
తాజా వార్తలు
డీఎంకే ఒప్పుకొంటే కూటమికి సిద్ధం: కమల్
డీఎంకే ప్రతినిధి సంప్రదించాడని పేర్కొన్న ఎంఎన్ఎం అధినేత
చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని గతంలో పేర్కొన్న మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తన నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ నాలుగో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన డీఎంకే ఒప్పుకుంటే కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డీఎంకే ప్రతినిధి ఇప్పటికే తమను సంప్రదించారని తెలిపిన కమల్ పార్టీ అధిష్ఠానం నుంచి నేరుగా ఆహ్వానం అందితే పొత్తుకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార అన్నాడీఎంకే, భాజపా కూటమి.. డీఎంకే, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎంఎన్ఎం పార్టీ కూడా ప్రచారం కొనసాగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కమల్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మరణం తరువాత తమిళనాట జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.