
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. ఇదిగో టీకాస్త్రం
భారతావనిలో నెలల తరబడి సాగిన నిరీక్షణకు తెరపడింది. ఏడాదిగా లెక్కకు మిక్కిలి కష్టాలు, నష్టాలు, సంక్షోభాలు ఎదుర్కొని.. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన దేశ ప్రజలకు ఇది తీపి కబురు!! కొవిడ్-19 రక్కసిని అంతమొందించే దివ్యాస్త్రం సిద్ధమైంది. ఈ మహమ్మారికి అంతిమ విరుగుడు అయిన టీకాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’, పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కొవిషీల్డ్’ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చట్టాలన్నీ రామాయణ, భారతాల్లోనివే
రాజ్యాంగంలో మనం రాసుకున్న క్రిమినల్, సివిల్ ప్రొసీజర్ కోడ్లకు సంబంధించిన ధర్మసూత్రాలన్నీ రామాయణ, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించినవేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ అన్నారు. ధర్మబద్ధమైన జీవన ప్రాముఖ్యాన్ని పామరులకు కూడా చేరేలా వివరించడానికే వాటిని పౌరాణిక కథలుగా మహనీయులు నిక్షిప్తం చేశారన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఎక్కువగా రామాయణం, సివిల్ వివాదాలను మహాభారతం వివరిస్తాయన్నారు. హైదరాబాద్‌లోని మంథన్ సంస్థ వెబినార్ ద్వారా నిర్వహించిన ‘పురాణాలు-మన చట్టాలు’ అనే అంశంపై జస్టిస్ రామసుబ్రమణియన్ ఆదివారం మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రూ. 157 కోట్లు చెత్తపాలు
ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలకు నిర్లక్ష్యపు తుప్పుపడుతోంది. కొనుగోలు చేసి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా పంపిణీ చేయకపోవడంతో రూ.కోట్ల విలువైన ఆటోలు నిరుపయోగంగా మారుతున్నాయి. స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ 2018-19లో రూ.157 కోట్ల వ్యయంతో చెత్త సేకరణ కోసం 7,850 ఆటోలు కొనుగోలు చేసింది. తొలుత వీటిని పంపిణీ చేయాలనుకున్నా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రాలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంపిణీ నిలిపేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తెలంగాణలో థాయ్‌లాండ్ పండ్లు
హైదరాబాద్.. ఇతర నగరాలు, పట్టణాల్లో విదేశీ పండ్ల విక్రయాలు ఇటీవల పెరుగుతున్నాయి. ప్రజలు ఆసక్తితో కొంటున్నారు. అవే పండ్లను తెలంగాణలోనే పండించేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్ జామ పండ్ల సాగుతో సత్ఫలితాలు రావడంతో అదే దేశానికి చెందిన ‘థాయ్ పింక్ పండ్లు’ పండించాలని ఏర్పాట్లు చేస్తోంది. వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్ సుందరి’ అనే బ్రాండు పేరు పెట్టి వీటిని అమ్మేలా పంట సాగు చేయించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రూ.831 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన గుట్కా కంపెనీ
ఓ గుట్కా తయారీ సంస్థ ఏకంగా రూ. 831 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగ్గొట్టిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని దిల్లీ బుధ్ విహార్ ప్రాంతంలో అక్రమంగా గుట్కా, పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తున్న ఓ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించడంతో ఈ వ్యవహారం బయటపడింది. అక్కడ అక్రమంగా తయారు చేస్తున్న దాదాపు రూ.4.14 కోట్లు విలువైన గుట్కా, పాన్ మసాల, పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలో నందివాడ మండలం తమిరిశ సమీపంలోని చేపలచెరువు గట్లపై నిర్వహిస్తున్న జూద శిబిరాలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ జయకృష్ణరాజు నేతృత్వంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు జరిపారు. రూ.42 లక్షల నగదుతోపాటు డబ్బులకు బదులుగా వాడే ప్లాస్టిక్ టోకెన్లు లభించాయని ఏఎస్పీ తెలిపారు. 30 మంది జూదరులను అదుపులోకి తీసుకొని.. 20 కార్లు, 32 ద్విచక్రవాహనాలు, 29 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. దేశం గర్వించదగ్గ సందర్భం
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్-19 కు విరుగుడుగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వటంపై ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల సంతోషం వెలిబుచ్చారు. ఆయన ఏమన్నారంటే... ‘కొవాగ్జిన్’ టీకా అభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి మచ్చుతునకగా డాక్టర్ కృష్ణ ఎల్ల అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అంతా అయోమయం
ఆస్ట్రేలియాలో భారత పర్యటన అయోమయంలో పడేలా ఉంది. ఆటేతర విషయాలు సిరీస్‌పై ప్రభావం చూపేలా ఉన్నాయి. తొలి రెండు టెస్టులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగియడంతో.. సిరీస్ సజావుగా సాగుతుందోనుకుంటున్న సమయంలో బయట రెస్టారెంట్లో భోజనం చేశారని భారత ఆటగాళ్లను ఐసొలేషన్‌లో పెట్టడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిలిసిందే. ఇప్పుడేమో చివరిదైన నాలుగో టెస్టును బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఆడబోమని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు వార్తలు రావడంతో వాతావరణం వేడెక్కింది. ఒకవేళ అక్కడే మ్యాచ్ ఆడక తప్పదనే పరిస్థితి ఉంటే సిరీస్‌ను బహిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అలాగైతే బీసీసీఐపై రూ.906 కోట్ల భారం!
9. వాటిని పట్టించుకొంటే ఎక్కడో ఆగిపోయేవాడ్ని
ఉర్రూతలూగించే హుషారైన పాటలకు.. మదిని మైమరపించే మెలోడీ గీతాలకు చిరునామా.. తమన్. ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో జాతీయ స్థాయిలో సినీ సంగీత ప్రియుల్ని మురిపించిన ఆయన.. ఇప్పుడు దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘క్రాక్’ చిత్రానికీ ఆయనే స్వరాలందించారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఈనెల 9న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ఫోన్లో ముచ్చటించారు తమన్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రెండు గ్రామాల ఉగ్రదాడి.. 100 మంది కాల్చివేత
పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 100 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై నైజర్ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు. శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి