
తాజా వార్తలు
గుజరాత్ ‘స్థానిక’ పోరులోనూ భాజపాదే హవా!
గాంధీనగర్: గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా హవా చాటింది. జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు. మొత్తం 31జిల్లా పంచాయతీలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహాలో ఫలితాలు పునరావృతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. భాజపా ప్రభుత్వ సుపరిపాలనకు ఈ ఫలితాలే నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 31 జిల్లా పంచాయతీలు, 81 మున్సిపాలిటీలు, 231 తాలుకా పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. 31 జిల్లా పంచాయతీల్లో 980 స్థానాలు ఉండగా వీటిలో 742 స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ కేవలం 137 చోట్లకే పరిమితమైపోయింది. ఇక 231 తాలూకా పంచాయతీల్లోని 4774 స్థానాలకు గానూ భాజపా 2720 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 994 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో కైవసం చేసుకొని సత్తా చాటింది. మరికొన్ని చోట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక 81 మున్సిపాలిటీల్లో దాదాపు 60 స్థానాల్లో భాజపా మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ కేవలం పది స్థానాల్లోనే ఆధిక్యత కనబరిచింది. తొలిసారి బరిలోకి దిగిన ఆమ్ఆద్మీ పార్టీ పలు స్థానాల్లో తన ప్రభావాన్ని చూపించగలిగింది.
ప్రజలకు మోదీ, షా, నడ్డా కృతజ్ఞతలు
‘గుజరాత్లో జరిగిన నగరపాలిక, తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాకే రాష్ట్రం మొత్తం మద్దతు తెలిపింది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో పేర్కొన్నారు. పార్టీ పట్ల చూపించిన విశ్వాసం, ఆప్యాయతలకు గుజరాత్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. భాజపా పట్ల మరోసారి నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడి రాజీనామా..
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురవ్వడంతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్దా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పరేష్ ధనాని కూడా ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.