Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 22:30 IST

Top Ten News @ 9 PM

1. తెదేపా నేత లోకేశ్‌పై కేసు నమోదు

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతేడాది తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా పరామర్శ కోసం లోకేశ్‌ సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కి  వెళ్లారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ లోకేశ్‌తో పాటు  తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, అధికార ప్రతినిధి పట్టాభి, తెలుగు యువత నేత దేవినేని చందులపై పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

2. హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండాయే

తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలను యాచకులుగా మార్చే పాలన నడుస్తోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రావు పద్మతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవమూ అంతే ముఖ్యమన్నారు. కులమతాలతో ఎలాంటి సంబంధం లేదని.. తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే అని స్పష్టం చేశారు.

ap news: కొత్తగా 5,674 కరోనా కేసులు
ts news: కొత్తగా 1,362 కేసులు

3. Heart Melts: చెల్లెళ్లే కాడెద్దులై..

ఎద్దులు కొనే స్తోమత లేని ఓ నిరుపేద సోదరుడు పొలం దున్నేందుకు తన ఇద్దరు చెల్లెళ్లనే కాడెద్దులుగా మార్చాడు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకునేందుకు  ఆ సోదరీమణులు కాడెద్దుల్లా అరకను లాగారు. ఆ యువతుల కష్టం.. ఆ సోదరుడి తాపత్రయం.. చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన మనసును ద్రవింపజేస్తోంది. సాగు చేసేందుకు ఓ అన్న తన ఇద్దరు చెల్లెళ్లనే కాడెద్దులుగా మార్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలో జరిగింది. 

4. 36 రఫేల్‌ యుద్ధ విమానాలు.. లక్ష్యం 2022

భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు.

5. ఒక్కరోజులోనే 10 అంతస్తుల భవనం!

ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. పైకెత్తి చూస్తే తలపాగా పడిపోయేంత ఎత్తయిన కట్టడాలెన్నో చూస్తున్నాం. అయితే వీటిని నిర్మించేందుకు కనీసం నెలల సమయమైనా పట్టొచ్చు. కానీ, చైనాకు చెందిన బోర్డు గ్రూపు నిర్మాణ సంస్థ మాత్రం 10 అంతస్తుల భారీ భవనాన్ని కేవలం 28 గంటల 45 నిమిషాల్లో నిర్మించి ఔరా అనిపించింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అదే ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్‌స్ట్రక్షన్‌’ విధానం ప్రత్యేకత. ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ మరీ ఇంత తక్కువ సమయంలో అంత ఎత్తయిన భవనాన్ని నిర్మించడం ఇదే తొలిసారి అని బోర్డు గ్రూపు సంస్థ చెబుతోంది. 

6. Swiss Bank: భారతీయుల సంపద పెరిగిందా?

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద ఏడాది వ్యవధిలో భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ అధికారుల్ని కోరినట్లు తెలిపింది.  ‘‘స్విస్‌ బ్యాంకుల్లో 2019 ఆఖర్లో రూ.6,625 కోట్లుగా ఉన్న భారతీయుల సంపద 2020 చివరి నాటికి భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత రెండేళ్లుగా తగ్గుముఖం పట్టిన ఈ సంపద తిరిగి పెరిగిందని పేర్కొన్నాయి. అలాగే గత 13 ఏళ్లలో ఈసారే అత్యధిక డిపాజిట్లు నమోదైనట్లు తెలిపాయి’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. 

7. Milkha: మిల్కా పేరుతో క్రీడా వర్సిటీలో విభాగం

కరోనా బారిన పడి కన్నుమూసిన భారత పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ గౌరవార్థం పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రీడా దిగ్గజం పేరుతో పటియాలాలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో ఓ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు.  శనివారం ఆయన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రానా గుర్మిత్‌సింగ్‌తో కలిసి మిల్కా సింగ్‌ నివాసానికి వెళ్లారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. మిల్కా సింగ్‌ తనయుడు జీవ్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మిల్కా సింగ్‌ నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

8. Mask: పిల్లల్లో రోగనిరోధక శక్తిని దెబ్బ తీయొచ్చు!

మాస్కులు, భౌతిక దూరం కరోనాకు చెక్‌ పెట్టే రక్షణ కవచాలు కాగా.. అవే చిన్నారులకు ప్రమాదకరంగా మారనున్నాయట. అవి వారి రోగ నిరోధకశక్తిని బలహీనపరచనున్నాయట. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఓ మీడియా సంస్థ కథనం పేర్కొంది. ఏడాదిన్నర కాలంగా కరోనా వ్యాప్తితో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గిపోయింది. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరిస్తున్నారు. పాఠశాలలు మూసివేయడంతో చిన్నారులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. తోటివారితో కలిసి ఆడుకోవడం, బయట తిరగడం దాదాపు తగ్గిపోయింది. దాంతో వారికి వైరస్, బ్యాక్టీరియా వంటి వ్యాధి కారకాలు సోకే అవకాశం గణనీయంగా తగ్గింది. 

9. FAME II: యాంపియర్‌ ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు

ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ యాంపియర్ వెహికల్స్ తమ వాహన శ్రేణిలోని ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. తాజాగా ఫేమ్‌-2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) సబ్సిడీని కేంద్రం సవరించింది. ఇందులో భాగంగా జీల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ.68,990 నుంచి రూ.59,990కి.. మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ.74,990 నుంచి రూ.65,990కి తగ్గిస్తున్నట్లు యాంపియర్ వెహికల్స్ ప్రకటించింది. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడంలో భాగంగానే ధరలను తగ్గించినట్లు యాంపియర్‌ ఎలక్ట్రిక్‌ సీఓఓ రాయ్‌ కురియన్ వెల్లడించారు.

10. Sanjay manjrekar: ట్విటర్‌ వల్ల నష్టమే ఎక్కువ!

సామాజిక మాధ్యమాలను తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నానని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. ట్విటర్‌ వల్ల తనకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో ఇప్పటికీ అర్థమవ్వడం లేదని వాపోయాడు. క్రికెట్‌ వ్యాఖ్యానం చేయడంలో సంజయ్‌ మంజ్రేకర్‌ మేటి! ఆట పరంగా విశ్లేషణ బాగుంటుంది. కొన్నిసార్లు ఆటగాళ్లపై చేసే వ్యాఖ్యలు మాత్రం  వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో రవీంద్ర జడేజాపై చేసిన బిట్స్‌ అండ్‌ పీసెస్‌ అతడికి చేటు చేసింది. 

WTC Final: లైవ్‌ అప్‌డేట్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని