
తాజా వార్తలు
హీరోలు దడ పుట్టిస్తున్నారు!
బ్యాడ్‌బాయ్స్ అయిపోయారు
ఈ మధ్య హీరోలు విలన్లుగా మారిపోతున్నారు. గంభీరమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దడ పుట్టిస్తున్నారు. కథానాయకుడిగా ఉన్న స్టార్.. ప్రతినాయకుడి పాత్రను పోషించడం సులభమే కావొచ్చు. కానీ, దాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. అలా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని విలన్లుగా చేసి, హిట్లు కొట్టిన స్టార్స్ చాలా మందే ఉన్నారు. జగపతిబాబు, రానా, ఎన్టీఆర్, ఆది పినిశెట్టి, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ తదితరులు ప్రతినాయకులుగా, ఆ ఛాయలున్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నారు. త్వరలో మరికొందరు హీరోలు ప్రతినాయకుల లక్షణాలను ఆకళింపు చేసుకుని వెండితెరపై సందడి చేయబోతున్నారు. వారి జాబితాను ఓ సారి చూద్దాం..
పక్కింటి కుర్రాడిగా అలరించిన ‘నేచురల్ స్టార్’ నాని ఇప్పటికే ‘జెంటిల్మన్’లో కాసేపు ప్రతినాయకుడి షేడ్స్‌లో దర్శనమిచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ఇప్పుడు మరోసారి నాని విలన్‌గా కనిపించబోతున్నారు. ఆయన, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. ఇందులో నాని బ్యాడ్‌బాయ్‌గా కనిపించబోతున్నారట. ఇప్పటి వరకు వచ్చిన ఆయన ప్రచార చిత్రాల్లో కూడా విభిన్నంగా కనిపించారు. మరి ఈ చిత్రంతో ఎలా అలరించబోతున్నారో చూడాలి. నిజానికి మార్చి 25న ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నటించబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారట. ఇప్పటికే చిరు, మోహన్‌బాబు కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చి, విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మోహన్‌బాబు చివరిసారి ‘మహానటి’లో వెండితెరపై కనిపించారు. మరోపక్క సూర్య హీరోగా నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’లోనూ మోహన్‌బాబు నటిస్తున్నారు.
యువ కథానాయకుడు నవీన్ చంద్ర ‘అరవింద సమేత’లో బాల్‌రెడ్డిగా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. ఇప్పుడు ఆయన మరోసారి విలన్ అవతారం ఎత్తారట. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో నవీన్ చంద్ర ప్రతినాయకుడి పాత్ర పోషించబోతున్నారని సమాచారం. హీరో తల్లి పాత్రను నదియా పోషిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ను వాయిదా వేశారు.
తమిళ స్టార్ విజయ్ సేతుపతి అటు కథానాయకుడిగానూ, ఇటు విలన్‌గానూ మెప్పిస్తున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట’లో విలన్‌గా మెప్పించారు. చిరంజీవి అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ‘ఉప్పెన’ సినిమాలోనూ చెడ్డవాడిగా సందడి చేయబోతున్నారు. బుజ్జిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలోనూ విజయ్ నటించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి.
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆపై పలు సినిమాల్లో హీరోగా కనిపించారు. ఇటీవల వచ్చిన నాని ‘గ్యాంగ్‌లీడర్’లోనూ పవర్ఫుల్ పాత్రలో విలన్‌గా మెప్పించారు. కాగా తమిళ సినిమాలోనూ ఆయన ప్రతినాయకుడి ఛాయలుండే పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. అజిత్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న సినిమా ‘వాలిమై’. ఇందులో కార్తికేయను ప్రతినాయకుడిగా అనుకుంటున్నట్లు ప్రచారం ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
గోపీచంద్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’. వీటిలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. ఆపై హీరోగా అనేక చిత్రాల్లో నటించిన ఆయన ఇన్నేళ్లకు మళ్లీ విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నయనతార, ఖుష్బూ, కీర్తి సురేష్, మీనా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు గోపీచంద్‌ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.
కన్నడ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా ‘కేజీఎఫ్’. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ మాస్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఈ చిత్రం కోసం ఆయన్ను సంప్రదించినప్పుడు ఒప్పుకోలేదు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం, ‘చాప్టర్-2లో అధీర పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఓకే చెప్పారు.
వరుణ్‌తేజ్ తన కెరీర్లో మొదటిసారి ‘గద్దలకొండ గణేష్’ కోసం ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించారు. తమిళ సినిమా ‘జిగర్తాండా’కు తెలుగు రీమేక్ ఇది. దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు వారికి తగ్గట్టు కథలో మార్పులు చేసి తీశారు. వరుణ్ గద్దలకొండ గణేష్‌గా ఒదిగిపోయారు. ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా? అనేలా గెటప్పు, హావభావాలు కుదిరాయి. ఆయన సంభాషణలు పలికిన తీరు కూడా మెప్పిస్తుంది. హీరోగానే కాదు ఇలాంటి పాత్రల్లో కూడా అదరగొట్టగలనని వరుణ్ నిరూపించారు.
రెబల్‌స్టార్ ప్రభాస్ ‘సాహో’ కోసం తొలిసారి బ్యాడ్‌బాయ్ పాత్రను పోషించారు. ‘బాహుబలి 2’ తర్వాత ఆయన నటించిన ఈ సినిమాలో.. ఇటు అశోక్ చక్రవర్తి పాత్రలో హీరోగా, అటు సిద్ధార్థ్ నందన్ సాహోగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మెప్పించారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయిక. దాదాపు రూ.350 కోట్లతో రూపొందించిన ఈ భారీ యాక్షన్ చిత్రం దాదాపు రూ.450 కోట్లు రాబట్టినట్లు అంచనా వేశారు.
ఎటువంటి పాత్రలోనైనా జీవించే తమిళ స్టార్ విక్రమ్. ఇప్పటికే ఆయన అనేక షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించారు. ఇటీవల వచ్చిన ‘కె.కె’ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మెప్పించారు. నేరస్థుడిగా విభిన్న గెటప్‌లో అలరించారు. రాజేశ్ ఎమ్. సెల్వ దర్శకుడు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రంలో అక్షరాహాసన్, అభి హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ‘కోబ్రా’లో నటిస్తున్న విక్రమ్ ఏడు పాత్రల్లో అలరించనున్నారు. మరి ఇందులో ఏ పాత్ర ప్రతినాయక ఛాయలు ఉంటుందో చూడాలి.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం