close

తాజా వార్తలు

Published : 29/07/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డోడో.. చుట్టాలం!

 

రంగు చూసి నెమలనుకుంటారు, రూపుచూసి గిన్నికోడి అనుకుంటారు. ఇంతకీ మేమేవరమంటే.. పావురాల్లో పెద్దజాతి పక్షులం. అప్పుడెప్పుడో అంతరించిన డోడోలకు దగ్గర బంధువులం. మా గురించి ఇంకా బోలెడు సంగతులున్నాయి..

మేమెక్కువగా అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో ఉంటాం. అందుకే ‘నికోబార్‌ పీజియన్‌’ అంటారు. ఆగ్నేయ ఆసియా అంతటా కనిపిస్తాం. భారతదేశం, మలాయ్‌, సోలమన్‌, పలావు ద్వీప సమూహాల్లో ఎక్కువుంటాం. మడగాస్కర్‌, థాయ్‌లాండ్‌, మలేసిియా, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, పాపువా న్యూ గినియాలల్లోనూ మమ్మల్ని చూడొచ్ఛు.

అందమంతా ఈకల్లోనే

ఈకలు చూశారా! లోహ నీలం, ఆకుపచ్చ, రాగి రంగు కలిసి, ఎలా మెరుస్తున్నాయో! అందుకనే మొదట మమ్మల్ని నెమలికి వారసులమన్నారు. కానీ.. మా డీఎన్‌ఏ డోడోల డీఎన్‌ఏ ఒకటే! అది తెలిశాక డోడోలకు బంధువులమని తేల్చేశారు. వాటిలా మేమెక్కడ కనుమరుగవుతామో అని ఓ కన్నేసి ఉంచారు కూడా.

పొడవులో పెద్దమ్మ!

చెప్పుకోవడానికి పావురాలమే అయినా.. మా కలోనాస్‌ జాతి పావురాలు, పరిమాణంలో పెద్దగుంటాయి. మా పొడవు ఏకంగా 16 అంగుళాలు (40 సెం.మీ). తల నుంచి ఒళ్లంతా బూడిద రంగున్నా.. రెక్కలు, కొన్ని ఈకలూ రంగులద్దినట్టు మెరుస్తుంటాయి. మా తోకనైతే మీరు వెతుక్కోవాల్సిందే! తెల్లగా, చిన్నగా ఉంటుంది. ముక్కు, కాళ్లు నల్లగా ఉంటాయి. సాధారణంగా మౌనంగానే ఉంటాం. కూశామంటే బొంగురుగా కరుకుగా వినిపిస్తుంది.

మందల్లోనే మనుగడ

మా మందలో 20-30 వరకూ ఉంటాయి. కలిసే తిరుగుతాం. మేం చాలా ఎత్తులో, చాలా దూరం ఎగరగలం. అయినా నేలమీదే సంచరించేందుకు ఇష్టపడతాం. అడవిలో దొరికే పళ్లు, విత్తనాలు, ధాన్యం, కాయలు, కీటకాలని తింటాం. ముక్కుతో నేలని తవ్వి కీటకాలు, విత్తనాలను వెలికితీస్తాం. గట్టి గింజల్ని రాళ్లతో చితక్కొట్టి తినడం మాకున్న నైపుణ్యం.

గూడూ - గుడ్లు

జనవరి నుంచి మార్చి వరకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో అస్సలు ఎగరం. నేలమీదే ఆహారాన్ని వెతుక్కుంటాం. మేముండేది దట్టమైన అడవుల్లో కదా! భూమికి పదడుగుల ఎత్తులో, గుబురుగా ఉండే చెట్ల కొమ్మల్లో గూడు కడతాం. విడతకి ఒకే ఒక్క గుడ్డు పెడతాం. పొదుగు కాలం 25 నుంచి 28 రోజులు. 34-36 రోజుల్లో పిల్లలు ఎగురుతాయి. మా జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు.

జాగ్రత్తగా కాపాడండి..

పిల్లులు, కొన్ని మాంసాహార జంతువులతో మాకు ప్రాణహాని. మమ్మల్ని పెంచుకునేందుకు మనుషులు కూడా వలవేసి పట్టేస్తారు. మా మాంసం కోసమూ వేటాడేస్తారు. వీటివల్లే మా సంఖ్య తగ్గిపోతోంది. డోడోల్లా మేం కూడా అంతరించిపోతామని శాస్త్రవేత్తల బెంగ! అందుకే ఈ మధ్య ప్రత్యేక శ్రద్ధతో మమ్మల్ని సంరక్షిస్తున్నారు.

నేస్తాలూ.. ఇంకో ముఖ్యమైన సంగతి- 2018లో పలావు దీవుల పోస్టల్‌ స్టాంపుమీద మా చిత్రాన్ని ముద్రించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని