
తాజా వార్తలు
ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్లో మనం చూసే వెబ్సైట్లు.. వెతికే సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే సెర్చ్ ఇంజిన్లలో ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ అనే ఆప్షన్‌ను వినియోగిస్తుంటాం. రహస్య శోధన కోసం ఇది ఎంతో ఉపయోగకరమని భావిస్తున్నాం. కానీ, మీరు ఎప్పుడైనా గమనించారా?ఇన్‌కాగ్నిటో మోడ్‌లో మీరు శోధన చేసినా మీరు ఇది వరకు వెతికిన అంశాలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తుంటాయి. అదేంటి? ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నా మన కదలికల్ని కనిపెడుతున్నారా అని నివ్వెరపోకండి. ఈ మోడ్ మీరు ఊహించినంత సురక్షితం కాదని తెలుసుకోండి.
ఇన్‌కాగ్నిటో పనితీరు
యూజర్ సాధారణంగా వెబ్‌బ్రౌజింగ్ చేస్తే హిస్టరీ లోకల్ డ్రైవ్‌లో నిక్షిప్తమై హిస్టరీ పేజీలో కనిపిస్తుంది. కానీ, ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్ చేస్తే ఆ కంప్యూటర్లో బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్సైట్ డేటా నిక్షిప్తం కాదు. యూజర్‌ను ట్రాక్ చేయడం కోసం వెబ్సైట్లు ఉపయోగించే కుకీస్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నప్పుడు పనిచేయవు. అలాగే ఏవైనా ఆన్లైన్ అప్లికేషన్స్‌లో మనం నింపే సమాచారం నిక్షిప్తమవ్వదు. మీరు ఈ మోడ్‌లో ఏ వెబ్సైట్లోనైనా లాగ్ఇన్ అయ్యారునుకోండి.. దాన్ని క్లోజ్ చేసి తెరిస్తే.. మళ్లీ లాగ్ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఆటోఫిల్ ఫీచర్ పనిచేయదు. ఒక్కసారి మీరు ఇన్‌కాగ్నిటో ఉపయోగించి క్లోజ్ చేసిన తర్వాత గత శోధనకు సంబంధించి ఏవీ మీకు తిరిగి కనిపించవు.
అసలు నిజం
ఇన్‌కాగ్నిటో మోడ్‌లో మీరు సెర్చ్ చేసే వెబ్సైట్ల హిస్టరీ మీకు మాత్రమే కనిపించదంతే. మీరు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో.. మీరు చూసే వెబ్సైట్లు, మీకు ఇంటర్నెట్ సేవలు కల్పిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు, పనిచోట కంప్యూటర్లయితే కంపెనీ యాజమాన్యాలు, పాఠశాలలో కంప్యూటర్లయితే పాఠశాల యాజమాన్యాలు ట్రాక్ చేయగలవు. వారి సర్వర్లలో మీ బ్రౌజింగ్ హిస్టరీ నిక్షిప్తమవుతుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నా చాలా వెబ్సైట్లు కుకీస్‌కు అనుమతించమని కోరుతుంటాయి.
గూగుల్, ఫేస్బుక్ సహా అనేక వెబ్సైట్లు యూజర్ ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించినా ఇంటర్నెట్లో వారు చేస్తున్న పనుల్ని ట్రాక్ చేస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఏయే వెబ్సైట్లు చూస్తున్నారు.. వారి ఆసక్తులేంటనే విషయాన్ని పసిగడుతున్నాయి, ముఖ్యంగా అశ్లీల వెబ్సైట్లు యూజర్ల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధ్యయనాల్లో పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని వెబ్సైట్లు యూజర్ చూస్తున్న వెబ్సైట్లు, శోధిస్తున్న అంశాలను, ఇతర డేటాను థర్డ్‌పార్టీ సంస్థలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు చేరవేస్తున్నాయని తేలింది. గూగుల్, ఫేస్బుక్ కూడా యూజర్లు ఆన్లైన్ పనుల్ని ట్రాక్ చేస్తుండటంతో ఏ వెబ్సైట్ తెరిచినా వారి ఆసక్తులను బట్టి అడ్వర్టైజ్మెంట్ను ప్రదర్శిస్తున్నాయి. దీన్ని బట్టి.. ఇంటర్నెట్ ప్రపంచంలో వ్యక్తిగత గోప్యత కష్టమనే నిజాన్ని నమ్మితీరాల్సిందే.