
తాజా వార్తలు
పంజాబ్, హరియాణాల్లో హై అలర్ట్
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరియాణాలో ఆయన హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎట్టిపరిస్థితుల్లో ఆటంకం తలెత్తకుండా చూడాలని పోలీస్ డిప్యూటీ కమిషనర్లు, కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది. మరోవైపు, సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసుల రద్దు బుధవారం సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని హరియాణా ప్రభుత్వం స్పష్టంచేసింది.
రైతులారా.. దిల్లీ ఖాళీ చేయండి: అమరీందర్
పంజాబ్‌లోనూ సీఎం అమరీందర్ సింగ్ హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతలు క్షీణించకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. నిజమైన రైతులంతా దిల్లీని తక్షణమే ఖాళీ చేసి బోర్డర్ వద్దకు తిరిగి వచ్చేయాలని అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ ఉద్యమంలో కొన్ని శక్తులు హింసకు పాల్పడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు శాంతియుత పోరాటాల పట్ల ఉన్న మంచి ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయన్నారు.
మరోవైపు, ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రైతులంతా తిరిగి నిరసన స్థావరాలకు చేరుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విజ్ఞప్తి చేసింది. రైతుల ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించింది. త్వరలోనే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు తెలిపారు.
హింస పరిష్కారం కాదు: రాహుల్
హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటనల్లో ఎవరైనా గాయపడితే.. అది దేశానికే నష్టమన్నారు. దేశ ప్రయోజనాల కోసం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనల్ని సమర్థించలేం.. కారణాల్నీ విస్మరించలేం: పవార్
ఇవాళ దిల్లీలో ఆందోళనలు జరిగిన తీరు విచారకరమని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. రైతులు తమ స్వస్థలాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై నిందలు వేసే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వొద్దన్నారు. ఇవాళ జరిగిన ఘటనలు సమర్థించదగినవి కాదన్న ఆయన.. ఈ ఆందోళనలకు దారితీసిన కారణాలూ విస్మరించేవి కాదని తెలిపారు. రైతుల విషయంలో కేంద్రం తన బాధ్యతను నెరవేర్చలేదన్నారు. కేంద్రం పరిణతితో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికైనా ప్రధాని చర్చించాలి: స్టాలిన్
దిల్లీలో ఇవాళ్టి ఘటనలపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు. చర్చల పేరుతో కేంద్రం నాటకమాడిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు ప్రభుత్వం రాజకీయాలు చేసేందుకు ఉపయోగపడతాయనే విషయాన్ని రైతులు గ్రహించాలని కోరారు. ఇరు వర్గాలు చర్చల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
క్రూరమైన సాగు చట్టాలు ఉపసంహరించుకోవాలి: దీదీ
సున్నితమైన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేలా కేంద్రం చర్చలు జరపాలని కోరారు. క్రూరమైన ఈ సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని దీదీ డిమాండ్ చేశారు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సౌగత్‌రాయ్ అన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాల రద్దు గురించి కేంద్రం వైఖరిని దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..
దిల్లీలో టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!
ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారు: తికాయత్