close

తాజా వార్తలు

Published : 01/01/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. కోర్టు హాలులోనే కూర్చోండి

కోర్టుధిక్కరణ కేసులో శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష విధించింది. గురువారం హైకోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టు హాలులోనే కూర్చోవాలని శిక్ష విధిస్తూ... రూ.వెయ్యి జరిమానా కూడా వేసింది. జరిమానాను చెల్లించడంలో విఫలమైతే ఏడు రోజులు  సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. దీంతో శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు హైకోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టు హాలులోనే కూర్చొన్నారు. జరిమానాను చెల్లించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ధరణికి మరిన్ని మెరుగులు

రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా ఇతర అంశాల్లో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. భూవివాదాల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాకో ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ధరణి పోర్టల్లో మరిన్ని ఐచ్ఛికాలు కల్పించి, మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లోని అన్ని రకాల లోపాలను. భూసమస్యలను, రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను రెండు నెలల వ్యవధిలో పరిష్కరించి అర్హులైన రైతులందరికీ పాసుపుస్తకాలు జారీచేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తీర్పులు భావితరాలకు స్ఫూర్తి

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఇచ్చిన తీర్పులు భావితరాలకు ఎంతో స్ఫూర్తినిస్తాయని, న్యాయవ్యవస్థకు చేసిన సేవలు శ్లాఘనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి కొనియాడారు. ఆయన తన పదవీకాలంలో ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారన్నారు. గురువారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ పదవీవిరమణ సందర్భంగా హైకోర్టు సీజే ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. ఆయన పదవీవిరమణ జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొత్త స్ట్రెయిన్‌పై ఉదాసీనత వద్దు

కొవిడ్‌ తీవ్రత తగ్గిందనుకున్న సమయంలో మరింత ప్రమాదకరమైన కొత్త స్ట్రెయిన్‌(మార్పు చెందిన కరోనా వైరస్‌) అనే ప్రమాదం ముంచుకొస్తోందని హైకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలతో అప్రమత్తంగా ఉంటే తెలంగాణ ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదంటూ హితవు పలికింది. కొత్త స్ట్రెయిన్‌ మరింత తీవ్రమైనదని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో నూతన సంవత్సర వేడుకలకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, ఒకవైపు స్ట్రెయిన్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామంటూనే మరోవైపు నూతన సంవత్సర వేడులకు అనుమతించిందని ఆక్షేపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీకి 55 శాతం ఆమోదం.. సర్వేలో వెల్లడి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 55 శాతం ప్రజలు ఆమోదిస్తున్నారని ప్రపంచ నాయకులపై సర్వేలు నిర్వహించే ‘మార్నింగ్‌ కన్సల్‌’్ట సంస్థ తెలిపింది. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌కు 24 శాతం ఆమోద ముద్రే లభించింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిస్థితి మరీ ఘోరం. ఆయన పనితీరును ఆమోదించే వారి కంటే వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉన్నారట. మోదీ పని తీరును భారత్‌లో 75 శాతం ప్రజలు ఆమోదిస్తుంటే 20 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని.. దీంతో ఆయనకు 55శాతం ఆమోద ముద్ర లభించిందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీకాతో స్వాగతం

చైనాలోని వుహాన్‌ ప్రావిన్స్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విలయతాండవం చేస్తోందని 2020 ప్రారంభంలో తెలిసినా, మనదేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మార్చి నెలాఖరు నాటికి మనదేశంలోనూ కరోనా కేసులు కనిపించడం మొదలైంది. నెమ్మదిగా దేశవ్యాప్తంగా కేసులు విస్తరించాయి. దీంతో లాక్‌డౌన్‌, రవాణా ఆంక్షలతో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ఫలితమే జీడీపీ ఏప్రిల్‌-జూన్‌లో 23.9 శాతం, సెప్టెంబరు త్రైమాసికంలో 7.5 శాతం క్షీణతను నమోదు చేసింది..‘కరోనా’ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు చేయాల్సిన ఒత్తిడి ఆస్పత్రుల మీద పెరిగిపోగా, అవసరమైన ఔషధాలు, టీకాలు అభివృద్ధి చేయడం ఫార్మా కంపెనీల పని అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ ఒకే దేశం, ఒకే ఎన్నిక’తో బహుళ ప్రయోజనాలు: భాజపా

దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని భాజపా పేర్కొంది. ఎన్నికల కోసం చేసే వ్యయం తగ్గడంతో పాటు ఎన్నికల కోడ్‌ కారణంగా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితిని మార్చొచ్చని వివరించింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం ఆ పార్టీ వెబినార్లు నిర్వహించింది. ఓ కార్యక్రమంలో ప్రధాన అధికార ప్రతినిధి అనిల్‌ బలూని మాట్లాడుతూ ‘‘దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల కోసం కోడ్‌ అమల్లో ఉండటం వల్ల ఆయా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టాప్‌-10లో రహానె

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో నంబర్‌-2 బ్యాట్స్‌మన్‌గా 2020ని ముగించాడు. గురువారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌.. ఆసీస్‌ స్టార్‌ స్మిత్‌ నుంచి అగ్రస్థానాన్ని లాక్కున్నాడు. స్మిత్‌ మూడో స్థానానికి పడిపోయాడు. ఆసీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన రహానె అయిదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకు దక్కించుకున్నాడు. పుజారా పదో స్థానంలో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘క్రాక్‌’ కోసం వెంకటేష్‌

రవితేజ నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో అగ్ర హీరో వెంకటేష్‌ సందడి కనిపించబోతుంది. అలాగని ఆయనేం తెరపై కనిపించరు.. తెర వెనుక నుంచి కథ నడిపిస్తారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రం కోసం వెంకటేష్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పిస్తోంది చిత్ర బృందం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దళిత యువకుడి పరువు హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్య చోటుచేసుకుంది. పట్టపగలే ఓ దళిత యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆడమ్‌స్మిత్‌ (35) గురువారం మధ్యాహ్నం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై స్థానిక ఆర్టీసీ కాలనీలోని తమ ఇంటికి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. ఇనుప రాడ్లతో దాడిచేయడంతో స్మిత్‌ కింద పడిపోయారు. స్థానికులు హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని