close

తాజా వార్తలు

Published : 07/01/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర: ఏపీ సీఎస్‌

ఏపీలో మతసామరస్యం కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవాదాయ, మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని చెప్పారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతాం: ద.మధ్య రైల్వే

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని భావిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. టికెట్‌ ఖరారైన ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో అనుమతి ఉంటుందని.. ఇతరులకు ప్లాట్‌ఫాంపై కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్‌, హౌరా, ముంబయి, న్యూదిల్లీ, గువహటి, దానాపూర్‌, జైపూర్‌, నాగ్‌పుర్‌, నాందేడ్‌, పర్బాని, ఔరంగాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మొదలగు ప్రాంతాలకు పండగ ప్రత్యేక రైళ్లు నడుపుతామని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లేఅవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే..: జగన్‌

వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరో 17వేల కాలనీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ వచ్చేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భీమిలి-భోగాపురం మధ్య 6 లేన్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అలాగే గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారు: భట్టి

రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భారత్‌బంద్‌ సమయంలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన కేసీఆర్‌, దిల్లీ వెళ్లిరాగానే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద భట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మా వ్యాక్సిన్‌తో రెండేళ్లపాటు ఇమ్యూనిటీ..!

ప్రపంచంలో అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా నిలిచింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ అమెరికా, బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మోడెర్నా వ్యాక్సిన్‌ రెండేళ్ల పాటు రక్షణ కలిగిస్తుందని సంస్థ సీఈఓ వెల్లడించారు. అయితే, వీటిపై పూర్తిస్థాయి విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ 94.5శాతం సమర్థత చూపించిందని మోడెర్నా ఇదివరకే ప్రకటించింది. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్‌ తయారుచేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇలాంటి పరిస్థితుల్లో యూకేకు విమానాలా?

కొత్త రకం కరోనా వైరస్‌తో సతమతమవుతున్న యూకేకు విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించాలని తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. యూకేలో కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, విమానాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. దేశంలో అతి కష్టం మీద కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. యూకేలో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమానాలపై నిషేధం ఎత్తివేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం ఎందుకని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిషేధిత జాబితాలోకి అలీబాబా?

చైనాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అలీబాబాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధినేత జాక్‌మా అదృశ్యం ఆ సంస్థను ఇబ్బందుల్లో నెట్టేయగా.. తాజాగా ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టే అంశాన్ని అగ్రరాజ్యం అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలీబాబాతోపాటు ప్రముఖ సోషల్‌ మీడియా గేమింగ్‌ సంస్థ టెన్సెంట్‌ను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం కూడా ప్రచురితమైంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాక్టివా కస్టమర్లు @ 2.5 కోట్లు 

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్‌ దేశంలో 2.5 కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్‌ బ్రాండ్‌ ఈ మైలురాయిని చేరుకున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది. స్కూటర్లకు ఆదరణకు క్షీణిస్తున్న రోజుల్లో 2001లో యాక్టివాను హోండా తీసుకొచ్చింది. గత 20 ఏళ్లుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు చేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటున్నామని హోండా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బైడెన్‌ ఎన్నిక.. కిమ్‌ కీలక నిర్ణయం!

ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు  పార్టీ కీలక నేతలతో నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా- ఉత్తర కొరియా అణు ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కిమ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘ దేశ రక్షణ సంబంధిత వ్యవహారంలో సైనిక సామర్థ్యాలు పటిష్ఠంగా ఉండాలి. దీనికోసం మనం మరింత కృషి చేయాలి’’ అని కిమ్‌ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ నాలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం

కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల విషయమై పలు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 59శాతం ఈ 4 రాష్ట్రాల్లో నమోదైనవేనని తెలిపారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటించేలా  చర్యలు తీసుకోవారాలని ఆయన రాష్ట్రాల అధికారులకు గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని