రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌
close

తాజా వార్తలు

Updated : 25/02/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూట్‌ ‘పంచ్’: టీమ్‌ఇండియా 145కే ఆలౌట్‌‌

మొతేరాలో ‘గులాబి’ ముళ్ల సవాళ్లు

ఫొటో: బీసీసీఐ ట్విటర్‌

అహ్మదాబాద్‌: అంగరంగ వైభవంగా ఆరంభమైన మొతేరా స్టేడియం సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో జరుగుతున్న గులాబి టెస్టు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఇంగ్లాండ్‌ ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో 112కే ఆలౌటవ్వడం ఆశ్చర్యం కలిగిస్తే.. టీమ్‌ఇండియా 145కే బ్యాట్లెత్తేయడం సంచలనంగా మారింది. రెండో రోజు ఆట ఆరంభించిన కోహ్లీసేనను జాక్‌ లీచ్ (4/54)‌, జో రూట్‌ (5/8) రెండు గంటల్లోనే ఆలౌట్‌ చేసేశారు. ఆధిక్యాన్ని కేవలం 33కు పరిమితం చేశారు.

33 మేలే అయినా!

టీమ్‌ఇండియా 99/3తో రెండోరోజు, గురువారం ఆట మొదలు పెట్టినప్పుడు భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకున్నారు! దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ (66; 96 బంతుల్లో 11×4), నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న అజింక్య రహానె (7; 25 బంతుల్లో 1×4) జట్టుకు తిరుగులేని ఆధిక్యం అందిస్తారనే భావించారు! కానీ తొలిరోజు ఇంగ్లాండ్‌ చేసిన పొరపాట్లే చేసింది కోహ్లీసేన. స్పిన్‌ను సాధికారికంగా ఎదుర్కోకుండా బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసింది! కేవలం 33 పరుగుల ఆధిక్యంతోనే సరిపుచ్చుకుంది. రెండో రోజు 46 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకొని 145కు చాపచుట్టేసింది. ప్రస్తుత పిచ్‌పై ఈ స్వల్ప ఆధిక్యం మేలే అయినప్పటికీ కనీసం మరో 100 పరుగులు చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది.

బంతితో ‘రూట్‌’ వేశాడు

బ్యాటుతో పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ ఈ సారి బంతితో చెలరేగాడు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా అద్భుతాలు సృష్టించాడు. కేవలం 32 బంతులు విసిరి 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. అందులో మూడు మెయిడిన్‌ ఓవర్లు విసిరి 8 పరుగులే ఇచ్చాడు. రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ను రోహిత్‌, రహానెను ఔట్‌చేయడం ద్వారా జాక్‌ లీచ్‌ మొదట దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రూట్‌ తన పని మొదలుపెట్టాడు. రిషభ్‌ పంత్‌ (1), అశ్విన్‌ (17), వాషింగ్టన్‌ సుందర్‌ (0), అక్షర్‌ పటేల్‌ (0), జస్ప్రీత్‌ బుమ్రా (1)ని వరుసగా ఔట్‌ చేశాడు. అశ్విన్‌ కాసేపు ప్రతిఘటించినా అవతలివైపు నుంచి అతడికి అండ లభించలేదు. అక్షర్‌ దూకుడుగా ఆడి ఒత్తిడి చేద్దామనుకొని విఫలమయ్యాడు. కేవలం ఇషాంత్‌ (10; 20 బంతుల్లో 1×6) మాత్రమే అజేయంగా నిలిచాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని