close

తాజా వార్తలు

Published : 08/01/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. నిమ్మగడ్డతో అధికారుల బృందం భేటీ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు, టీకా షెడ్యూల్‌ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని.. ముగ్గురు సీనియర్‌ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దు’

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. అఖిలప్రియకు బెయిలిస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని.. ఆమె చర్యల కారణంగా స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని కోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వెనక్కిచ్చిన మహిళ

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఒక కలలాంటిది. ఆ కలను నెరవేర్చుకునేందుకు ప్రతి పైసా కూడబెడతాం. ఓ మహిళ సొంతింటి కలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నెరవేర్చింది. డబుల్‌ బెడ్‌రూం పథకంలో భాగంగా ఆమెకు ఇంటిని మంజూరు చేసింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇక హమ్మయ్య అనుకుంటారు. వారి తర్వాత వారసులకు ఆ ఇల్లు ఉంటుందనే భరోసాతో జీవనం సాగిస్తారు. కానీ సిద్దిపేటలో ఓ మహిళ దీనికి భిన్నంగా చేసిన పనితో అందరి మన్ననలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన రచ్చ లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పవన్‌ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు. పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపేందుకు పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆలయాల పునర్నిర్మాణం ఇప్పుడు గుర్తొచ్చిందా?

రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా హిందువులు నమ్మరని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేసిన నేపథ్యంలో అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన 19 నెలల కాలంలో ఆలయాల పునర్నిర్మాణం గుర్తుకురాలేదా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్‌ ఫ్లూ!

దేశంలో బర్డ్‌ ఫ్లూ ఆందోళన పెరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోనే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ జరిగినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం, వ్యాధిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక దేశరాజధాని దిల్లీలోనూ 16 పక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘రద్దు’కే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం

వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలించలేదు. చట్టాలను ఉపసంహరించుకుంటేనే తాము ఇళ్లకు వెళ్తామని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో తదుపరి దఫా చర్చలను జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న 41 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్యూ3లో టీసీఎస్‌ లాభం 7.2% జంప్‌

దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే సంస్థ టీసీఎస్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలు మించి లాభాలను సొంతం చేసుకుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన స్థూల లాభం రూ.8,701 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.8,118 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం అధికం కావడం గమనార్హం. ఇక కంపెనీ ఆదాయం సైతం 5.4 శాతం వృద్ధి చెందింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో గతేడాది రూ.39,854 కోట్లు ఆదాయం సముపార్జించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,015 కోట్లు ఆదాయం వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రిటైర్మెంట్ తర్వాత ధోనీ తొలి పోస్ట్‌ ఇదే!

ఇతర క్రికెటర్లతో పోలిస్తే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ సామాజిక మాధ్యమాల్లో అంత చురుకుగా ఉండని విషయం తెలిసిందే. తన గారాలపట్టి జీవాతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు మాత్రం అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంటుంటాడు. అయితే గత ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మహీ ఇన్‌స్టాలో మరో పోస్ట్ చేయలేదు. తన కెరీర్‌లో ముఖ్యమైన జ్ఞాపకాలతో ఓ వీడియో పోస్ట్ చేసి.. అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో నెలల తర్వాత ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాట్సాప్ కొత్త పాలసీ.. వారికి మాత్రమేనట..!

ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటామని తెలిపింది. అలానే వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది. వాట్సాప్‌ తాజా ప్రకటనతో యూజర్స్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెరదించినట్లయింది. అయితే దీనికి కొద్ది గంటల ముందు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వాట్సాప్ కొత్త పాలసీపై స్పందించారు. వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్ ఉపయోగించాలని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్ యాప్‌కి యూజర్స్‌ తాకిడి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని