ఉద్రిక్తంగా మహిళా రైతుల ఆందోళన 
close

తాజా వార్తలు

Updated : 08/03/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్రిక్తంగా మహిళా రైతుల ఆందోళన 

మందడం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి మహిళా రైతులు రాజధాని కోసం మరోసారి ఆందోళన బాటపట్టారు. దుర్గమ్మ దర్శనానికి ర్యాలీగా వెళ్తున్న మహిళలను పోలీసులు ప్రకాశం బ్యారేజీపై అడ్డుకున్నారు. దీంతో బ్యారేజీపైనే బైఠాయించి నిరసన తెలిపిన మహిళల్ని మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత వాసులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేసి మహిళలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

వెలగపూడిలో ఉద్రిక్తత
ప్రకాశం బ్యారేజీపై అందోళన చేస్తున్న మహిళా రైతులను నిర్భందించడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయపూడి నుంచి మందడం వస్తున్న రైతుల్ని పోలీసులు వెలగపూడి వద్ద అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి రాకపోకల్ని నిలువరించారు. మందడం శివాలయం సెంటర్లో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పురుగు మందు డబ్బాలను చేతపట్టుకున్నారు.

ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఏడాదికి పైబడి నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జై అమరావతి.. సేవ్‌ అమరావతి అంటూ నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన మహిళల్ని విడుదల చేయాలని, అంత వరకూ వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని