close
Array ( ) 1

తాజా వార్తలు

కివీస్‌పై వరుసగా మూడో విజయం

మౌంట్‌ మాంగనుయ్‌: కోహ్లీసేనకు తిరుగులేదు. న్యూజిలాండ్‌పై వరుసగా మూడో వన్డే గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ముందు బౌలర్లు.. తర్వాత బ్యాట్స్‌మన్‌ సమష్టిగా రాణించారు. నిలకడతో అదరగొట్టారు. దెబ్బకు కివీస్‌ చేసేదేమీ లేక డీలా పడిపోయింది. ఒకప్పుడు ఆసీస్‌, కివీస్‌ పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడాలంటే టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు పేస్‌. మరోవైపు మణికట్టు మాయ. భీకరమైన టాప్‌, మిడిలార్డర్‌. అందుకే భారత్‌ వరుసగా రెండో వన్డే సిరీస్‌ను గెలిచింది. స్మిత్‌, వార్నర్‌ లేని ఆసీస్‌పై సునాయాసంగా గెలిచిందన్న మాటలకు ఘాటు సమాధానం చెప్పింది కోహ్లీసేన. నిలకడకు పేరైన పటిష్ఠ న్యూజిలాండ్‌ జట్టుపై జైత్రయాత్ర కొనసాగించింది. ఇక విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. 63 వన్డేలకు సారథ్యం వహించగా 47 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. క్లైవ్‌లాయిడ్‌, రికీ పాంటింగ్‌ 50 వన్డే విజయాల రికార్డుకు చేరువలో నిలిచాడు.

కోహ్లీ-శర్మ బ్యాటింగ్‌ విన్యాసం 

న్యూజిలాండ్‌ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభమే లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (28; 27 బంతుల్లో 6×4), రోహిత్‌ శర్మ (62; 77 బంతుల్లో 3×4, 2×6) పోటీ పడి ఆడారు. కాగా, జట్టు స్కోరు 39 వద్ద గబ్బర్‌ను బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (60; 74 బంతుల్లో 6×4) మరోసారి తన అందమైన ఆటను ప్రదర్శించాడు. సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూనే సొగసైన కవర్‌డ్రైవ్‌లు ఆడాడు. అతడికి తోడుగా రోహిత్‌ శర్మ అప్పుడప్పుడు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రోహిత్‌శర్మను ఔట్‌ చేయడం ద్వారా శాంట్నర్‌ విడదీశాడు. అప్పుడు స్కోరు 152. మరికాసేపటికే కోహ్లీని బౌల్ట్‌ పెవిలియన్‌ పంపించాడు. అప్పటికే చేయాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో భారత్‌ విజయం సాధించేందుకు కష్టపడలేదు. అంబటి రాయుడు (40; 42 బంతుల్లో 5×4, 1×6), దినేశ్‌ కార్తీక్‌ (38; 38 బంతుల్లో 5×4, 1×6) పోటీపడి ఆడారు. నువ్వానేనా అన్నట్టు బౌండరీలు బాదేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దీంతో కోహ్లీసేన 43 ఓవర్లకే ఛేదన పూర్తిచేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షమికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

మళ్లీ షమి..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. మార్టిన్‌ గప్తిల్‌ (13), కొలిన్‌ మన్రో (7), కేన్‌ విలియమ్సన్‌ (28) జట్టు స్కోరు 59 లోపే పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో టామ్‌ లేథమ్‌ (51; 64 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ (93; 106 బంతుల్లో 9×4) చెలరేగాడు. శతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆచితూచి ఆడుతోనూ చూడచక్కని షాట్లతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లేథమ్‌ను ఔట్‌ చేయడం ద్వారా చాహల్‌ విడదీశాడు. అప్పుడు జట్టు స్కోరు 178. ఒక వైపు వికెట్లు పడుతున్న టేలర్‌ ప్రతిఘటించాడు. 222 పరుగుల వద్ద షమి అతడిని పెవిలియన్‌ పంపించాడు. కివీస్‌ 243 పరుగులకు ఆలౌటైంది. షమి 3, భువి, చాహల్‌, పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.