close

తాజా వార్తలు

Published : 25/02/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఒక్క సంతకంతో ఆ కేసులు మాఫీ చేస్తా: చంద్రబాబు

సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ ఓటర్లను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దొడ్డిదారిన గెలిచిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కుప్పం పర్యటనలో భాగంగా గుడిపల్లెలో నిర్వహించిన తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించడం వల్ల కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. కుప్పంలో జూద సంస్కృతి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తానని చెప్పారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: కేటీఆర్‌

తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్రమంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన కేటీఆర్ వివిధ విభాగాల్లో శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను వివరిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు. తెరాస అధికారం చేప్టటిన 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 1,32,899 ఖాళీలను భర్తీ చేసిందన్నారు. వాటి జాబితాను శాఖల వారీగా మరోసారి వెల్లడిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సామాజిక మాధ్యమాలు చట్టాలకు లోబడి ఉండాలి

అన్ని సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థలూ దేశ చట్టాలకు లోబడి ఉండాలని ఆయన సూచించారు. గురువారం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ డిజిటల్‌ మీడియాకు కొత్త నియమావళిని సూచించిన నేపథ్యంలో అమిత్‌షా ట్విటర్‌లో స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫోన్‌లో రికార్డ్‌ చేయండి..వెబ్‌లో వినండి

పిక్సెల్ ఫోన్ యూజర్స్‌ కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఫోన్‌లో రికార్డ్‌ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని వెబ్‌ పేజీలో వినొచ్చు. ‘గూగుల్ రికార్డర్’ పేరుతో తీసుకొస్తున్న ఈ వెబ్‌ అప్లికేషన్‌లో పిక్సెల్ ఫోన్‌ యూజర్స్‌కి తమ ఆడియో ఫైల్స్‌ని మొబైల్/డెస్క్‌టాప్‌ల ప్లే చెయ్యొచ్చు. బ్రౌజర్‌లో Recorder.Google.com అని టైప్ చేస్తే గూగుల్ రికార్డర్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో మీకు కావాల్సిన వాయిస్ క్లిప్‌లను వినడమే కాకుండా ఎక్కువ నిడివి ఉన్న ఆడియో ఫైల్స్‌ని, ఇంటర్వ్యూలను సులభంగా వెతికి ట్యాగ్ చేసి షేర్ చెయ్యొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించిన ఫైజర్‌

జన్యుమార్పిడి చెందుతున్న కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫైజర్‌ సంస్థ వ్యాక్సిన్‌ మూడో డోసుపై ప్రయోగాలు ప్రారంభించింది. ఈ మేరకు ఫైజర్‌ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సంవత్సరం క్రితం ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటిదశ ప్రయోగాల్లో పాల్గొన్న వారికే ఈ మూడో డోసును అందిస్తున్నామని వారు వెల్లడించారు. వారికి వ్యాక్సిన్‌ మూడో డోసు అందించిన తర్వాత వారిలో కొత్త రకం వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంత మేరకు అభివృద్ధి చెందాయో పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం

ఊహించిందొకటి.. జరిగింది మరొకటి! అంచనా వేసిందొకటి.. అయ్యింది మరొకటి! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. లక్షాపదివేల సామర్థ్యం. కళకళాడుతున్న స్టాండ్లు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రత్యర్థులు. గులాబి బంతితో పోరు. ఇంకేముంది! ఐదురోజుల క్రికెట్‌ వేడుక చేసుకుందామని భావించారు అభిమానులు. కానీ.. వారికా మజా దొరకలేదు. స్పిన్‌ దెబ్బకు అది రెండు రోజుల సంబరంగానే మిగిలిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రకటనల్లో వార్తాపత్రికలకు సరైన వాటా ఇవ్వండి!

వార్తాపత్రికల కంటెంట్‌ను వినియోగించుకున్నందుకు సరైన పరిహారం చెల్లించాలని సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ను ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) కోరింది. ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్తల వాటాను 85శాతానికి పెంచడంతో పాటు, ఆదాయ పంపిణీలో మరింత పారదర్శకత వహించాలని డిమాండ్‌ చేసింది. ఇందుకోసం భారత న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) తాజాగా గూగుల్‌కు లేఖ రాసింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్‌ కంటెంట్‌పై మీడియా సంస్థలకు రుసుము చెల్లించాలని ఆస్ట్రేలియా నిర్ణయించిన వేళ, భారత్‌లోనూ ఇదే విషయం మరోసారి చర్చనీయాంశమయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాల్పుల విరమణకు కట్టుబడతాం

నియంత్రణ రేఖతో పాటు ఇతర సెక్టార్లలో కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్‌- పాక్‌ నిర్ణయించాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను గురువారం విడుదల చేశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.ఈ మేరకు మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంవో) స్థాయిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ -పాక్‌ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో హాట్‌లైన్‌ ద్వారా డీజీఎంవో స్థాయిలో ఈ సమావేశం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది!

అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అంతా అలా జరిగిపోతుందంతే..! రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌ ఓ గృహిణిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్‌కు చెందిన రేణూ చౌహాన్‌ ఇటీవల రూ.100లకు లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశారు. లాటరీ తీయగా ఆమె టిక్కెట్‌ ప్రైజ్‌ విన్నర్‌గా నిలిచినట్టు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్ర లాటరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో లాటరీ టిక్కెట్‌తో పాటు అవసరమైన దస్త్రాలను అధికారులకు ఆమె గురువారం సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శివకాశిలో పేలుడు: ఆరుగురి మృతి

తమిళనాడులో శివకాశి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలోని ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కేంద్రంలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అక్కడ భారీ స్థాయిలో పేలుడు సంభంవించి తయారీ కేంద్రంలోని పది గదులు నేలమట్టమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని