close

తాజా వార్తలు

Published : 18/01/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. సిన్హా కమిటీ... చర్యలు ఎప్పటికి?

రాజధాని హైదరాబాద్‌ చుట్టూ ఏళ్ల క్రితం చోటుచేసుకున్న భూ ఆక్రమణల్లో అక్రమాలను, అధికారుల ఉదాసీనతలను శ్యాం కుమార్‌ సిన్హా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ ఐదేళ్ల క్రితమే బయటపెట్టింది. ఇందుకు బాధ్యులైన వారిపై సివిల్‌/క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అక్రమాల గుట్టును వెల్లడించి... ఇలాంటివి భవిష్యత్తులో చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను పేర్కొంటూ ఏకంగా ప్రభుత్వానికి 11 నివేదికలను సమర్పించింది. ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. మరో పక్క తాజాగా అక్కడక్కడా ఆక్రమణలు కొనసాగుతుండటంతో సిన్హా కమిటీ నివేదికపై మరోసారి చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.10 లక్షలకు కిడ్నాప్‌ ఒప్పందం

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌ సమయంలో ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లోనే ప్రణాళిక రూపొందించినట్లు కీలక ఆధారాలు సేకరించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, ఆమె అనుచరుడు గుంటూరు శ్రీను ఈ నెల 2, 4 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమైనట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో వెల్లడించారు. కిడ్నాప్‌ చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాళేశ్వరంలో ఖర్చు చేసింది రూ.65 వేల కోట్లే

‘కాళేశ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.80,190 కాగా ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు ఖర్చయ్యాయి. చేసిన ఖర్చుకు తగ్గట్లు ఇంత పెద్దఎత్తున పనులు కనిపిస్తున్నా.. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు’... అంటూ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పలువురు విశ్రాంత ఇంజినీర్లు పేర్కొన్నారు. ‘కాళేశ్వరం ప్రస్తుత స్థితి’ అనే అంశంపై విశ్రాంత ఇంజినీర్ల సంఘం, వాటర్‌ మేనేజ్మెంట్‌ ఫోరం, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో పలువురు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహా నిర్లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలకు చుట్టపక్కల ప్రాంతాల్ని, గ్రామాల్ని వాటిలో విలీనం చేస్తున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన విజయవాడ విషయంలో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్ని విలీనం చేస్తూ.. విజయవాడలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాల్ని మాత్రం నగరపాలక సంస్థలో కలపకుండా ముక్కలుగా విభజిస్తోంది. విజయవాడను మహానగరంగా మార్చాలన్న ఆకాంక్షలకు గండి కొడుతోంది. అన్ని అర్హతలు, అవకాశాలున్నా విజయవాడను గ్రేటర్‌గా మార్చడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందడుగు వేయట్లేదు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైతుకు కన్నీరు.. వ్యాపారికి పన్నీరు

తెలంగాణలో టమాటా రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా నామమాత్రపు ధర కూడా దక్కడంలేదు. క్వింటా టమాటాకు రూ.900 దక్కితే రైతుకు గిట్టుబాటవుతుందన్నది ఉద్యానశాఖ లెక్క కాగా..రూ.100 నుంచి రూ.250 మాత్రమే దక్కుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వినియోగదారులకు మాత్రం టోకు, చిల్లర వ్యాపారులు కలిసి కిలో టమాటాను రూ.10 నుంచి రూ.15కు అమ్ముతుండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాషాయం కట్టిన లౌకికవాది

నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం అంతా కలిపితే పద్నాలుగేళ్లు కూడా ఉండదు. అంత తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాళ్లు మరొకరు లేరు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఎడతెగని పోరాటం చేశారు. కేంద్రం పెత్తనాన్ని ఎదుర్కొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటి మీదకు తీసుకువచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రామ మందిర నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల వరద పారుతోంది. ఇప్పటివరకు రూ.100 కోట్ల విరాళాలు వచ్చాయని రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ‘‘పూర్తి సమాచారం ప్రధాన కార్యాలయానికి చేరలేదు. కానీ మా కార్యకర్తల సమాచారం మేరకు ఇప్పటికే రూ.100కోట్ల విరాళాలు వచ్చాయి’’ అని చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయోధ్యలో రాముని గుడి నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 2030కి 100 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం సామర్థ్యాన్ని వినియోగించడం ద్వారా 35 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికి తీయాలన్న లక్ష్యంతో ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ పనిచేస్తోంది. 2030 నాటికి వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 100 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్నది ప్రణాలికగా ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (ఉత్పత్తి) పి.కె.సత్పతి తెలిపారు. ఉక్కు తయారీసంస్థలకు ఆటంకాలు లేకుండా, నిరంతరం ఖనిజం సరఫరా చేయడమే తమ ఆశయమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రైనాను చెన్నై అట్టిపెట్టుకోదా?

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనగానే గుర్తొచ్చేది ధోని మాత్రమే కాదు సురేశ్‌ రైనా కూడా! ఈ లీగ్‌లో ఆ జట్టు విజయాల్లో ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ది కీలకపాత్ర. అయితే ఐపీఎల్‌-13 తర్వాత సమీకరణాలు మారాయి. దుబాయ్‌లో జరిగిన టోర్నీలో ఆడకుండా కరోనా కారణం చూపించి స్వదేశానికి వచ్చేసిన రైనాను రాబోయే మినీ వేలంలో చెన్నై తిరిగి దక్కించుకోకపోవచ్చని సమాచారం. దీనికి తోడు చెన్నై గతంలో అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రైనా స్థానం రెండోది. అతనికి ఈ ఫ్రాంఛైజీ సీజన్‌కు రూ.11 కోట్లు చెల్లిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘అల్లుడు అదుర్స్‌’ కొత్త ఉత్సాహమిచ్చింది

‘‘ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఎంతో నిజాయితీగా కష్టపడి సినిమా చేశాం. మంచి ఆదరణతో మాకు ఓ కొత్త ఎనర్జీ అందిస్తున్నారు ప్రేక్షకులు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా’’ అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇప్పుడాయన నుంచి వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ రౌతు దర్శకుడు. సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మించారు. నభా నటేష్‌, అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని