close

తాజా వార్తలు

అద్వితీయం.. ఆఖరి వికెట్‌ విజయం!

బంతి బంతికీ ఉత్కంఠ.. క్షణక్షణానికి పెరిగే గుండె వేగం.. రెప్పపాటులో ఫలితం మారుతుందేమోనన్నట్లు కంగారు.. రెండు జట్లతో దోబూచులాడిన విజయం.. ఇలాంటి ఉద్వేగభరిత క్షణాల్ని ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ ఫైనల్లో చూశాం. విశ్వవిజేతను నిర్ణయించేందుకు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఆఖరి పోరాటం కొన్నాళ్లు క్రికెట్‌ ప్రపంచాన్నే ఊపేసింది. నాటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు పోరాడిన తీరు సగటు క్రికెట్‌ అభిమాని మదిలో పదిలమే. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్వితీయ పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. అచ్చం మళ్లీ అలాంటి పోరాటంతోనే మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ ఆల్‌రౌండర్‌.

యాషెస్‌లో మూడో టెస్టులో మరో చక్కటి ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. 359 పరుగుల లక్ష్య ఛేదనలో.. స్టోక్స్‌(135నాటౌట్‌; 219బంతుల్లో 11×4, 8×6) చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. చివరి బ్యాట్స్‌మెన్‌ లీచ్‌ సహకారంతో అభేద్యమైన ఆఖరి వికెట్‌కు 76 పరుగులు జోడించి చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశాడు. ఇంగ్లాండ్‌కు ఒక్క వికెట్‌ తేడాతో మరుపరాని విజయాన్ని అందించాడు. టెస్టు క్రికెట్‌ వంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇలాంటి ఉత్కంఠభరిత పోరాటాలు చాలా అరుదు. అయితే స్టోక్స్‌లాగా ఆఖరి దాకా అజేయంగా నిలిచి.. చివరి బ్యాట్స్‌మెన్‌ సహకారంతో సాధించిన అమోఘమైన విజయాలూ ఈ ఫార్మాట్‌ చరిత్రలో కొన్ని ఉన్నాయి. పరిమిత ఓవర్ల టోర్నీకి ఏమాత్రం తీసిపోకుండా.. అభిమానుల్ని ఆద్యంతం అలరించిన ఆ మ్యాచ్‌లేవో.. ఆ ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం..


సఫారీలకు సవాలుగా కుశాల్‌..

ఏడాది ఆరంభంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ పెరీరా పోరాటం నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆహా..! ఏమా పట్టుదల‌.. ఏమా ప్రదర్శన..!! ఫిబ్రవరిలో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు అది. మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 303 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్‌ లక్ష్య ఛేదన షురూ చేసిన లంక 110 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సఫారీ బౌలర్లు ఇంకాసేపు అదే జోరు కొనసాగిస్తే వారికి విజయం నల్లేరుపై నడకే. కానీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ పెరీరా(153 నాటౌట్‌; 200బంతుల్లో 12×4, 5×6) వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. డిసిల్వా(48; 79బంతుల్లో 6×4)తో ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించి మ్యాచ్‌ను దాదాపు లంకవైపు తిప్పాడు. కానీ తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి సఫారీ బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు లాగేసుకున్నారు. స్టెయిన్‌, ఫిలాండర్‌, రబాడతో కూడిన పటిష్ఠ పేస్‌ త్రయం పదునైన బంతులతో వణికిస్తున్నారు. కానీ కుశాల్‌ మాత్రం వారిని ఆచితూచి ఎదుర్కొంటూ తన పోరాటాన్ని సాగించాడు. చివరి బ్యాట్స్‌మెన్‌ ఫెర్నాండో(6; 27బంతుల్లో)ను కాపాడుకుంటూ వారికి ఎదురొడ్డాడు. అంతే అభేద్యమైన పదో వికెట్‌కు 78 పరుగులు జోడించి తన జట్టును ఆఖరి వికెట్‌పై గెలిపించాడు. ఛేదనలో టెస్టు క్రికెట్‌ చరిత్రలో పదో వికెట్‌కు అతి పెద్ద భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.


కంగారూలను వణికించిన లారా..

విండీస్‌ క్రికెట్‌లో ఎన్నో రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌ బ్రయాన్‌ లారా. ఇక టెస్టు ఫార్మాట్‌లో అతని రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1999లో కంగారూ జట్టుతో మూడో టెస్టు అది. ముందు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ రెండు ఇన్నింగ్‌ల్లో భారీగా బాదేసి 307 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బంతితోనూ తిప్పేసి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలుద్దామనుకున్నారు ఆసీస్‌ ఆటగాళ్లు. అందుకు తగ్గట్టుగానే ఛేదనకు దిగిన విండీస్‌ను 105 పరుగులకే ఐదు కీలక వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టేశారు. కానీ అప్పుడే క్రీజులో కుదురుకుంటున్న లారా(153 నాటౌట్‌; 256 బంతుల్లో 19×4, 1×6) నిదానంగా పోరాటం సాగించాడు. జిమ్మీ ఆడమ్స్‌(38; 125 బంతుల్లో 5×4)తో ఆరో వికెట్‌కు 133 పరుగులు.. తొమ్మిదో వికెట్‌ ఆంబ్రోస్‌(12; 39బంతుల్లో 2×4)తోనూ కీలక భాగస్వామ్యమే నెలకొల్పాడు. కానీ అనూహ్యంగా ఆంబ్రోస్‌ అనవసరపు షాట్‌కు వెనుదిరిగాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసింది. లారా మాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆఖరి బ్యాట్స్‌మెన్‌ వాల్ష్‌(0 నాటౌట్‌; 5బంతుల్లో) సహకారంతో.. ఒక్క వికెట్‌ తేడాతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లారా 8 పరుగులకే ఔట్‌ కావడం గమనార్హం.


సొగసరి ఇన్నింగ్‌ల్లో మరొకటి..

సుదీర్ఘ ఫార్మాట్‌లో సొగసరి బ్యాట్స్‌మెన్‌ లక్ష్మణ్‌ ప్రత్యేకతే వేరు. 2010 మొహాలీలో ఆసీస్‌తో తొలి టెస్టు నాటి సంగతి ఇది. ముందు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 215 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. స్వల్ప లక్ష్యమే కదా ఇక ధోనీసేనకు విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ ప్రత్యర్థి బౌలర్లు అవకాశమిస్తే కదా.. పదునైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించారు. తొలి ఓవర్‌లోనే గంభీర్ డకౌట్... కాసేపటికే ద్రవిడ్‌(13) కూడా అదే బాట. చూస్తుండగానే 76 పరుగులకే ఐదు వికెట్లు టపటపా కూలాయి. అప్పుడు సచిన్‌(38; 64బంతుల్లో 5×4)తో కలిసి లక్ష్మణ్‌(73 నాటౌట్‌; 79బంతుల్లో 8×4) చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆరో వికెట్‌కు సచిన్‌తో 43 పరుగులు.. ఇషాంత్‌(31; 92బంతుల్లో 5×4)తో తొమ్మిదో వికెట్‌కు 81 పరుగుల విలువైన భాగస్వామ్యన్ని నెలకొల్పాడు. మరో 10 పరుగులు చేస్తే విజయం భారత్‌దే. అంతలోనే లంబూ ఎల్బీ. భారత శిబిరంలో మళ్లీ ఆందోళన. కానీ లక్ష్మణ్‌ వారికి అవకాశం ఇస్తేనేగా.. తన అనుభవాన్ని ఉపయోగించి ఆఖరి బ్యాట్స్‌మెన్‌ ఓజా(5నాటౌట్‌; 10బంతుల్లో)తో లాంఛనాన్ని పూర్తి చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వీవీఎస్‌ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కేవలం రెండు పరుగులే చేశాడు. 


పసికూనపై ఇంజీ పోరాటం..

టెస్టు క్రికెట్‌లో దాయాది పాకిస్థాన్‌కు పసికూన బంగ్లా చేతిలో చావుతప్పిన మ్యాచ్‌ ఇది. 2003లో ముల్తాన్‌లో మూడో టెస్టులో టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ రెండు ఇన్నింగ్‌ల్లో కలిపి 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మోస్తరు లక్ష్యమే కదా అంటూ ఉదాసీనతతో ఛేదన షురూ చేసిన పాక్‌కు బంగ్లాదేశ్‌ బౌలర్లు ఆరంభంలోనే ఊహించని షాక్‌ ఇచ్చారు. 99 పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపారు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే.. ఇంజమామ్‌(138 నాటౌట్‌; 232 బంతుల్లో 20×4, 1×6) మాత్రం గొప్ప పోరాటం చేశాడు. తొమ్మిదో బ్యాట్స్‌మెన్‌ ఉమర్‌ గుల్‌(5; 50బంతుల్లో)తో జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చాడు. మరో నాలుగు పరుగులు చేస్తే పాక్‌దే గెలుపు అనుకునేలోపే గుల్‌ రనౌట్‌. ఇక పాక్‌ ఓటమి తథ్యమన్నట్లు ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ ఇంజీ బెదరలేదు. చివరి బ్యాట్స్‌మెన్‌ యాసిర్‌ ఆలీ(1నాటౌట్‌; 4బంతుల్లో) తోడ్పాటుతో తన జట్టును ఒక్క వికెట్‌ తేడాతో గెలిపించుకున్నాడు. అలా ఇంజమామ్‌ పోరాటం వల్ల పాక్‌ బతికిపోయింది. లేకుంటే బంగ్లాదేశ్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి విజయం నమోదు చేసేదే. 


బాటలు పరిచిన మహేలా..

టెస్టు క్రికెట్‌ చరిత్రలో రికార్డు ఛేదనల్లో ఇదో మ్యాచ్‌. 2006 కొలంబో రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌ సఫారీలు.. లంక ముందు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసిన లంకకు ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు అన్నట్లే కనిపించింది. కానీ ఊహించని విధంగా ఆరంభంలోనే తరంగ డకౌట్‌. అయినా మరో ఓపెనర్‌ జయసూర్య(73), సంగక్కర(39)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ వచ్చాడు. సాఫీగా సాగుతున్న వీరి జోరుకు మళ్లీ బ్రేక్‌. అప్పటికీ స్కోరు 121/3. తర్వాత నుంచి సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. కానీ మహేలా జయవర్ధనే(123; 248బంతుల్లో 11×4, 2×6) మాత్రం ఎదురు నిలిచాడు. పరుగు పరుగుతో విలువైన ఇన్నింగ్స్‌ నిర్మించాడు. మరో 11 పరుగులు సాధిస్తే విజయం లంక ఖాతాలో. కానీ అంతలోనే ఏడో వికెట్‌ రూపంలో గిబ్స్‌ చేతికి చిక్కాడు మహేలా. అతని వెంటే చమిందా వాస్‌(4), మురళీధరన్‌(2). ఇంకో వికెట్‌ పడితే లంక ఓడినట్లే. కానీ క్రీజులో పాతుకుపోయిన మహరూఫ్‌(29నాటౌట్‌; 118బంతుల్లో 2×4) ప్రోటీస్‌ విజయానికి అడ్డుపడ్డాడు. చివరి బ్యాట్స్‌మెన్‌ మలింగ(1 నాటౌట్‌)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేసి.. ఒక్క వికెట్‌ తేడాతో లంకకు మరపురాని విజయాన్ని అందించాడు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.