close

తాజా వార్తలు

Published : 21/01/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. అందరివాడిని

స్వేచ్ఛా సమానతలకూ, ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకొనే అగ్రరాజ్యంలో... అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత నడుమ... అమెరికా 46వ అధ్యక్షునిగా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా 56 ఏళ్ల కమలా హారిస్‌ బాధ్యతలు చేపట్టారు. ‘‘చరిత్రాత్మక సంక్షోభం, సవాళ్లు నెలకొన్న ప్రస్తుత తరుణంలో... యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా పేరుకు తగ్గట్టే అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అలా చేస్తే వైఫల్యానికి చోటే ఉండదు. నేను అందరి అధ్యక్షునిగా ఉంటా’’ అని ఈ సందర్భంగా బైడెన్‌ హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నవ్య అమెరికాను నిర్మిద్దాం నాతో రండి 

2. విదేశాల్లో ఎక్కడైనా మెడిసిన్‌ చదవొచ్చు

విదేశాల్లోని వైద్య కళాశాలల్లో చదువుకోవడంపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తొలగించింది. ఇప్పటివరకు విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే ఎంసీఐ ప్రకటించిన జాబితాలో సంబంధిత కళాశాల ఉంటేనే ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉండేది. తాజా ఎన్‌ఎంసీ ప్రకటించిన నిర్ణయం మేరకు ప్రపంచంలోని ఏ వైద్య కళాశాలలోనైనా విద్యార్థులు చదవొచ్చు. అయితే ఈ కళాశాలలు డబ్యూహెచ్‌వో ప్రామాణికాలకు అనుగుణంగా ఏర్పాటై ఉండాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు!

అగ్రరాజ్యంలో బైడెన్‌ సర్కారు కొలువుదీరడంతోనే భారతీయ వృత్తి నిపుణులకు మేలుచేసే చర్యలు చేపట్టనుంది! అమెరికా సంస్థల్లో పనిచేసే విదేశీయులకు గ్రీన్‌కార్డులను జారీచేసే విషయంలో... ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న పరిమితులను ఎత్తివేయనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర వలస బిల్లును కాంగ్రెస్‌ ఆమోదం కోసం పంపనుంది. ఇది అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయ ఐటీ తదితర వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం సుసాధ్యమైనట్టే! అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బైడెన్‌ ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘మండలి’ ఓట్ల నమోదుకు వెసులుబాటు

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే శాసన మండలి ఎన్నికలకూ నామినేషన్ల దాఖలు చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గతంలో ఈ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పద్ధతిలో మార్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు సభ్యుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 30 వరకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఈ నెల 30 వరకు ఉచిత ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైనవారు దరఖాస్తు చేస్తే 90 రోజుల్లోగా పట్టాలివ్వాలని పేర్కొన్నారు. ఉచిత ఇంటి స్థలాల పంపిణీ నిరంతరం జరపాలని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ 2 నిమిషాలు.. అంతటా మౌనం 

అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 30న దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇది కొన్ని కార్యాలయాలకే పరిమితమవుతూ వస్తోందని, సాధారణ ప్రజలు రోజువారీ పనుల్లో నిమగ్నమవుతూ దీన్ని విస్మరిస్తున్నారని హోంశాఖ అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కళా వెంకటరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును నాటకీయ పరిణామాల మధ్య విజయనగరం జిల్లా పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహనశ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది.  రాత్రి 11.15 గంటలకు ఆయన్ను పోలీసులు విడిచిపెట్టడంతో రెండున్నర గంటల ఉత్కంఠకు తెరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సరే.. సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తాం!

వివాదాస్పదంగా మారిన నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నరేళ్లపాటు నిలుపుదల చేస్తామని కేంద్ర సర్కారు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. వీటి అమలును స్తంభింపజేసి, ఒక సంయుక్త సంఘాన్ని నియమించడానికి పదో విడత చర్చల్లో కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉభయులకు అంగీకారయోగ్యమైనంత కాలంపాటు మూడు చట్టాలను రద్దు చేయడానికి, ఒక కమిటీని నియమించడానికి సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేస్తామని ప్రకటించింది. నిరసనలను విరమించి ఇళ్లకు తిరిగి వెళ్లాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేసింది. ఉద్యమ నేతలు దీనికి వెంటనే అంగీకారం తెలపలేదు. గురువారం తాము అంతర్గతంగా చర్చించుకుని తుది నిర్ణయం చెబుతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందానికి సెబీ ఆమోదం

ఫ్యూచర్‌ గ్రూప్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు సెబీ బుధవారం లేఖ జారీ చేసింది. అయితే కాంపోజిట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ కింద కొన్ని షరతులను సెబీ పెట్టింది. అమెజాన్‌ లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలను సైతం ఆ లేఖలో ప్రస్తావించింది. రిలయన్స్‌కు ఫ్యూచర్‌ గ్రూప్‌ జారీ చేసే షేర్లు లాకిన్‌లో ఉండాలని తెలిపింది. అదే సమయంలో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ముందు దాఖలు చేసే పత్రాల్లో సైతం, ఇరు సంస్థల ఒప్పంద పథకంలో పాత్ర ఉన్న ప్రమోటరు/ప్రమోటరు గ్రూపు లేదా డైరెక్టర్ల వివరాలు పొందుపరచాలని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఫేస్‌బుక్‌తో సమాచారం పంచుకోం

10. 13వ స్థానంలో పంత్‌

భారత వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఐసీసీ టెస్టు  ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకు వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆసీస్‌తో చివరి టెస్టులో టీమ్‌ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు.. కెరీర్‌లోనే అత్యుత్తమంగా 13వ ర్యాంకు సాధించాడు. విరాట్‌ కోహ్లీని వెనక్కి నెట్టి లబుషేన్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి (4వ) ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో ఆడని సంగతి తెలిసిందే. శుభ్‌మన్‌ గిల్‌ 68 నుంచి 47వ స్థానానికి ఎగబాకాడు. పుజారా ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 2-1 కాదు 2-0!
ఇక చాలుTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని