
తాజా వార్తలు
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్‌పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపడానికి సహేతు కారణాలు లేవని పేర్కొంది. ‘‘రాజ్యాంగంలోని 9, 9ఏ షెడ్యూల్ ప్రకారం కాల పరిమితిలోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్ దే. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి అధికారాలు ఉన్నాయో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కూ అలాంటి అధికారాలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. ఎన్నికల కమిషన్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. స్థానిక ఎన్నికలు జరిగితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు. వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరడంలో సహేతుకంలేదు. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికల నిర్వహణ సబబే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమెరికాతో పాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని గుర్తు చేసింది.
షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం : ఎస్ఈసీ
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్ఈసీ వెల్లడించారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలపై ఆది నుంచి వివాదాలే..
రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ గతేడాది మార్చిలో మొదలైంది. 2020 మార్చి 7న రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మార్చి 7న నోటిఫికేషన్ విడుదల చేయగా, పురపాలక ఎన్నికలకు మార్చి 9న నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్చి 15న నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉండగా.. అదే రోజు ఎన్నికల నిలిపివేతపై ఎస్ఈసీ నిర్ణయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలు నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ సీఎం జగన్ సహా మంత్రులు, అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల నిలిపివేతను సమర్థించింది. ఆ తర్వాత కొన్నాళ్లు అనూహ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ కనగరాజన్ ను ఎస్ఈసీగా నియమించింది. దీనిపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యాయపోరాటం చేశారు. కొన్నాళ్ల పాటు ఈ విచారణ సాగగా.. చివరకు నిమ్మగడ్డ తొలగింపును న్యాయస్థానాలు తప్పుబట్టాయి. దీంతో తిరిగి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది.
ఎస్ఈసీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 28న స్థానిక ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో వరుసల భేటీలు నిర్వహించారు. అనంతరం పార్టీల అభిప్రాయాలకు తన అభిప్రాయాన్ని జోడించి హైకోర్టుకు నివేదించారు. అక్టోబరు 27న రాష్ట్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్లతో గంటలపాటు చర్చలు జరిపినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ విస్తృతి, తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్టు వివరించారు. తమకు ప్రభుత్వం సహకారం అందించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నవంబరు 3న హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనంతరం నవంబరు 17న స్థానిక ఎన్నికల విషయమై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఎస్ఈసీ స్పష్టం చేశారు. సన్నద్ధం కావాలని ప్రభుత్వానికి సూచించారు. నవంబరు 18న గవర్నర్ ను కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై ఎస్ఈసీ చర్చించారు. నవంబరు 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలతో వీడియోకాన్ఫరెన్స్‌కు ఎస్ఈసీ ప్రయత్నించగా...అధికారులు హాజరు కాలేదు. కొవిడ్ వల్ల పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ లేఖ రాశారు. నవంబరు 19న మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రయత్నించగా..ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో చివరకు రద్దు చేశారు.
నవంబరు 23న నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తన లేఖతో జత చేసి పంపారు. అ దే సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేసింది. ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని తప్పుబడుతూ... గవర్నర్‌కు డిసెంబరు 5న ఎస్ఈసీ లేఖ రాశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో డిసెంబరు 18న ఎస్ఈసీ హైకోర్టులోకోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం..ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు ఎస్ఈసీ కలిసి చర్చించాలని, దానిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సంప్రదింపుల తర్వాత ఎన్నికల నిర్వహణపై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని డిసెంబరు 23న కోర్టు తీర్పు ఇచ్చింది. ఉత్తర్వుల ప్రతులను డిసెంబరు 29న విడుదల చేసింది. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లోపు ప్రభుత్వం నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి ఎస్ఈసీని సంప్రదించాలని తెలిపింది. ఉత్తర్వుల ప్రతులను జనవరి 5న ప్రభుత్వం అందుకుంది, జనవరి 8న రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీ ని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. సమావేశం తర్వాత జనవరి 8న ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. జనవరి 11న విచారణ జరిపిన సింగిల్ జడ్జి .. ఎస్ఈసీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేపై ఎస్ఈసీ.. డివిజన్ బెంచ్ ముందు రిట్ దాఖలు చేసింది. దీనిపై ఈనెల 18న హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వులో ఉంచి ఇవాళ వెలువరించింది.
ఇవీ చదవండి...
కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
ఆర్టీసీ బస్సులో రూ.50లక్షలు పట్టివేత