close

తాజా వార్తలు

Updated : 05/03/2021 21:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. విశాఖ మేయర్‌ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని.. తెదేపా విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని పెందుర్తి కూడలి, గోపాలపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రచారంలో భాగంగా జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్‌ను చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో పీలా శ్రీనివాస్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ప్రజలను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ తగ్గించారు: మేయర్‌

నగర ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్‌ ఇచ్చిందని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే సులభతర జీవనంలో హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ను తగ్గించారని ఆమె ఆక్షేపించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి 24వ స్థానం ప్రకటించడం సరికాదన్నారు. ఈ మేరకు మేయర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ముత్యాల నగరంగా పేరుపొందిన హైదరాబాద్‌.. అభివృద్ధిలో దేశంలోని అన్ని నగరాల కంటే ముందు దూసుకెళ్తోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘విశాఖ కార్పొరేషన్‌లో వైకాపాదే విజయం’

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతమైందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

4. క్లిక్‌ చేస్తే బూట్లు ఫ్రీ... నమ్మొద్దు ప్లీజ్

సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫేక్‌ లింకులు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పొరపాటున క్లిక్‌ చేస్తే చాలు.. ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దగ్గర పడుతున్న వేళ వాట్సాప్‌లో ఒక ఫేక్‌ లింక్‌ చక్కర్లు కొడుతోంది. ‘ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బూట్లను మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా పొందండి’ అన్నది ఆ లింక్‌ సారాంశం. ఆకర్షణీయంగా ఉన్న దాన్ని చూడగానే అందరూ ఆసక్తిగా ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తారు. అంతే హ్యాకర్ల చేతికి మనం తాళాలిచ్చినట్లే.. కాబట్టి ఇటువంటి ఫేక్‌ లింకులపై యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెట్రో ధరలు భారమే, కానీ: నిర్మలా సీతారామన్‌

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల ప్రజలపై భారం పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆ భారాన్ని తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులపై భారం పడుతున్న మాట వాస్తవమే అయినా కేంద్రం మాత్రమే పన్నులు వేయడం లేదన్నారు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మార్చి 15న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అధికారులు ఆమెకు సూచించారు. మెహబూబా ముఫ్తీ 2016 నుంచి 2018 వరకు జమ్మూకశ్మీర్‌ సీఎంగా పనిచేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని వ్యతిరేకించిన ఆమె గృహనిర్బంధానికి గురయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్బంధం నుంచి బయటకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బంతిని బట్టే గౌరవం.. శిక్ష: పంత్‌

క్రీజులోకి వచ్చినప్పుడు రోహిత్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే ప్రణాళిక అని టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ అన్నాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న తర్వాత తనవైన షాట్లు ఆడాలని  నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు. నాలుగో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగించిన సంగతి తెలిసిందే. రిషభ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్వితీయమైన శతకానికి వాషింగ్టన్‌ సుందర్‌ (60 బ్యాటింగ్‌; 117 బంతుల్లో 8×4) అర్ధశతకం తోడవ్వడంతో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నాలుగో టెస్టు: పట్టు బిగించిన భారత్‌

8. ఒక్కరోజే సుమారు 14 లక్షల మందికి టీకా

దేశంలో ఒకవైపు వ్యాక్సిన్ పంపిణీ సాఫీగా సాగుతుండగా.. మరోవైపు రోజు రోజుకీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షలు(13,88,170) మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 16న మొదటి దశ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత మందికి టీకా అందించడం తొలిసారి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 1.8 (1,80,05,503) కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం గణాంకాలు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొవిడ్‌ మూలాలు: దర్యాప్తు జరిపినా..వీడని గుట్టు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి మూలాలను కనిపెట్టేందుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగింది. అయినప్పటికీ కొవిడ్‌ మూలాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. వీటి మూలాలను ప్రపంచం తెలుసుకోవడం దరిదాపుల్లో కనిపించడం లేదని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దర్యాప్తును కొనసాగించాలని పిలుపునిస్తూ 26మందితో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం బహిరంగ లేఖ విడుదల చేసింది. సంవత్సరం గడిచినా..యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌ మూలాలను కనుక్కోవడంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌ నిపుణులు నికోలయ్‌ పెట్రోవ్‌స్కై అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌పై కేసు

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌పై ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 10వ వార్డు పరిధిలో శ్రీరామ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ అక్కడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి నాగవల్లి ధర్మవరం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో కీలక మలుపుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని