
తాజా వార్తలు
శ్రీదేవి తర్వాత అది నాకే సాధ్యం: కంగన
దానితో నా కెరీర్ మారిపోయింది
ముంబయి: ప్రముఖ నటి శ్రీదేవి తర్వాత సినిమాల్లో కామెడీ పాత్రలు చేయగలిగిన ఘనత తనదేనని నటి కంగనా రనౌత్ తెలిపారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తాను కథానాయికగా నటించిన ‘తను వెడ్స్ మను’ విడుదలై ఈ ఏడాదితో పదేళ్లు అయిన సందర్భంగా కంగన హర్షం వ్యక్తం చేశారు. అప్పటివరకూ ఒకే రకమైన చిత్రాల్లో నటించిన తన కెరీర్ని ఈ సినిమా మార్చేసిందని నటి తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు.
‘‘తను వెడ్స్ మను’ ముందు వరకూ ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించాను. కానీ ఈ సినిమా నా వృత్తిపరమైన జీవితాన్నే మరొక విధంగా మార్చేసింది. ఇందులో విభిన్నమైన కథతోపాటు నా నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాను. నా కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది. లెజండరీ నటి శ్రీదేవి తర్వాత అంతలా కామెడీ చేయగలిగింది నేనే’ అని కంగన ట్వీట్ చేశారు.