
తాజా వార్తలు
బ్యాక్టీరియా రహితంగా ఆహార పదార్థాల నిల్వ!
దిల్లీ: ఆహార పదార్థాల్ని బ్యాక్టీరియా రహితంగా నిల్వ చేసేందుకు మద్రాస్ ఐఐటీ పరిశోధకులు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఆహార పదార్థాల నిల్వకు ఉపయోగపడేలా ఎకో ఫ్రెండ్లీ ‘ఫుడ్ రాపింగ్ మెటీరియల్’ను రూపొందించారు. ఈ మెటీరియల్ ఆహారాన్ని బ్యాక్టీరియా రహితంగా ఉంచడమే కాకుండా.. భూమిలో సులువుగా కలిసిపోతుందని వారు తెలిపారు. దీన్ని రూపొందించిన బృంద సభ్యులు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
‘‘ఆహార పదార్థాల నిల్వ కోసం రాపర్ తయారు చేయాలనేది మా ఆలోచన. అందులో భాగంగా మేం రెండు విషయాల్ని ప్రామాణికంగా తీసుకున్నాం. మేం తయారు చేసే రాపర్ నిల్వ చేసే ఆహార పదార్థాల్ని బ్యాక్టీరియా నుంచి రక్షించడమే కాకుండా.. భూమిలో సులువుగా కలిసిపోవాలి. ఈ మెటీరియల్ పరిస్థితులను బట్టి 21 రోజుల్లో భూమిలో కలిసిపోతుంది. పర్యావరణహితంగా ఉండే ఈ పదార్థం ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ఐఐటీ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ముకేశ్ దొబ్లే తెలిపారు. ‘‘మేం రూపొందించిన ఫుడ్ రాపర్తో పనీర్, మటన్, చికెన్ ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేసి పరీక్షించాం. దాదాపు 10 రోజుల పాటు పరీక్షించగా అది బ్యాక్టీరియా రహితంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడింది. పన్నీర్ నిల్వను సైతం ఎక్కువ రోజులు వచ్చేలా చేసింది’’ అని పూజా కుమారి అనే మరో పరిశోధకురాలు పేర్కొన్నారు.