాల‌ని కేంద్రాన్ని కోర‌గా.. సానుకూలంగా స్పందించింద‌ని మంత్రి అన్నారు. అంత‌కుముందు చైనా నుంచి తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లు చేరాయి. వీటిని గ్రీన్‌కో సంస్థ దిగుమతి చేసింది. కార్గో విమానంలో ఇవి శంషాబాద్ విమానాశ్ర‌యానికి వ‌చ్చాయి.

3. ‘వైఎస్‌ భారతికి సీఎం పదవి అప్పగించండి’

వైకాపా పాలనలో అన్నీ అస్తవ్యవస్తంగా ఉన్నాయని ఏపీ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ చేతకానితనంతో ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్‌ రాజు మాట్లాడారు. సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగిస్తే అప్పుడైనా రాష్ట్రంలో కొంత మార్పు వస్తుందేమో చూద్దామని వ్యాఖ్యానించారు. 

4. Corona: చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీతక్క

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె శాంతియుతంగా నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని.. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని డిమాండ్‌ చేశారు.

5. Corona: అప్రమత్తం చేస్తూ.. శానిటైజర్‌ వేస్తూ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బీటెక్‌ విద్యార్థి భమిడిపాటి హేమంత్‌కుమార్‌ ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌, టచ్‌అలర్ట్‌ పరికరాన్ని రూపొందించాడు. దీన్ని ఆన్‌ చేసి చేతికి పెట్టుకున్నాక ఏదైనా వస్తువును తాకేందుకు ప్రయత్నిస్తే సెన్సార్లు అలర్ట్‌ అయి బీప్‌ శబ్దం వస్తుంది. అనవసరంగా ముఖం, ముక్కు, ఇతర వస్తువులను తాకే ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. ఇందులోనే అమర్చిన ప్రత్యేక పైపు ద్వారా అవసరమైనప్పుడు చేతిలోకి శానిటైజర్‌ వస్తుంది. పరికరం తయారీకి కేవలం రూ.300 మాత్రమే ఖర్చయిందని హేమంత్‌ చెప్పాడు. 

6. వ్యాక్సిన్‌ కేంద్రాలుగా ఇక పాఠశాలలు, కాలేజీలు!

కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోన్న కర్ణాటక ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి చర్యలతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాలపై దృష్టి సారించింది. వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చే ప్రజలు వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాలైన పాఠశాలలు, కాలేజీ ప్రాంగణాల్లోకి మార్చేందుకు సిద్ధమయ్యింది. కరోనా వైరస్ ఉద్ధృతితో కర్ణాటక అతలాకుతలమవుతోంది. నిత్యం అక్కడ కొత్తగా 40వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. 

Lockdown: దిల్లీలో మరో వారం పొడిగింపు

7. ​​​​​​Hero motocorp: ఎలక్ట్రిక్‌ విభాగంలోకి హీరో

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఈ సంస్థ నుంచి వచ్చే ఏడాది ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం రానుందని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌వో నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. సొంత టెక్నాలజీతో ఈ వాహనం తీసుకొచ్చేందుకు రాజస్థాన్‌, జర్మనీలో ఉన్న తన ఆర్‌అండ్‌డీ విభాగాల సేవలను వినియోగించుకుంటోంది. అదే సమయంలో బ్యాటరీ స్వాపింగ్‌ (బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) వేదికను దేశంలోకి తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గొగోర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

8. గ్రామాల్లో వైరస్‌.. కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు తాకిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 30శాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కంటైన్‌మెంట్, నిర్వహణపై మరోసారి మార్గదర్శకాలు జారీచేశారు.

9. Jaathiratnalu: నెటిజన్‌కు నవీన్‌ సర్‌ప్రైజ్‌

నటుడు నవీన్‌ పొలిశెట్టి ఓ నెటిజన్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈమేరకు వీడియో కాల్‌ చేసి నెటిజన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇటీవల కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని, అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతోందని మే 5న సాయి స్మరణ్‌ అనే నెటిజన్‌ ఓ ట్వీట్‌ పెట్టాడు. అంతేకాకుండా ‘జాతిరత్నాలు’ వీక్షించిన తర్వాత ఆమె కొంత ఊరట పొందారని పేర్కొంటూ నవీన్‌ పొలిశెట్టిని ట్యాగ్‌ చేశాడు. కాగా, సాయి పెట్టిన ట్వీట్‌ చూసిన నవీన్‌ స్పందించారు.

10. Airtel: 5.5కోట్ల మందికి స్పెషల్ ఆఫర్‌

కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నెట్‌ వర్క్‌ను వినియోగించే అల్ప ఆదాయవర్గాలైన 5.5కోట్ల మందికి రూ.49 రీఛార్జ్‌ను ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమవంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. తాజా నిర్ణయం విలువ రూ.270 కోట్లని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని